
ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన జి.సాయి ప్రసాద్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా (సీఎస్) సీనియర్ ఐఏఎస్ అధికారి జి. సాయి ప్రసాద్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర సచివాలయంలో జరిగిన అధికారిక కార్యక్రమంలో ఇప్పటి వరకు సీఎస్‌గా పనిచేసి పదవీ విరమణ పొందిన కె. విజయానంద్ నుంచి ఆయన బాధ్యతలను స్వీకరించారు.
బాధ్యతలు స్వీకరించే ముందు సాయి ప్రసాద్‌కు తిరుమల తిరుపతి దేవస్థానం, విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థాన వేద పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. పండితుల మంత్రోచ్ఛారణలు, ప్రత్యేక పూజా కార్యక్రమాల అనంతరం నిర్ణీత ముహూర్తమైన ఉదయం 11.33 గంటలకు ఆయన తన ఛాంబర్‌లో సీఎస్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు ఐఏఎస్ అధికారులు సచివాలయ ఉద్యోగులు ఆయనకు ఘనస్వాగతం పలికారు.
అసిస్టెంట్ కలెక్టర్ నుంచి సీఎస్ వరకు.. ప్రస్థానం ఇలా
1991 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన సాయి ప్రసాద్, విద్యార్థి దశలోనే ఎంటెక్ పూర్తి చేసి సివిల్స్‌కు ఎంపికయ్యారు. 1992లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వరంగల్ అసిస్టెంట్ కలెక్టర్‌గా తన పరిపాలనా ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన, అంచెలంచెలుగా ఎదిగారు. పాడేరు అసిస్టెంట్ కలెక్టర్‌గా, గుంటూరు మున్సిపల్ కమిషనర్‌గా, కడప జాయింట్ కలెక్టర్‌గా పనిచేశారు. అనంతరం కర్నూలు, చిత్తూరు జిల్లాల కలెక్టర్‌గా పనిచేసి క్షేత్రస్థాయి పరిపాలనపై పట్టు సాధించారు.
కీలక శాఖల్లో విశేష అనుభవం
పరిపాలనలో సుదీర్ఘ అనుభవం ఉన్న సాయి ప్రసాద్, ఇంధన శాఖలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టారు. ఏపీ ట్రాన్స్‌కో జేఎండీగా, విద్యుత్ పంపిణీ సంస్థలైన ఈపీడీసీఎల్, సీపీడీసీఎల్ సీఎండీగా సేవలందించారు. 2011 నుంచి 2014 వరకు కేంద్ర ప్రభుత్వ ఇంధన శాఖలో సంయుక్త కార్యదర్శిగా పనిచేసిన అనుభవం ఆయనకుంది. 2014-2019 మధ్య ముఖ్యమంత్రి కార్యాలయంలో కీలక బాధ్యతలు నిర్వహించారు. ఇటీవలి కాలంలో సీసీఎల్‌ఏగా, జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ముఖ్యమంత్రికి ఎక్స్‌అఫిషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సేవలందిస్తూ ఇప్పుడు రాష్ట్ర అత్యున్నత పరిపాలనా పదవిని చేపట్టారు.
ప్రముఖుల శుభాకాంక్షలు
ఈ సందర్భంగా ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు ఎస్.ఎస్.రావత్,యం.టి.కృష్ణ బాబు,ఎక్స్ అఫిషియో స్పెషల్ సిఎస్ బి.రాజశేఖర్,ముఖ్య కార్యదర్శులు శ్యామల రావు,ముఖేశ్ కుమార్ మీనా,కాంతిలాల్ దండే,పలువురు కార్యదర్శులు,వివిధ శాఖాధిపతులు,రాష్ట్ర సచివాలయం సహా వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిథులు సిఎస్ కు పుష్పగుచ్చాలు అందించి శుభా కాంక్షలు తెలిపారు. అదేవిదంగా రాష్ట్ర 20 సూత్రాల కార్యక్రమం అమలు చైర్మన్ లంకా దినకర్ సహా వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు శుభాకాంక్షలు తెలిపారు.
