Let's talk: editor@tmv.in
ఏపీ బాలల హక్కుల కమిషన్ నూతన కార్యవర్గం బాధ్యతల స్వీకరణ

ఏపీ బాలల హక్కుల కమిషన్ నూతన కార్యవర్గం బాధ్యతల స్వీకరణ

Panthagani Anusha
31 మార్చి, 2026

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ నూతన చైర్‌పర్సన్‌గా వేటుకూరి ఏవీఎస్ సూర్యనారాయణ రాజు సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. రాజధాని అమరావతిలోని కమిషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయనతోపాటు నూతనంగా నియమితులైన ఆరుగురు సభ్యులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు.

నూతన సభ్యులుగా కే.జీ. వెంకట పద్మలత, డాక్టర్ ధోని శ్రీనివాస్ మూర్తి, ఉండవల్లి గాంధీ బాబు, చల్ల మధుసూదన రావు, మండల గంగ సూర్యనారాయణ, పి. నాగ మానసలు తమ విధుల్లో చేరారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది కొత్త కార్యవర్గానికి పుష్పగుచ్ఛాలు అందజేసి ఘనంగా స్వాగతం పలికారు.

అనంతరం మీడియాతో మాట్లాడిన చైర్‌పర్సన్ సూర్యనారాయణ రాజు, రాష్ట్రంలోని చిన్నారుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పకడ్బందీగా పని చేస్తామని హామీ ఇచ్చారు. బాలల హక్కుల పరిరక్షణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే ప్రథమ స్థానంలో నిలపడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో బాలలకు ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించేందుకు జిల్లా యంత్రాంగంతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటామని, ఏపీని ఒక సంపూర్ణ 'చైల్డ్-ఫ్రెండ్లీ' రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని ధీమా వ్యక్తం చేశారు.

అదేవిధంగా బాలల హక్కులకు ఎక్కడైనా ఏ రూపంలోనైనా భంగం వాటిల్లితే ప్రజలు మౌనంగా ఉండకుండా వెంటనే కమిషన్ దృష్టికి తీసుకురావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అక్రమ రవాణా బాలకార్మిక వ్యవస్థ, వేధింపులు వంటి అంశాలపై కఠినంగా వ్యవహరిస్తామని ప్రతి బిడ్డకు రక్షణ కల్పించడమే తమ ప్రథమ కర్తవ్యమని చైర్‌పర్సన్ సభ్యులు స్పష్టం చేశారు.