
ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్...త్వరలో మరో డీఎస్సీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు కూటమి ప్రభుత్వం శుభవార్త అందించింది. సరికొత్త జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేయడంతో పాటు, ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మరో విడత డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. గురువారం శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సమాధానమిస్తూ ఈ కీలక ప్రకటన చేశారు.
మరో 3,600 పోస్టులతో నోటిఫికేషన్
రాష్ట్రవ్యాప్తంగా వివిధ పాఠశాలల్లో ఉన్న ఖాళీలపై ఇప్పటికే క్షేత్రస్థాయి నుంచి పూర్తి వివరాలు సేకరించినట్లు మంత్రి వెల్లడించారు. తాజా అంచనాల ప్రకారం సుమారు 3,600 పోస్టులతో ఈ కొత్త నోటిఫికేషన్ ఉండబోతోందని ఆయన వివరించారు. గత ఏడాదే 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అందులో రిజర్వేషన్ అభ్యర్థులు లభించక మిగిలిపోయిన ఖాళీలను కూడా ప్రస్తుత జాబ్ క్యాలెండర్‌లో చేర్చి భర్తీ చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.
కర్నూలు జిల్లాకు పారిశ్రామిక, విద్యా ప్రోత్సాహకాలు
వెనుకబడిన రాయలసీమ ప్రాంతం, ప్రత్యేకించి కర్నూలు జిల్లా అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు లోకేష్ తెలిపారు. నా పాదయాత్ర సమయంలో ఆదోని నుంచి మంత్రాలయం వరకు పర్యటించినప్పుడు అక్కడి పరిస్థితులను కళ్లారా చూశాను. అందుకే కర్నూలుకు పెట్టుబడులను ఆకర్షించేందుకు అదనపు పారిశ్రామిక ప్రోత్సాహకాలను అందిస్తున్నాం" అని ఆయన పేర్కొన్నారు. విద్యారంగంలోనూ జిల్లాకు ప్రాధాన్యతనిస్తూ గత డీఎస్సీలో అత్యధిక పోస్టులు కర్నూలుకే కేటాయించామని ఉపాధ్యాయ-విద్యార్థి నిష్పత్తిని మెరుగుపరిచేందుకు మరిన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
క్లస్టర్ యూనివర్సిటీకి రూ. 139 కోట్లు
కర్నూలు క్లస్టర్ విశ్వవిద్యాలయం అభివృద్ధి గురించి సభ్యురాలు గౌరు చరితారెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సానుకూలంగా స్పందించారు. ఈ వర్సిటీ పనుల కోసం మొత్తం రూ. 139 కోట్లు మంజూరు చేసినట్లు ప్రకటించారు. ఇందులో ఇప్పటికే రూసా నిధుల కింద రూ. 55 కోట్లు వెచ్చించామని మిగిలిన పెండింగ్ పనులను వచ్చే విద్యా సంవత్సరం నాటికి పూర్తి చేసేలా అవసరమైన నిధులను విడుదల చేస్తామని స్పష్టం చేశారు. క్లస్టర్ విధానం ద్వారా ప్రత్యేక సబ్జెక్టులపై పరిశోధనలు జరిగేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.
వేతనాల్లో ఏపీనే మేటి.. త్వరలో సీజనల్ హాస్టళ్లు
సమగ్ర శిక్షా అభియాన్ కింద పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగుల వేతనాలపై మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. దక్షిణ భారతదేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లోనే అత్యధిక వేతనాలు చెల్లిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఇది కేంద్ర ప్రభుత్వ పథకం కాబట్టి వేతనాల పెంపు సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే ప్రయత్నం చేస్తామని భరోసా ఇచ్చారు. అదేవిధంగా వలస కూలీల పిల్లల విద్యాభ్యాసం కోసం త్వరలోనే 'సీజనల్ హాస్టళ్లను' ప్రారంభిస్తామని వెల్లడించారు.
