Let's talk: editor@tmv.in
ఏపీ పంచాయతీరాజ్ సవరణ బిల్లు-2026కు అసెంబ్లీ ఆమోదం

ఏపీ పంచాయతీరాజ్ సవరణ బిల్లు-2026కు అసెంబ్లీ ఆమోదం

Panthagani Anusha
20 ఫిబ్రవరి, 2026

రాష్ట్రంలోని పంచాయతీరాజ్ సంస్థల ఎన్నికల ప్రక్రియలో కీలక మార్పులకు నాంది పలుకుతూ రూపొందించిన ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్ సవరణ బిల్లు-2026’కు శాసనసభ బుధవారం ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు అధ్యక్షతన జరిగిన సభలో ఈ బిల్లుపై చర్చ అనంతరం దీనిని ఆమోదించినట్లు ప్రకటించారు. యువతకు ఓటు హక్కు కల్పించడంలో ఉన్న సాంకేతిక ఇబ్బందులను తొలగిస్తూ మరింత పారదర్శకతకు ఈ సవరణలు దోహదపడతాయని ప్రభుత్వం పేర్కొంది.

ఏడాదికి నాలుగు సార్లు

ఈ సవరణ బిల్లులో ప్రధానంగా ఓటర్ల నమోదు ప్రక్రియలో విప్లవాత్మక మార్పు తీసుకువచ్చారు. ఇప్పటివరకు పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కు పొందాలంటే కేవలం జనవరి 1వ తేదీని మాత్రమే అర్హత తేదీగా పరిగణించేవారు. దీనివల్ల జనవరి 2న 18 ఏళ్లు నిండిన యువత ఓటు హక్కు కోసం మళ్లీ ఏడాది కాలం పాటు నిరీక్షించాల్సి వచ్చేది. తాజాగా ఆమోదించిన సవరణ ప్రకారం.. ఏడాదిలో జనవరి 1, ఏప్రిల్ 1, జూలై 1 అదేవిధంగా అక్టోబర్ 1 తేదీలను అర్హత తేదీలుగా నిర్ణయించారు. దీనివల్ల ఏ త్రైమాసికంలో 18 ఏళ్లు నిండిన యువత ఆ వెంటనే ఓటు కోసం దరఖాస్తు చేసుకునే వీలు కలుగుతుంది.

ఏకరీతి ఓటర్ల జాబితా

అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలతో పాటు మున్సిపాలిటీల్లో ఇప్పటికే అమల్లో ఉన్న ఈ విధానాన్ని ఇప్పుడు పంచాయతీరాజ్ సంస్థలకు కూడా వర్తింపజేశారు. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఎన్నికలకు ఒకే రకమైన ఓటర్ల జాబితా విధానం అందుబాటులోకి వస్తుంది. ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖామాత్యులు పవన్ కళ్యాణ్ తరపున పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. గత ఏడాది డిసెంబర్ 23న ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌కు ఈ బిల్లు ద్వారా ఇప్పుడు శాసనసభ చట్టబద్ధత కల్పించింది.

జాబితాలో అక్రమాలకు తావుండకూడదు

బిల్లుపై జరిగిన చర్చలో ఎమ్మెల్యేలు లోకం నాగ మాధవి, ఎన్. ఈశ్వరరావు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు. ఓటర్ల జాబితా రూపకల్పనలో గతంలో జరిగిన పొరపాట్లను ప్రస్తావిస్తూ భవిష్యత్తులో అక్రమాలకు తావులేకుండా పారదర్శకమైన జాబితాను సిద్ధం చేయాలని వారు కోరారు. ఇందుకు స్పందించిన మంత్రి దుర్గేష్.. సభ్యుల సూచనలను ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పటిష్టమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.