
ఏపీ విద్యార్థులకు భారీ ఊరట: ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం రూ.1,200 కోట్లు విడుదల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఉన్నత విద్యను అభ్యసిస్తున్న పేద విద్యార్థులకు అండగా నిలిచే 'ఫీజు రీయింబర్స్‌మెంట్', 'స్కాలర్‌షిప్‌ల' బకాయిలను చెల్లిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా మొత్తం రూ.1,200 కోట్ల నిధులను విడుదల చేస్తూ ఆర్థిక శాఖ తాజాగా బడ్జెట్ విడుదల ఉత్తర్వులను జారీ చేసింది. ఈ నిధులు నేరుగా సంబంధిత విభాగాల ద్వారా విద్యా సంస్థలకు అందనున్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలో విద్యార్థుల ఖాతాలలో జమ చేస్తే, కూటమి ప్రభుత్వం కాలేజీ యాజమాన్యాల అకౌంట్లలో వేయాలని నిర్ణయించింది. ఈ మేరకు విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను కూటమి ప్రభుత్వం విడుదల చేసింది అంటూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ప్రకటించారు.
ఈ నిధుల విడుదలతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వెనుకబడిన తరగతులు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు, మైనారిటీ విద్యార్థులకు తక్షణ లబ్ధి చేకూరనుంది. గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించిన పోస్ట్-మెట్రిక్ స్కాలర్‌షిప్‌లు ఇతర బకాయిల కోసం ఈ మొత్తాన్ని కేటాయించారు. దీనివల్ల ఫీజులు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్న విద్యార్థులకు, కాలేజీ యాజమాన్యాలకు పెద్ద ఊరట లభించినట్లయింది.
ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ, ఏ ఒక్క విద్యార్థి కూడా ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువుకు దూరం కాకూడదన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని పునరుద్ఘాటించారు. "గతంలో పేరుకుపోయిన బకాయిలన్నింటినీ విడతలవారీగా క్లియర్ చేస్తున్నామని, భవిష్యత్తులోనూ విద్యా సంబంధిత సహాయాన్ని సకాలంలో అందిస్తామని" ఆయన హామీ ఇచ్చారు. విద్యార్థులు ఎటువంటి ఆందోళన చెందకుండా ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో తమ చదువుపై దృష్టి సారించాలని ఆయన కోరారు.
ప్రభుత్వ తాజా నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ముఖ్యంగా సెమిస్టర్ పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో ఈ నిధులు విడుదల కావడం వల్ల హాల్ టికెట్ల జారీలో గానీ, సర్టిఫికేట్ల విషయంలో గానీ విద్యార్థులకు కళాశాలల నుండి ఎటువంటి ఆటంకాలు ఎదురవ్వవు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు మరిన్ని సంస్కరణలు చేపడతామని ప్రభుత్వం ఈ సందర్భంగా స్పష్టం చేసింది.
