
ఏపీ విద్యుత్ వినియోగదారులకు భారీ ఊరట: 2026-27లో పెరగని కరెంట్ చార్జీలు
ఆంధ్రప్రదేశ్ విద్యుత్ వినియోగదారులకు ఊరటనిస్తూ, 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి విద్యుత్ టారిఫ్ (ధరలు) పెంచకూడదని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి సంచలన నిర్ణయం తీసుకుంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలోని ఏ ఒక్క వర్గం వినియోగదారుడిపై కూడా విద్యుత్ భారము పడకుండా ఏపీఈఆర్‌సీ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. గృహ వినియోగదారులు, రైతులు, చిన్న తరహా పరిశ్రమలు ఇలా అందరినీ దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. పెరుగుతున్న ధరల కాలంలో సామాన్యులకు ఇది పెద్ద ఊరటనిచ్చే అంశం. ప్రభుత్వ నిబద్ధతకు ఇది నిదర్శనమని కమిషన్ పేర్కొంది.
ప్రభుత్వమే భరించనున్న రూ. 15,790 కోట్లు
రాష్ట్రంలోని డిస్కమ్ (విద్యుత్ పంపిణీ సంస్థలు)లమొత్తం ఏఆర్ఆర్ (3 డిస్కాంలు) రూ. 59,158 కోట్లు కాగావీటి ఆదాయం రూ. 44,901 కోట్లు, నికర ఆదాయ లోటు రూ. 15,790 కోట్లుగాఉంది. తమ కార్యకలాపాల కోసం రూ. 17,508 కోట్ల రెవెన్యూ లోటు ఉంటుందని అంచనా వేశాయి. అయితే, ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత ఏపీఈఆర్‌సీ ఈ లోటును రూ. 15,790 కోట్లుగా ఖరారు చేసింది. ఈ భారీ లోటును వినియోగదారుల నుంచి వసూలు చేయకుండా, రాష్ట్ర ప్రభుత్వమే సబ్సిడీ రూపంలో భరించడానికి ముందుకు రావడం గమనార్హం.
అన్నదాతలకు, పేదలకు అభయం
వ్యవసాయ రంగానికి వెన్నుదన్నుగా నిలుస్తూ రాష్ట్రంలోని 22 లక్షల మంది రైతులకు ఉచిత విద్యుత్ సరఫరాను యథాతథంగా కొనసాగించనున్నారు. అలాగే, సుమారు 22 లక్షల ఎస్సీ, ఎస్టీ, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ ద్వారా ఉచిత లేదా రాయితీ విద్యుత్ అందుతుంది. దీనివల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు బలం చేకూరుతుంది.
వాణిజ్య రంగంలో విప్లవాత్మక తగ్గింపు
రాష్ట్రంలో వ్యాపారాలను ప్రోత్సహించే దిశగా ఏపీఈఆర్‌సీ వాణిజ్య విద్యుత్ ధరలను భారీగా తగ్గించింది. ఇప్పటివరకు యూనిట్‌కు రూ. 12.25 ఉన్న టారిఫ్‌ను రూ. 9.95కి కుదించారు. ఈ నిర్ణయం వల్ల సుమారు 2 లక్షల మంది వ్యాపారులు, చిన్న దుకాణదారులకు లబ్ధి చేకూరుతుంది. ఇది రాష్ట్రంలో వ్యాపార కార్యకలాపాలు పెరగడానికి, కొత్త ఉపాధి అవకాశాలు రావడానికి దోహదపడుతుంది.
చిన్న తరహా, కుటీర పరిశ్రమలను ఆదుకునేందుకు లోడ్ పరిమితిని పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. గతంలో 10 హెచ్‌పి ఉన్న లోడ్ పరిమితిని ఇప్పుడు 20 హెచ్‌పికి రెట్టింపు చేశారు. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 18,000 చిన్న తరహా సంస్థలకు ప్రయోజనం కలుగుతుంది. అలాగే నీటి శుద్ధి ప్లాంట్లు, ప్రింటింగ్ ప్రెస్‌లను పారిశ్రామిక కేటగిరీ కిందకు మార్చడం వల్ల వాటికి విద్యుత్ ఖర్చులు తగ్గుతాయి.
పారిశ్రామిక సంస్కరణలు - క్లీన్ ఎనర్జీ
రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని కొన్ని నిర్మాణాత్మక మార్పులు చేశారు. ముఖ్యంగా సౌర విద్యుత్ తయారీ రంగం కోసం ప్రత్యేక టారిఫ్ కేటగిరీని ప్రవేశపెట్టారు. ఇది స్వచ్ఛ ఇంధన రంగంలో పెట్టుబడులను ఆకర్షించడానికి తోడ్పడుతుంది. అలాగే జాతీయ రహదారుల వీధి దీపాల టారిఫ్‌ను క్రమబద్ధీకరించడం, పౌల్ట్రీ రంగానికి ప్రత్యేక నిబంధనలు తీసుకురావడం వంటివి ఇందులో ఉన్నాయి.
డిస్కమ్‌లు ప్రతిపాదించిన కొన్ని భారమైన ప్రతిపాదనలను ఏపీఈఆర్‌సీ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. టైమ్ ఆఫ్ డే టారిఫ్ మార్పులు, నాన్-టెలిస్కోపిక్ బిల్లింగ్ విధానం, గ్రీన్ పవర్ కేటగిరీ తొలగింపు వంటి ప్రతిపాదనలను కమిషన్ తిరస్కరించింది. ట్రూ-అప్ ఛార్జీల పేరుతో వినియోగదారులపై ఎలాంటి అదనపు భారం పడకుండా జాగ్రత్తలు తీసుకుంది.
విద్యుత్ సంస్థల సామర్థ్యాన్ని పెంచేందుకు ఏపీఈఆర్‌సీ పలు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ శాఖల నుంచి రావాల్సిన బకాయిలను త్వరగా వసూలు చేయాలని, ప్రైవేటు బకాయిలను తగ్గించాలని సూచించింది. విద్యుత్ భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించడానికి వాట్సాప్, వెబ్‌సైట్ల ద్వారా ఫిర్యాదుల వ్యవస్థను బలోపేతం చేయాలని ఆదేశించింది. మొత్తానికి 2026-27 సంవత్సరానికి ఏపీ విద్యుత్ రంగం ఒక సమతుల్య మార్గంలో పయనించనుంది.
