Let's talk: editor@tmv.in
ఏపీ రాజధానిగా అమరావతి… నేడు లోక్‌సభలో చట్ట సవరణ బిల్లు

ఏపీ రాజధానిగా అమరావతి… నేడు లోక్‌సభలో చట్ట సవరణ బిల్లు

Panthagani Anusha
1 ఏప్రిల్, 2026

ఆంధ్రప్రదేశ్ రాజధానిపై గత కొన్నేళ్లుగా నెలకొన్న అనిశ్చితికి తెరదించుతూ, అమరావతిని రాష్ట్ర ఏకైక రాజధానిగా అధికారికంగా గుర్తించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు-2026ను నేడు లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. 2014 నాటి అసలు విభజన చట్టంలోని నిబంధనలను సవరిస్తూ ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి కొత్త రాజధానిగా ఉంటుంది’ అనే స్పష్టమైన నిబంధనను ఈ బిల్లు ద్వారా చేర్చనున్నారు.

విభజన చట్ట సవరణ

2014లో ఉమ్మడి రాష్ట్ర విభజన అనంతరం పదేళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కొనసాగిన విషయం తెలిసిందే. ఆ గడువు ముగియడం, ఏపీకి సొంత రాజధానిపై స్పష్టత రావాల్సిన నేపథ్యంలో కేంద్రం ఈ చొరవ తీసుకుంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వ దార్శనికతకు అనుగుణంగా కేంద్ర హోంశాఖ ఈ సవరణ బిల్లును రూపొందించింది. పార్లమెంటు ఆమోదం పొందితే రాజధాని విషయంలో ఇకపై ఎలాంటి న్యాయపరమైన లేదా రాజకీయపరమైన చిక్కులకు తావుండదని నిపుణులు భావిస్తున్నారు.

అసెంబ్లీ తీర్మానమే ప్రాతిపదిక

గత నెల 28న ఆంధ్రప్రదేశ్ శాసనసభ అమరావతిని ఏకైక రాజధానిగా ఏకగ్రీవంగా ఆమోదిస్తూ చారిత్రక తీర్మానం చేసిన సంగతి విదితమే. ఈ తీర్మాన ప్రతిని ఇప్పటికే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర హోంమంత్రికి, లోక్‌సభ స్పీకర్‌కు అందజేశారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షను గౌరవిస్తూ కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి పార్లమెంటులో సవరణ బిల్లును ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది.

ప్రపంచ స్థాయి నగరంగా అమరావతి

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, అమరావతిని ఎవరూ మార్చలేరని, తరలించలేరని స్పష్టం చేశారు. "అమరావతి కేవలం ఒక నగరం కాదు, అది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు పునాది. 2028 నాటికి ఇది పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందిన రాజధానిగా రూపుదిద్దుకుంటుంది. ఆధునిక మౌలిక సదుపాయాలతో, స్వయం సమృద్ధి కలిగిన ప్రపంచ స్థాయి బ్లూ-గ్రీన్ నగరంగా దీన్ని తీర్చిదిద్దుతాం" అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అదేవిదంగా రాష్ట్ర ఆర్థిక వృద్ధికి అమరావతి ఒక ఇంజిన్‌లా పనిచేస్తుందని ఆయన పునరుద్ఘాటించారు.