


ఏపీ భవన నిర్మాణ నిబంధనల్లో భారీ సంస్కరణలు
రాష్ట్రంలో నిర్మాణ రంగాన్ని మరింత వేగవంతం చేయడంతో పాటు పెట్టుబడులను ఆకర్షించే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భవన నిర్మాణ అనుమతుల జారీ ప్రక్రియలో జాప్యాన్ని తగ్గించడం, పారదర్శకత పెంచడం, భద్రతా ప్రమాణాలను మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ నిబంధనలు–2017లో సమగ్ర సవరణలు చేపట్టింది. పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఈ సవరణలను ప్రకటించారు. సవరించిన నిబంధనల ద్వారా నిర్మాణ రంగంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు మరింత ఊతం లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మార్పులు జూలై 29న జారీ చేసిన జి.ఓ. ఎంఎస్. నెం.161 ద్వారా అమల్లోకి వచ్చాయి.
మంత్రి నారాయణ మాట్లాడుతూ, నిర్మాణ అనుమతుల ప్రక్రియలో అనవసరమైన ఆలస్యాలను తొలగించడం, పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణాన్ని కల్పించడం, భద్రతకు ఎలాంటి భంగం కలగకుండా నియంత్రణ వ్యవస్థను ఆధునికీకరించడం ఈ సంస్కరణల ప్రధాన ఉద్దేశమని తెలిపారు. గృహనిర్మాణం, రియల్ ఎస్టేట్, వాణిజ్య నిర్మాణ రంగాల్లో పెట్టుబడులు పెరిగేలా నిబంధనలను సరళీకరించినట్లు వివరించారు.
24 మీటర్ల నుంచి హై–రైజ్ భవనాలుగా గుర్తింపు
సవరించిన నిబంధనల ప్రకారం స్టిల్ట్ ఫ్లోర్‌తో కలిపి 24 మీటర్లు లేదా అంతకంటే ఎక్కువ ఎత్తు ఉన్న భవనాలను హై–రైజ్ భవనాలుగా పరిగణిస్తారు. ఇప్పటి వరకు ఉన్న కొన్ని నిబంధనలను సవరించి స్పష్టత తీసుకురావడంతో పాటు హై–రైజ్ భవనాల నిర్మాణంలో అనుసరించాల్సిన భద్రతా ప్రమాణాలను మరింత కట్టుదిట్టం చేశారు.
దశలవారీగా ఫైర్ క్లియరెన్స్
ఎత్తైన భవనాల నిర్మాణంలో ఎక్కువ సమయం తీసుకునే ఫైర్ ఎన్‌వోసీ ( నో అబ్జక్షన్) ప్రక్రియను సులభతరం చేశారు. కొత్త విధానం ప్రకారం 24 మీటర్ల ఎత్తు వరకు భవన నిర్మాణం చేపట్టేందుకు ముందుగా అనుమతి లభిస్తుంది. అనంతరం పై అంతస్తుల నిర్మాణానికి ముందు తుది అగ్నిమాపక శాఖ అనుమతి పొందితే సరిపోతుంది. దీంతో నిర్మాణ పనులు మధ్యలో నిలిచిపోకుండా వేగంగా పూర్తయ్యే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
మౌలిక సదుపాయాల రుసుము విడతల్లో చెల్లింపు
రియల్ ఎస్టేట్ రంగానికి ఆర్థికంగా ఊరటనిచ్చే నిర్ణయం కూడా ప్రభుత్వం తీసుకుంది. సిటీ లెవల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇంపాక్ట్ ఫీజును ఒకేసారి చెల్లించాల్సిన అవసరం లేకుండా మూడేళ్లలో ఆరు సమాన విడతలుగా చెల్లించేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో డెవలపర్లపై ఆర్థిక భారం తగ్గి కొత్త ప్రాజెక్టులు ప్రారంభించేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడతాయని ప్రభుత్వం భావిస్తోంది.
