Let's talk: editor@tmv.in
ఏపీ పారిశ్రామిక చరిత్రలో కొత్త అధ్యాయం: రూ.1.36 లక్షల కోట్ల ఉక్కు ప్లాంట్‌కు సీఎం శంకుస్థాపన

ఏపీ పారిశ్రామిక చరిత్రలో కొత్త అధ్యాయం: రూ.1.36 లక్షల కోట్ల ఉక్కు ప్లాంట్‌కు సీఎం శంకుస్థాపన

Panthagani Anusha
24 మార్చి, 2026

చంద్రబాబు అనే నేను చెబుతున్నాను పరిశ్రమలకు ఆంధ్రప్రదేశే దేశంలోనే అత్యుత్తమ గమ్యస్థానం" అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు. సోమవారం అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద ఆర్సెలార్ మిట్టల్ - నిప్పన్ స్టీల్ ఇండియా నిర్మించనున్న భారీ ఉక్కు కర్మాగారానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ ఇది కేవలం ఒక పరిశ్రమ స్థాపన మాత్రమే కాదని ఉత్తరాంధ్ర తలరాతను మార్చే ‘స్టీల్ సిటీ’ నిర్మాణానికి పునాది అని స్పష్టం చేశారు. కాగా కేంద్ర మంత్రి హెచ్.డి. కుమారస్వామి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌లతో కలిసి ఆయన భూమి పూజలో పాల్గొన్నారు.

రూ.1.35 లక్షల కోట్ల మహా యజ్ఞం

రాష్ట్ర పారిశ్రామిక చరిత్రలో ఇది ఒక సువర్ణ అధ్యాయమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ భారీ ప్రాజెక్టు ద్వారా రూ.1.35 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయని దీనివల్ల లక్ష మంది యువతకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి లభిస్తుందని వెల్లడించారు. రెండు దశల్లో నిర్మితమయ్యే ఈ ప్లాంట్ ద్వారా ఏటా 17.8 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి అవుతుందని అదేవిదంగా 2028 నాటికి తొలి దశ ఉత్పత్తి ప్రారంభమయ్యేలా 2030 జూన్ నాటికి మొదటి బ్లాస్ట్ ఫర్నెస్ సిద్ధమయ్యేలా ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు.

అయితే ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం 20 నెలల కాలంలోనే భూసేకరణ, అనుమతుల ప్రక్రియను పూర్తి చేసి "స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్" అంటే ఏంటో నిరూపించామని పరిశ్రమలకు అవసరమైన నిపుణులు, అపారమైన మానవ వనరులు ఏపీ సొంతం. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ రాబోతోంది. బీపీసీఎల్ వంటి దిగ్గజ సంస్థలు రాష్ట్రానికి క్యూ కడుతున్నాయి. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా ఒక కుటుంబం - ఒక పారిశ్రామికవేత్త నినాదాన్ని సాకారం చేస్తాం అని ధీమా వ్యక్తం చేశారు.

సముద్ర మార్గం నుంచి రైలు మార్గం వరకు

పరిశ్రమ అవసరాల కోసం రూ.11,198 కోట్లతో ప్రత్యేకంగా ఒక క్యాప్టివ్ పోర్టును నిర్మిస్తున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. ముడి ఇనుము సరఫరా కోసం పైప్‌లైన్ వ్యవస్థ, జాతీయ రహదారిని అనుసంధానిస్తూ 4 లేన్ల రోడ్డు నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. ఉత్తరాంధ్ర ప్రాంతం ఇకపై రేర్ ఎర్త్ మినరల్ హబ్‌గా మారుతుందని జూలైలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభంతో ఈ ప్రాంతం గ్లోబల్ మ్యాప్‌లో నిలుస్తుందని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం ఆర్సెలార్ మిట్టల్ మధ్య రెండు కీలక ఒప్పందాలు జరిగాయి. స్థానిక యువతకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పించేలా నైపుణ్యాభివృద్ధి కేంద్రం అత్యాధునిక మెటలర్జీ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు సంస్థ చైర్మన్ ఆదిత్య మిట్టల్ ప్రకటించారు. అనకాపల్లి జిల్లా యువతకు ఈ పరిశ్రమలో మొదటి ప్రాధాన్యత ఉంటుందని సీఎం హామీ ఇచ్చారు.

డబుల్ ఇంజన్ సర్కార్ విజయం

రాష్ట్రంపై ప్రధాని నరేంద్ర మోదీ చూపిస్తున్న ప్రత్యేక అభిమానానికి ఈ వేదిక ద్వారా చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని ఆశయాలైన ‘మేకిన్ ఇండియా’, ‘ఆత్మనిర్భర్ భారత్’లకు ఏపీ కేరాఫ్ అడ్రస్‌గా మారుతోందన్నారు. "ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు రూ. 20.35 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అభివృద్ధి-సంక్షేమం-సుపరిపాలన లక్ష్యంగా పవన్ కళ్యాణ్ సహకారంతో రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తున్నాం అని పేర్కొన్నారు.

అనంతరం సీఎం, కేంద్ర మంత్రులు మరియు ప్రతినిధులు అక్కడ ఏర్పాటు చేసిన ఎక్స్‌పీరియన్స్ జోన్‌ను సందర్శించిప్లాంట్ మీనియేచర్ మోడల్‌ను తిలకించారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, మంత్రులు అనిత, కొల్లు రవీంద్ర, టీజీ భరత్, అచ్చెన్నాయుడు, లక్ష్మీ మిట్టల్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

ఏపీ పారిశ్రామిక చరిత్రలో కొత్త అధ్యాయం: రూ.1.36 లక్షల కోట్ల ఉక్కు ప్లాంట్‌కు సీఎం శంకుస్థాపన - Tholi Paluku