
ఏపీ జెన్కో లో 27 మందికి కారుణ్య నియామక పత్రాలు
విద్యుత్ శాఖలో వివిధ ప్రమాదాల కారణంగా ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగుల కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో బాధిత కుటుంబాలకు భరోసా కల్పిస్తూ అర్హులైన వారందరికీ కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు వెల్లడించారు. శుక్రవారం సచివాలయంలోని తన కార్యాలయంలో 27 మంది లబ్ధిదారులకు మంత్రి గొట్టిపాటి, విద్యుత్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (సిఎస్) విజయానంద్ కలిసి నియామక పత్రాలను అందజేశారు.
విద్యార్హతకు తగ్గట్టుగా పోస్టులు
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఉన్నత విద్యావంతులకు కేవలం జూనియర్ అసిస్టెంట్ పోస్టులకే పరిమితం చేశారని కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యార్హతలను బట్టి జూనియర్ ఇంజనీర్ వంటి పోస్టులను భర్తీ చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు విద్యుత్ శాఖలో సుమారు 500 మందికి పైగా కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు కల్పించామని వివరించారు.
ప్రతి మూడు నెలలకోసారి నియామకాలు
బాధిత కుటుంబాలు ఏళ్ల తరబడి నిరీక్షించకుండా ఉండేందుకు ప్రతి మూడు నెలలకోసారి కారుణ్య నియామక ప్రక్రియను చేపడుతామని మంత్రి హామీ ఇచ్చారు. అయితే కొత్తగా విధుల్లో చేరిన వారికి ప్రస్తుతం పనిచేస్తున్న వారికి విశాఖపట్నంలోని 'సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్' ద్వారా శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగులందరూ రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి విద్యుత్ సంస్థల అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు.
నైపుణ్యం పెంచుకుంటేనే పదోన్నతులు: విజయానంద్
మరోవైపు విద్యుత్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్ మాట్లాడుతూ విధి నిర్వహణలో ఉద్యోగుల భద్రతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. సాంకేతికతకు అనుగుణంగా ఉద్యోగులు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటే పదోన్నతులు త్వరగా లభిస్తాయని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు అశోక్ రెడ్డి, నారాయణ రెడ్డి ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పుల్లారెడ్డి, జెన్‌కో డైరెక్టర్లు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
