Let's talk: editor@tmv.in
ఏపీ పారిశ్రామిక చరిత్రలో నూతన అధ్యాయం: నేడు ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్‌కు సీఎం శంకుస్థాపన

ఏపీ పారిశ్రామిక చరిత్రలో నూతన అధ్యాయం: నేడు ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్‌కు సీఎం శంకుస్థాపన

Panthagani Anusha
23 మార్చి, 2026

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ముఖచిత్రాన్ని సమూలంగా మార్చివేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వస్తుంది. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేట వద్ద ప్రపంచ ప్రఖ్యాత ఉక్కు దిగ్గజం 'ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా' (ఏఎం/ఎన్ఎస్) ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న గ్రీన్ ఫీల్డ్ సమగ్ర ఉక్కు కర్మాగారానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు శంకుస్థాపన చేయనున్నారు. సుమారు రూ. 1,35,964 కోట్ల భారీ పెట్టుబడితో రానున్న ఈ ప్రాజెక్టు రాష్ట్రంలో భారీ పారిశ్రామిక విప్లవానికి నాంది పలకనుంది.

రెండు దశల్లో భారీ ఉత్పత్తి సామర్థ్యం

మొత్తం 5,465 ఎకరాల విస్తీర్ణంలో రూపుదిద్దుకోనున్న ఈ భారీ పరిశ్రమను రెండు దశల్లో అభివృద్ధి చేయనున్నారు. తొలి దశలో 7.3 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యాన్ని రెండో దశలో మరో 10.5 మిలియన్ మెట్రిక్ టన్నులను నిర్మించనున్నారు. వెరసి ఏడాదికి 17.8 మిలియన్ మెట్రిక్ టన్నుల వార్షిక సామర్థ్యంతో ఈ ప్లాంట్ దేశీయ ఉక్కు అవసరాలను తీర్చడంలో కీలక పాత్ర పోషించనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా కలిపి సుమారు ఒక లక్ష మందికి పైగా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

రూ. 11,198 కోట్లతో ప్రత్యేక పోర్టు

ఈ ఉక్కు కర్మాగారానికి అనుబంధంగా 316 ఎకరాల్లో ప్రత్యేకంగా 'క్యాప్టివ్ పోర్టు ను కూడా ప్రభుత్వం మంజూరు చేసింది. రూ. 11,198 కోట్ల అదనపు పెట్టుబడితో 50 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో నిర్మించనున్న ఈ రేవు ద్వారా మరో 6,000 మందికి ఉపాధి దక్కనుంది. ప్లాంట్‌ను జాతీయ రహదారి-16తో అనుసంధానించేందుకు వీలుగా ప్రభుత్వం ఇప్పటికే నాలుగు లేన్ల రహదారి పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టింది. ఈ ప్రాజెక్టు రాకతో విశాఖపట్నం ఆర్థిక ప్రాంతం దేశంలోనే ప్రధాన పారిశ్రామిక హబ్‌గా అవతరించనుంది.

మరోవైపు ఈ చారిత్రాత్మక వేడుకలో కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామి, కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తదితరులు పాల్గొననున్నారు. ప్రత్యేక ఆకర్షణగా ఆర్సెలర్ మిట్టల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీ నివాస్ మిట్టల్ ఏఎం/ఎన్ఎస్ ఇండియా చైర్మన్ ఆదిత్య మిట్టల్ ఈ కార్యక్రమంలో పాల్గొని పారిశ్రామిక ఒప్పందాలను కుదుర్చుకోనున్నారు.

ఇదిలాఉండగా షెడ్యూల్ ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మధ్యాహ్నం అమరావతి నుంచి హెలికాప్టర్‌లో రాజయ్యపేటకు చేరుకుంటారు. మధ్యాహ్నం 3:40 గంటలకు 'అనుభవ కేంద్రాన్ని' సందర్శించి ఉక్కు ప్లాంట్ నమూనాను పరిశీలిస్తారు. అనంతరం శంకుస్థాపన ఫలకాన్ని ఆవిష్కరించి, గ్లోబల్ స్టీల్ సంస్థతో ఒప్పందాల మార్పిడి కార్యక్రమంలో పాల్గొంటారు.