Let's talk: editor@tmv.in
ఏపీ శాసనసభ 2026 క్యాలెండర్ విడుదల

ఏపీ శాసనసభ 2026 క్యాలెండర్ విడుదల

Panthagani Anusha
24 డిసెంబర్, 2025

ఆంధ్రప్రదేశ్ శాసనసభ 2026 సంవత్సరానికి సంబంధించిన అధికారిక వాల్ క్యాలెండర్, టేబుల్ క్యాలెండర్ డైరీలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం విడుదల చేశారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, శాసనసభ కార్యదర్శి జనరల్ ప్రసన్న కుమార్ సూర్యదేవరతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.

బయోడైవర్సిటీ – ఆంధ్రప్రదేశ్ జీవన వారసత్వం థీమ్‌తో క్యాలెండర్

రాష్ట్రంలోని ప్రాకృతిక సంపదను, అరుదైన వన్యప్రాణులను కళ్లకు కట్టేలా 'జీవవైవిధ్యం – ఆంధ్రప్రదేశ్ సజీవ వారసత్వం' అనే ప్రత్యేక థీమ్‌తో ఈ 2026 క్యాలెండర్‌ను తీర్చిదిద్దారు. తూర్పు కనుమల శ్రేణులు, విస్తారమైన గడ్డి మైదానాలు, కోరింగా మడ అడవులు, సుదీర్ఘ బంగాళాఖాత తీరప్రాంతం వంటి విభిన్న ఆవరణ వ్యవస్థల ప్రాధాన్యతను చాటిచెప్పేలా పన్నెండు వన్యప్రాణుల చిత్రాలను ఇందులో పొందుపరిచారు. రాష్ట్ర ప్రకృతి వారసత్వానికి, కళా సంప్రదాయానికి ఆధునికతను అద్ది అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. ముఖ్యంగా ఈ చిత్రాల రూపకల్పనలో అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికతను జోడించి, వాటిని సంప్రదాయ కలంకారీ శైలిలో అద్భుతంగా చిత్రించామని శాసనమండలి సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ ఈ సందర్భంగా వివరించారు.

క్యాలెండర్ డిజైన్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేస్తూ ప్రకృతిని కాపాడుకోవాలనే ఉన్నతమైన సందేశం ఇందులో దాగి ఉందని ప్రశంసించారు. పర్యావరణ పరిరక్షణ, వన్యప్రాణుల సంరక్షణతో పాటు వాతావరణ మార్పుల వల్ల తలెత్తుతున్న సవాళ్లను కూడా ఈ క్యాలెండర్ ప్రతిబింబిస్తోందని ఆయన పేర్కొన్నారు. ప్రకృతిని సంరక్షించుకోవడం మనందరి సమిష్టి బాధ్యత అని ఈ క్యాలెండర్ గుర్తుచేస్తుందని సీఎం అన్నారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన వన్యప్రాణి, పర్యావరణ పరిరక్షణ కమిటీ చురుగ్గా పనిచేయడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ప్రకృతిని, మూగజీవాలను కాపాడాల్సిన ఆవశ్యకతపై సమాజంలో చైతన్యం తెచ్చేందుకు శాసనసభ చేస్తున్న వినూత్న ప్రయత్నం ఇదని స్పీకర్ అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు.

ఏపీ శాసనసభ 2026 క్యాలెండర్ విడుదల - Tholi Paluku