అలాగే, గడువు ముగిసిన భవన నిర్మాణ అనుమతులను తిరిగి పునరుద్ధరించుకునే అవకాశం కల్పించారు. దీంతో అనివార్య కారణాల వల్ల నిర్మాణ పనులు నిలిచిపోయిన ప్రాజెక్టులు మళ్లీ ప్రారంభించుకునేందుకు వెసులుబాటు కలుగుతుంది. అలాగే వాణిజ్యేతర ప్రార్థనా మందిరాలకు భవన అనుమతి రుసుమును పూర్తిగా మినహాయించారు.
ఈవీ ఛార్జింగ్ తప్పనిసరి
పర్యావరణహిత రవాణాకు ప్రోత్సాహం కల్పించే చర్యల్లో భాగంగా 5 వేల చదరపు మీటర్లు లేదా అంతకంటే ఎక్కువ నిర్మాణ విస్తీర్ణం ఉన్న వాణిజ్య సముదాయాలు, గృహ సముదాయాలు, టౌన్‌షిప్‌లలో ఈవీ ఛార్జింగ్ సదుపాయాలు తప్పనిసరి చేశారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిబంధనను తీసుకొచ్చినట్లు ప్రభుత్వం పేర్కొంది.
పెద్ద గృహ సముదాయాల్లో క్రెచ్‌లు
100 లేదా అంతకంటే ఎక్కువ గృహ యూనిట్లు ఉన్న గ్రూప్ హౌసింగ్ ప్రాజెక్టుల్లో క్రెచ్‌లు, క్లబ్ హౌస్‌లు, షాపింగ్ సదుపాయాలు, జిమ్‌ల వంటి సామూహిక సదుపాయాలు ఏర్పాటు చేయడం తప్పనిసరి చేశారు. అలాగే హై–రైజ్ భవనాల్లో ఎన్విరాన్‌మెంట్ డెక్ ఫ్లోర్లు, సర్వీస్ ఫ్లోర్ల నిర్మాణానికి కూడా అనుమతి ఇచ్చారు.
రిస్క్ ఆధారిత నియంత్రణ వ్యవస్థ
పురపాలక పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్. సురేష్ కుమార్ మాట్లాడుతూ, ఇకపై ప్రతి ప్రాజెక్టును దాని పరిమాణం, ఎత్తు, ప్రమాద స్థాయిని బట్టి పరిశీలించే రిస్క్-బేస్డ్ రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్ అమల్లోకి వస్తుందని తెలిపారు. దీని వల్ల అధికారులు సాధారణ ప్రక్రియల కంటే భద్రత, పట్టణ ప్రణాళిక అంశాలపై ఎక్కువ దృష్టి పెట్టగలరన్నారు.
డిజిటల్ విధానంతో వేగవంతమైన అనుమతులు
రాష్ట్రంలోని అన్ని పట్టణ స్థానిక సంస్థలు, పట్టణాభివృద్ధి సంస్థల్లో ఈ నిబంధనలను ఏకరీతిగా అమలు చేయనున్నారు. దరఖాస్తుల డిజిటల్ ప్రాసెసింగ్, నిపుణుల ధ్రువీకరణ, అనుమతుల అనంతర పర్యవేక్షణ వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా నిర్మాణ అనుమతులు మరింత వేగంగా జారీ అవుతాయని అధికారులు తెలిపారు. దీనివల్ల పౌరులు, ఆర్కిటెక్టులు, డెవలపర్లు, పెట్టుబడిదారులకు స్పష్టతతో పాటు జవాబుదారీతనం కూడా పెరుగుతుందని ప్రభుత్వం పేర్కొంది.
ఈ సంస్కరణలు అమల్లోకి రావడం వల్ల నిర్మాణ అనుమతుల జాప్యం గణనీయంగా తగ్గడంతో పాటు రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సాంకేతిక ఆధారిత పాలన, పారదర్శక అనుమతి వ్యవస్థ, భద్రతా ప్రమాణాల అమలు, పర్యావరణహిత నిర్మాణాలకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా రాష్ట్ర పట్టణాభివృద్ధికి ఈ మార్పులు కీలకంగా మారనున్నాయి.
