Let's talk: editor@tmv.in
ఏపీ మద్యం కుంభకోణం: సిట్ ఎదుట లొంగిపోయిన అవినాష్‌ రెడ్డి

ఏపీ మద్యం కుంభకోణం: సిట్ ఎదుట లొంగిపోయిన అవినాష్‌ రెడ్డి

Panthagani Anusha
28 ఫిబ్రవరి, 2026

రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన రూ. 3,500 కోట్ల మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన ముప్పిడి అవినాష్‌ రెడ్డి గురువారం ప్రత్యేక విచారణ బృందం (సిట్) ఎదుట లొంగిపోయారు. గత కొద్ది రోజులుగా పరారీలో ఉన్న ఆయన, ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురికావడంతో చట్టపరమైన ఇతర దారులు లేక సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. ఉదయం 11:30 గంటల సమయంలో ఆయన లొంగిపోగా సుదీర్ఘ విచారణ అనంతరం అధికారులు ఆయన్ను అరెస్ట్ చేశారు. అనంతరం స్థానిక కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్‌కు ఆదేశించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

అక్రమాల అడ్డాగా 'లిక్కర్ సిండికేట్'

గత వైకాపా ప్రభుత్వ హయాంలో (2019-2024) మద్యం సరఫరా, కొత్త బ్రాండ్లకు అనుమతులు, కొనుగోలు ప్రక్రియలో భారీ ఎత్తున అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై సిట్ లోతుగా దర్యాప్తు చేస్తోంది. 'లిక్కర్ సిండికేట్' పేరుతో ఒక వ్యవస్థీకృత ముఠా ఏర్పడి రాష్ట్రంలో మద్యం వ్యాపారాన్ని తమ కనుసన్నల్లో నడిపించినట్లు దర్యాప్తులో తేలింది. ఈ మొత్తం వ్యవహారంలో అవినాష్‌ రెడ్డి కీలక సూత్రధారిగా వ్యవహరించారని సిట్ ఆరోపిస్తోంది. ఆర్థిక లావాదేవీల పర్యవేక్షణ నుంచి క్షేత్రస్థాయిలో వ్యూహాల అమలు వరకు ఆయనే కీలకంగా వ్యవహరించినట్లు సమాచారం.

బెయిల్ నిరాకరణతోనే లొంగుబాటు?

ఈ కేసులో అరెస్టు నుంచి తప్పించుకునేందుకు అవినాష్ రెడ్డి గతంలో ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించారు. అయితే కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న కోర్టు ఆయన విన్నపాన్ని తోసిపుచ్చింది. దీంతో అరెస్ట్ తప్పదని భావించిన ఆయన వ్యూహాత్మకంగా సిట్ ఎదుట హాజరైనట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. విచారణలో భాగంగా ఏపీ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్‌కు చెందిన పలువురు మాజీ ఉన్నతాధికారులు, రాజకీయ ప్రముఖులు, వ్యాపార వేత్తల పేర్లు కూడా తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది.

మున్ముందు మరిన్ని అరెస్టులు?

అవినాష్ రెడ్డి అరెస్టుతో ఈ కుంభకోణం డొంక కదులుతుందని దర్యాప్తు సంస్థ భావిస్తోంది. డిజిటల్ సాక్ష్యాధారాలు బ్యాంకు ఖాతాల విశ్లేషణ ద్వారా నిధులు ఎక్కడికి మళ్లాయనే అంశంపై సిట్ దృష్టి సారించింది. ఇప్పటికే పలువురు మాజీ అధికారులను విచారించిన బృందం, అవినాష్ రెడ్డి ఇచ్చిన సమాచారం ఆధారంగా రాబోయే రోజుల్లో మరికొందరిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న ఈ కేసు దర్యాప్తు రానున్న రోజుల్లో మరెన్ని సంచలనాలకు దారితీస్తుందో చూడాలి.