
ఏపీ లిక్కర్ కుంభకోణం: ఎపీఎస్బీసీఎల్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి అరెస్ట్
రాష్ట్ర అబ్కారీ శాఖలో గత ఐదేళ్ల కాలంలో సాగినట్లుగా భావిస్తున్న రూ.3,500 కోట్ల భారీ కుంభకోణం కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో రెండో నిందితుడు (ఏ2)గా ఉన్న ఎపీఎస్బీసీఎల్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ దొంతిరెడ్డి వాసుదేవరెడ్డిని సిట్ అధికారులు శనివారం అరెస్టు చేసి అనంతరం ఏసీబీ కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం ఆయనకు ఈ నెల 27 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.
కేసు నేపథ్యం
గత వైసీపీ హయాంలో (2019-2024) అమలు చేసిన వివాదాస్పద ఎక్సైజ్ విధానమే ఈ భారీ దోపిడీకి పునాది వేసిందని దర్యాప్తు సంస్థ ప్రాథమికంగా నిర్ధారించింది. పారదర్శకమైన ఆన్‌లైన్ ఇన్వెంటరీ విధానాన్ని ఉద్దేశపూర్వకంగా అడ్డుకుని 'మాన్యువల్' పద్ధతిలో మద్యం ఆర్డర్లు కేటాయించడం ద్వారా కొన్ని నిర్దిష్ట డిస్టిలరీలకు భారీగా లబ్ధి చేకూర్చినట్లు సిట్ గుర్తించింది. కేవలం ఈ తప్పుడు ఆర్డర్ల కేటాయింపులు, బ్రాండ్ల మార్పుల వల్లే రాష్ట్ర ఖజానాకు సుమారు రూ. 192 కోట్ల మేర ప్రత్యక్ష నష్టం వాటిల్లిందని రిమాండ్ నివేదికలో పేర్కొన్నారు. కాగా ఈ వ్యవహారంలో కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని మొదటి నిందితుడిగా (A1) చేర్చారు.
హవాలా నెట్‌వర్క్.. వేల కోట్ల నిధుల మళ్లింపు
ఈ కుంభకోణం కేవలం ఆర్డర్లకే పరిమితం కాకుండా హవాలా నెట్‌వర్క్ నిదులమల్లిపు జరిగిందని ఏపీఎస్బీసీఎల్ నుంచి డిస్టిలరీలకు వెళ్లిన నిధులు అక్కడి నుంచి మధ్యవర్తి సంస్థల ద్వారా షెల్ కంపెనీలకు మళ్లినట్లు సిట్ అనుమానిస్తోంది. ఈ బహుళ స్థాయిల నిధుల మార్పిడులే మొత్తం స్కామ్ విలువను రూ. 3,500 కోట్ల భారీ స్థాయికి చేర్చాయని ఇందులో వాసుదేవరెడ్డి పాత్ర అత్యంత కీలకమని సిట్ స్పష్టం చేసింది. కాగా ఆయనను కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరిన్ని ‘పెద్దల’ పేర్లు బయటకు వస్తాయని దర్యాప్తు సంస్థ ఆశిస్తోంది.
ఇదిలా ఉండగా ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆదేశించిన ఈ విచారణను తొలుత సీఐడీ ప్రారంభించగా అందులోని ఆర్థిక అక్రమాల తీవ్రత దృష్ట్యా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా రంగంలోకి దిగింది. ఇప్పటికే ఈ కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు పలువురు అరెస్ట్ కాగా కొద్దిరోజుల క్రితం మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని కూడా సిట్ అధికారులు విచారించడం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. కాగా ప్రస్తుతం నిబంధనలకు విరుద్ధంగా వచ్చిన అక్రమ సొమ్మును విదేశాలకు తరలించారనే కోణంలో లోతైన దర్యాప్తు సాగుతోంది.
