Let's talk: editor@tmv.in
ఏపీ సినిమాటోగ్రఫీలో నూతన శకం ప్రారంభం:మంత్రి కందుల దుర్గేష్

ఏపీ సినిమాటోగ్రఫీలో నూతన శకం ప్రారంభం:మంత్రి కందుల దుర్గేష్

Panthagani Anusha
2 డిసెంబర్, 2025

ఆంధ్రప్రదేశ్‌ను సినిమా షూటింగ్‌లు, పర్యాటకానికి ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దుతూ తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నామని, ఈ క్రమంలో ఏపీ సినిమాటోగ్రఫీకి నూతన శకం ఆరంభమైందని రాష్ట్ర పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు. ముంబయి జుహూలోని జేడబ్ల్యూ మారియట్ హోటల్‌లో డిసెంబర్ 1, 2 తేదీల్లో జరుగుతున్న ప్రతిష్టాత్మక ‘సీఐఐ బిగ్ పిక్చర్ సమ్మిట్ - 2025లో ప్రసంగించిన ఆయన పెట్టుబడులను ఆహ్వానించారు.

తెలుగు సినిమా గ్లోబల్ బ్రాండ్‌గా

భారతదేశంలో హిందీ తర్వాత తెలుగు సినీ పరిశ్రమ రెండవ అతిపెద్దదిగా నిలిచి, జాతీయ చలనచిత్ర పరిశ్రమకు దాదాపు 20 శాతం వాటాను అందిస్తోందని మంత్రి దుర్గేష్ తెలిపారు. 'బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్, కల్కి 2898 ఏడీ, పుష్ప సిరీస్‌లు, సలార్, ఓజీ' వంటి ప్రపంచ స్థాయి సినిమాలు కథాకథనం, విజువల్ ఎఫెక్ట్స్‌లో అద్భుతంగా ఉండి తెలుగు సినిమాను గ్లోబల్ బ్రాండ్‌గా మార్చాయని పేర్కొన్నారు. తమిళనాడు తర్వాత అత్యధికంగా ఏపీలో 1,103 స్క్రీన్లు ఉన్నాయని ఈ రంగానికి తమ ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ఇస్తుందని హామీ ఇచ్చారు.

నూతన విధానాలు, ప్రోత్సాహకాలు

ఏపీని దేశంలోనే సినిమా షూటింగ్‌లకు అత్యంత అనుకూలమైన రాష్ట్రంగా మారుస్తామని మంత్రి దుర్గేష్ స్పష్టం చేశారు. ప్రొడక్షన్ నుండి ఎగ్జిబిషన్ వరకు పరిశ్రమను బలోపేతం చేసేందుకు సమగ్రమైన కొత్త 'ఫిల్మ్ టూరిజం పాలసీ'ని త్వరలో ఆవిష్కరిస్తామని తెలిపారు. ఇంటిగ్రేటెడ్ ఫిల్మ్ సిటీలు, ఆధునిక స్టూడియోలు, డబ్బింగ్, రీ-రికార్డింగ్ సౌకర్యాలు నిర్మించే వెంచర్లకు ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ఇస్తుందని భరోసానిచ్చారు. షూటింగ్‌ల కోసం ప్రభుత్వ, బహిరంగ ప్రాంతాల్లో అనుమతులు వేగంగా, పారదర్శకంగా లభిస్తాయని వెల్లడించారు. రాష్ట్ర కళాకారులు, సాంకేతిక నిపుణులను గౌరవించేందుకు ప్రతిష్టాత్మక నంది అవార్డులు, నంది నాటకోత్సవాలను త్వరలో పునరుద్ధరిస్తామని ఆయన ప్రకటించారు.

