
ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ బాధ్యతలు
జస్టిస్ ఏకటి మానవేంద్రనాథ్ రాయ్ సోమవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. నెల్లపాడులోని రాష్ట్ర హైకోర్టు మొదటి కోర్టు హాలులో ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాకూర్ ఆయనతో న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయించారు.
జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ స్వస్థలం ఉమ్మడి విజయనగరం జిల్లాలోని పార్వతీపురం. ఆయన న్యాయవాద వృత్తిని కొనసాగించి, 2002లో జిల్లా న్యాయమూర్తి కేడర్‌లో నియమితులయ్యారు. ఆయన తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో పనిచేశారు. 2015 జూలై నుంచి హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌గా, 2019 జూన్ నుంచి ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. 2023 నవంబర్‌లో ఆయన గుజరాత్ హైకోర్టుకు బదిలీ అయ్యారు. గుజరాత్ హైకోర్టు నుంచి తిరిగి సొంత రాష్ట్రానికి బదిలీపై వచ్చి, రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, అడ్వకేట్ జనరల్ అదనపు సొలిసిటర్ జనరల్, హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పాల్గొన్నారు.
