
ఏపీ స్కిల్‌డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబుకు ఊరట
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు భారీ ఊరట లభించింది. ఈ కేసులో చంద్రబాబు నాయుడుతో పాటు మరో 36 మందిపై నమోదైన క్రిమినల్ కేసును విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం సోమవారం కొట్టివేసింది. కేసులో ఎలాంటి ఆధారాలు లేవని ఇది ‘మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్’ (వాస్తవ దోషం) అని నిర్ధారిస్తూ రాష్ట్ర నేర పరిశోధన విభాగం (సీఐడీ) దాఖలు చేసిన తుది నివేదికను న్యాయస్థానం ఆమోదించింది.
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబుతో పాటు మొత్తం 37 మంది నిందితులు పూర్తిగా అభియోగాల నుంచి విముక్తి పొందారు. కేసును మూసివేయడానికి ముందు తమ వాదనలు వినాలని కోరుతూ ఏపీఎస్‌ఎస్‌డీసీ మాజీ ఛైర్మన్ కె. అజయ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా న్యాయస్థానం తోసిపుచ్చింది. సీఐడీ నివేదికలో పేర్కొన్న అంశాలు సంతృప్తికరంగా ఉన్నాయని భావించిన కోర్టు క్లోజర్ రిపోర్టును ఆమోదిస్తూ కేసును పూర్తిగా ముగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది.
కేసు నేపథ్యం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) ద్వారా రాష్ట్ర యువతకు ఆధునిక సాంకేతిక నైపుణ్యాల శిక్షణ అందించాలనే లక్ష్యంతో 2015 నుంచి 2018 మధ్య పలు ప్రాజెక్టులు చేపట్టారు. ఇందులో భాగంగా జర్మనీకి చెందిన సీమెన్స్ ఇండస్ట్రీ సాఫ్ట్‌వేర్ తో పాటు ఇతర భాగస్వామి సంస్థలతో ఒప్పందాలు కుదిరాయి. ఈ ప్రాజెక్టుల కోసం సుమారు రూ.3,300 కోట్ల వ్యయంతో కార్యక్రమాలు అమలు చేయాలని నిర్ణయించగా ఇందుకోసం భారీగా ప్రభుత్వ నిధులు విడుదలయ్యాయి.
అయితే ఈ ఒప్పందాల అమలులో నిబంధనలకు విరుద్ధంగా చెల్లింపులు జరిగాయని నిధులు దుర్వినియోగమయ్యాయని గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆరోపించింది. ఈ అవకతవకల వల్ల ప్రభుత్వ ఖజానాకు రూ.300 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని పేర్కొంటూ సీఐడీ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది.
ఈ కేసులో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు పాత్ర ఉందంటూ 2023 సెప్టెంబర్ 9న సీఐడీ అధికారులు ఆయనను అరెస్టు చేశారు. ఆ సమయంలో రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉన్నారు. చంద్రబాబు అరెస్టు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర సంచలనం సృష్టించింది.
అరెస్టు అనంతరం చంద్రబాబు నాయుడు సుమారు 53 రోజుల పాటు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు. ఈ సమయంలో ఆయన ఆరోగ్య పరిస్థితిపై పలువురు ఆందోళనలు వ్యక్తం చేశారు. చివరకు 2023 అక్టోబర్ 31న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేసింది.
తదుపరి దర్యాప్తులో చంద్రబాబు నాయుడు నిధుల దుర్వినియోగంలో ప్రత్యక్షంగా పాల్గొన్నారన్న ఆరోపణలకు ఎలాంటి సాక్ష్యాధారాలు లభించలేదని సీఐడీ తేల్చింది. ఈ నేపథ్యంలో కేసులో బలం లేదని పేర్కొంటూ క్లోజర్ రిపోర్టును కోర్టులో దాఖలు చేసింది.
ఈ నివేదికను పరిశీలించిన ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం సీఐడీ వాదనలను సమర్థిస్తూ కేసును పూర్తిగా మూసివేయాలని నిర్ణయించింది. దీంతో స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు నాయుడుకు న్యాయపరంగా పూర్తి ఊరట లభించింది.
అయితే ఈ కేసు ముగింపు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కె. కన్నబాబు వ్యాఖ్యానాల మేరకు, టీడీపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం దర్యాప్తు సంస్థలపై ప్రభావం చూపుతూ చంద్రబాబు నాయుడుపై నమోదైన కేసులను “వాస్తవ దోషాలు” అనే ముసుగులో పద్దతిగా మూసివేన్చారని ఆరోపించారు.
