
ఏపీ లాజిస్టిక్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం
రాష్ట్రంలో పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన, విద్యా రంగం బలోపేతం గ్రామీణ తాగునీటి సరఫరా లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని మంత్రిమండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. గురువారం సచివాలయంలో జరిగిన 1376వ క్యాబినెట్ సమావేశంలో పరిశ్రమలు, విద్య, ఇంధన, పర్యాటక రంగాలకు సంబంధించి దాదాపు 38 కీలక అంశాలకు ఆమోదం లభించింది. ఈ సమావేశ వివరాలను సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి మీడియాకు వెల్లడించారు.
సమగ్ర లాజిస్టిక్స్ హోల్డింగ్ కంపెనీ ఏర్పాటు
రాష్ట్రంలో లాజిస్టిక్స్ రంగాన్ని వ్యవస్థీకృతం చేసేందుకు ‘ఆంధ్రప్రదేశ్ లాజిస్టిక్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ను హోల్డింగ్ కంపెనీగా ఏర్పాటు చేయాలని క్యాబినెట్ నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక ‘లాజిస్టిక్స్ ఫండ్ ను ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధిగా రూపొందిస్తారు. ప్రభుత్వ వాటాగా ఇందులో 10-20 శాతం మూలధనాన్ని అందించనున్నారు. ఇది రాష్ట్రంలో పారిశ్రామిక రవాణా ముఖచిత్రాన్ని మార్చివేస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.
ఎంఎస్ఎంఈ అభివృద్ధికి రూ. 200 కోట్లు
చిన్న తరహా పరిశ్రమల కోసం ‘ఏపీ క్లస్టర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ కు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. రూ. 200 కోట్ల బడ్జెట్‌తో వచ్చే ఐదేళ్లలో 45 కామన్ ఫెసిలిటీ సెంటర్లను ఏర్పాటు చేస్తారు. దీని ద్వారా సుమారు 7,500 మందికి ప్రత్యక్ష ఉపాధి లభించనుంది. ముఖ్యంగా మహిళలు, ఎస్సీ, ఎస్టీ వర్గాల పారిశ్రామికవేత్తలకు ఇందులో ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
విద్యార్థి కిట్లకు నిధుల మంజూరు
ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి చదువుతున్న 39.52 లక్షల మంది విద్యార్థులకు అందజేసిన స్టూడెంట్ కిట్ల కోసం రూ. 944.53 కోట్ల వ్యయానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో రాష్ట్ర వాటా రూ. 652.65 కోట్లు కాగా, కేంద్రం రూ. 291.88 కోట్లు భరిస్తోంది. విద్యా రంగంలో మరో కీలక నిర్ణయంగా శ్రీకాకుళం జిల్లా కొత్తబొమ్మలిలో నూతన ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ లభించింది.
అదేవిధంగా రాజధాని అమరావతిలోని పిచ్చికటపాలెం గ్రామంలో రూ. 165.33 కోట్లతో ఆంధ్రప్రదేశ్ జ్యుడీషియల్ అకాడమీ’ నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రెండేళ్ల నిర్వహణ గడువుతో లంప్‌సమ్ కాంట్రాక్ట్ పద్ధతిలో టెండర్లు పిలిచి, భవన నిర్మాణాన్ని పూర్తి చేయనున్నారు.
మద్యం ధరల సవరణ - బార్లకు ఊరట
మద్యం విక్రయాల్లో అసమానతలను తొలగించేందుకు బార్లపై ఉన్న అదనపు రిటైల్ ఎక్సైజ్ పన్ను ను ఉపసంహరించాలని మంత్రివర్గం నిర్ణయించింది. దీనివల్ల బార్ యజమానులపై ఏడాదికి రూ. 340 కోట్ల భారం తగ్గనుంది. అదే సమయంలో, రూ. 99 మద్యం బాటిళ్లు (180 ఎంల్) మినహా మిగిలిన అన్ని రకాల మద్యం బాటిళ్లపై రూ. 10 చొప్పున ధర పెంచనున్నారు. దీని ద్వారా ప్రభుత్వానికి ఏడాదికి రూ. 1,391 కోట్ల అదనపు ఆదాయం సమకూరనుంది.
పర్యాటక రంగానికి ఊతం
బాపట్ల జిల్లా సూర్యలంక తీరంలో ఐటీసీ, హిల్టన్, రాయల్ ఆర్చిడ్ వంటి అంతర్జాతీయ బ్రాండ్లతో 5-స్టార్ మరియు 3-స్టార్ రిసార్టుల ఏర్పాటుకు భూ కేటాయింపులు జరిగాయి. అదేవిధంగా పెనుకొండలో ఇస్కాన్ ఆధ్వర్యంలో ‘మెగా ఆధ్యాత్మిక కేంద్రం’ ఏర్పాటుకు ఆమోదం లభించింది.
