
ఏపీ వ్యాప్తంగా ఘనంగా భోగి వేడుకలు
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సంక్రాంతి పండుగకు శుభారంభమైన భోగిని ప్రజలు భక్తి శ్రద్ధలతో, సంప్రదాయ ఉత్సాహంతో ఘనంగా జరుపుకున్నారు. బుధవారం తెల్లవారుజామునే ఆంధ్రప్రదేశ్ అంతటా భోగి మంటల వెలుగులతో పండుగ వాతావరణం సంతరించుకుంది. పాత వస్తువులను, అనవసరమైన ఆలోచనలను విడనాడి, కొత్త వెలుగులకు స్వాగతం పలుకుతూ ప్రజలు భోగి వేడుకలను జరుపుకున్నారు.
తిరుమలలో ఆధ్యాత్మిక వైభవం
తిరుమల శ్రీవారి ఆలయ ప్రాంగణం భోగి సందర్భంగా ప్రత్యేక ఆధ్యాత్మిక వైభవంతో వెలిగిపోయింది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో శ్రీవారి ఆలయ పరిసరాల్లో సంప్రదాయబద్ధంగా భోగి మంటలను నిర్వహించారు. దేశం నలుమూలల నుంచి వచ్చిన భక్తులు శ్రీవారి దర్శనం చేసుకుని ఆనందం, ఆధ్యాత్మిక తృప్తి వ్యక్తం చేసినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
గ్రామాల్లో పండుగ సందడి
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ప్రజలు బుధవారం తెల్లవారుజామునే ఇళ్ల ముందు భోగి మంటలు వెలిగించారు. వీధివీధిన ప్రజలు ఒక్కచోట చేరి పండుగ వాతావరణంలో భోగిని జరుపుకున్నారు. పట్టణాల్లో నివసించే వారు తమ సొంత ఊర్లకు చేరుకోవడంతో పల్లెలు కళకళలాడుతున్నాయి. ముంగిట రంగురంగుల ముగ్గులు, గొబ్బెమ్మలు, భోగి మంటల చుట్టూ చిన్నారులు, పెద్దలు సందడి చేస్తూ కనిపించారు.
అంతరించిపోతున్న హరిదాసుల సంప్రదాయం
ఈ ఏడాది భోగి వేడుకల్లో హరిదాసు సంప్రదాయం క్రమంగా కనుమరుగవుతున్నదన్న ఆవేదన కూడా వ్యక్తమైంది. ప్రకాశం జిల్లా గంగాదేవిపల్లె గ్రామంలో సుమారు 10 హరిదాసు కుటుంబాలు మాత్రమే ఇప్పటికీ ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాయి. హరిదాసు మస్తాన్ మాట్లాడుతూ, సంక్రాంతి సమయంలో సంప్రదాయ వస్త్రధారణతో ఇంటింటికీ వెళ్లి భజనలు పాడుతూ పండుగ ప్రాముఖ్యతను గుర్తు చేస్తామని తెలిపారు. గత 18 ఏళ్లుగా హరిదాసు సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నానని, కానీ గతంతో పోలిస్తే ప్రస్తుతం ఆదరణ తగ్గిందని ఆవేదన వ్యక్తం చేశారు. యువత ఈ సంప్రదాయ సాంస్కృతిక, ఆధ్యాత్మిక విలువలను గుర్తించాలని కోరారు.
గవర్నర్, ముఖ్యమంత్రి శుభాకాంక్షలు
రాష్ట్ర ప్రజలకు గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ భోగి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పంట పండుగ ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు, శ్రేయస్సు నింపాలని ఆయన ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 'ఎక్స్' వేదికగా శుభాకాంక్షలు తెలుపుతూ.. "ప్రతి ఇంటి ముంగిట వేసిన రంగవల్లులు, వెలిగించిన భోగి మంటలు తెలుగు కుటుంబాల్లో కొత్త కాంతిని నింపాలి" అని పేర్కొన్నారు.
వైకాపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలిపారు. చెడును దహనం చేసి, సంతోషాన్ని ఆహ్వానించే ఈ పండుగ అందరి జీవితాల్లో సుఖశాంతులు నింపాలని ఆయన కోరారు.