భారతీయ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి ఏపీ ప్రభుత్వం కల్పిస్తున్న ముఖ్య ప్రయోజనాలను ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ వివరించారు. ఏపీలో పర్యాటక, ఆతిథ్య రంగాలకు 'పరిశ్రమ హోదా' కల్పించడం వల్ల అన్ని రకాల రాయితీలకు త్వరితగతిన అర్హత లభిస్తుందని స్పష్టం చేశారు. 2029 నాటికి రూ. 25,000 కోట్లు (3 బిలియన్లు) ప్రైవేట్ పెట్టుబడులను లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇప్పటికే దాదాపు రూ. 24,000 కోట్ల పెట్టుబడుల పైప్‌లైన్‌ను కలిగి ఉందని, మరో రూ. 6,000 కోట్లకు పైగా పెట్టుబడులకు ప్రభుత్వ అనుమతులు లభించాయని వివరించారు. అదే విధంగా భూమి కొనుగోలు/లీజుపై 100 శాతం స్టాంప్ డ్యూటీ రీయింబర్స్‌మెంట్,అర్హత కలిగిన పర్యాటక ప్రాజెక్టులకు ల్యాండ్ కన్వర్షన్ ఛార్జీల మినహాయింపును అందిస్తున్నామన్నారు. అంతేగాక ప్రాజెక్ట్ స్థాయిని బట్టి 15 సంవత్సరాల వరకు 100 శాతం స్టేట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (ఎస్జీఎస్టీ) రీయింబర్స్‌మెంట్‌ను అందిస్తున్నామని, ఇది నిరంతర ఆదాయ ప్రయోజనాన్ని నిర్ధారిస్తుందని పేర్కొన్నారు. ఎంఎస్ఎంఈ ప్రాజెక్టులకు 25 శాతం వరకు భారీ/మెగా ప్రాజెక్టులకు 10 శాతం వరకు ప్రత్యక్ష మూలధన రాయితీలు అందుబాటులో ఉన్నాయని, ఇవి ప్రారంభ పెట్టుబడి వ్యయాన్ని గణనీయంగా తగ్గిస్తాయని వివరించారు.

ఆంధ్రప్రదేశ్‌ను 2047 నాటికి 2.4 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా మార్చే 'స్వర్ణాంధ్ర విజన్' తమ లక్ష్యమని మంత్రి దుర్గేష్ తెలిపారు. ఏఐ , విఎఫ్ఎక్స్, గేమింగ్ వంటి రంగాలకు ఏపీని గ్లోబల్ హబ్‌గా మార్చేందుకు భారీగా పెట్టుబడి పెడుతున్నామని వెల్లడించారు.. విశాఖపట్నం, తిరుపతి, అమరావతి, శ్రీశైలం, అరకు లోయ వంటి ప్రాంతాలను ప్రధాన యాంకర్ హబ్‌లుగా అభివృద్ధి చేస్తున్నామని, 21 థీమాటిక్ సర్క్యూట్‌లలో పెట్టుబడి మార్గాలను ఆహ్వానిస్తున్నామని తెలిపారు.

సినిమాటోగ్రఫీని ఉపయోగించి ఏపీ అందాలను ప్రపంచానికి చూపిస్తామని ప్రపంచ స్థాయి స్టూడియోలు, డబ్బింగ్, పోస్ట్-ప్రొడక్షన్ సౌకర్యాలు కల్పించేందుకు పెట్టుబడులు పెట్టాలని ఇన్వెస్టర్లను కోరారు. దక్షిణ భారతీయ కంటెంట్‌ను ప్రపంచానికి పరిచయం చేసే గేట్‌వేగా ఏపీని తీర్చిదిద్దుతామని మంత్రి దుర్గేష్ స్పష్టం చేశారు. సుస్థిరమైన, పారదర్శకమైన పరిపాలన ఏపీ వ్యవస్థకు పునాది అని, భారతీయ మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ రంగాన్ని 100 బిలియన్ల స్థాయికి చేర్చడంలో కలిసి పని చేద్దామని మంత్రి దుర్గేష్ పెట్టుబడిదారులకు పిలుపునిచ్చారు.

సమ్మిట్‌లో భాగంగా మంత్రి కందుల దుర్గేష్, పర్యాటక శాఖ ఎండీ ఆమ్రపాలి కాటతో కలిసి సీఐఐ అధికారి సంజయ్ కత్వానీ, సోనీ ఎంటర్‌టైన్‌మెంట్ బిజినెస్ హెడ్ నచికేత్ పంత్వైద్య, యూట్యూబ్(ఇండియా) ఎండీ గుంజన్ సోని సహా పలువురు ప్రముఖులతో సమావేశమై చర్చించారు.