
ఏపీ హైకోర్టుకు అదనపు న్యాయమూర్తి జస్టిస్ బాలాజీ మేడమల్లి ప్రమాణ స్వీకారం
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా జస్టిస్ బాలాజీ మేడమల్లి గురువారం పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి హైకోర్టుకు చెందిన పలువురు న్యాయమూర్తులు, రిజిస్ట్రార్ జనరల్, సీనియర్ న్యాయ అధికారులు బార్ అసోసియేషన్ ప్రతినిధులు హాజరై నూతన న్యాయమూర్తికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రమాణ స్వీకారం ముగిసిన వెంటనే జస్టిస్ మేడమల్లి ఫస్ట్ కోర్ట్ హాల్‌కు చేరుకుని అధికారికంగా బాధ్యతలు చేపట్టారు.
జస్టిస్ మేడమల్లి ప్రస్థానం వైఎస్సార్ కడప జిల్లా రాజంపేటలో ప్రారంభమైంది. అక్కడే జన్మించిన ఆయన, ఉన్నత విద్యాభ్యాసం అనంతరం హైదరాబాద్‌లో న్యాయ విద్యను పూర్తి చేశారు. ప్రముఖ న్యాయవాది గూడపాటి వెంకటేశ్వరరావు వద్ద జూనియర్‌గా చేరి న్యాయవృత్తిలో ఓనమాలు నేర్చుకున్నారు. సుదీర్ఘ కాలం పాటు సివిల్, రాజ్యాంగ, మున్సిపల్ మరియు అడ్మినిస్ట్రేటివ్ చట్టాలపై పట్టు సాధించి, న్యాయవాదిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
ఆయన గతంలో ప్రభుత్వ తరఫున కూడా కీలక బాధ్యతలు నిర్వహించారు. 2004 నుంచి 2006 వరకు అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్‌గా వ్యవహరించి, ప్రభుత్వానికి సంబంధించిన అనేక క్లిష్టమైన కేసులను సమర్థంగా వాదించారు. ఆ తర్వాత 2018లో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కౌన్సిల్‌గా నియమితులై మున్సిపల్ పరిపాలన మరియు స్థానిక సంస్థల వివాదాల పరిష్కారంలో కీలక పాత్ర పోషించారు.
పెరిగిన న్యాయమూర్తుల సంఖ్య
జస్టిస్ బాలాజి మేడమల్లి నియామకానికి సంబంధించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఇటీవల ఆమోదముద్ర వేయగా కేంద్ర న్యాయశాఖ మంగళవారం అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ క్రమంలోనే ఆయన గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్ బాలాజి రాకతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య మరింత పెరిగింది.
మొత్తం 37 మంది న్యాయమూర్తుల పోస్టులు మంజూరైన ఏపీ హైకోర్టులో ఇప్పటివరకు 32 మంది న్యాయమూర్తులు సేవలందిస్తున్నారు. తాజాగా జస్టిస్ బాలాజి మేడమల్లి బాధ్యతలు చేపట్టడంతో హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 33కు చేరుకుంది.
