Let's talk: editor@tmv.in
ఏపీ జెన్కో రికార్డు: ఒకే రోజు 6,160 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తి

ఏపీ జెన్కో రికార్డు: ఒకే రోజు 6,160 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తి

Panthagani Anusha
14 మార్చి, 2026

ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రంగంలో ఒక అద్భుతమైన మైలురాయి నమోదైంది . ప్రభుత్వ రంగ సంస్థ ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ (ఏపీ జెన్కో) థర్మల్ విద్యుత్ ఉత్పత్తిలో మునుపెన్నడూ లేని విధంగా చారిత్రాత్మక మైలురాయిని అధిగమించింది. గత బుధవారం (మార్చి 11న) ఏపీ జెన్కో ప్లాంట్ల ద్వారా ఒకే రోజు ఏకంగా 6,160 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని సాధించి సరికొత్త రికార్డును నెలకొల్పింది. సంస్థ చరిత్రలోనే ఇది అత్యధిక ఉత్పత్తి కావడం గమనార్హం. ఈ అసాధారణ విజయానికి కారకులైన జెన్కో అధికారులు, ఇంజనీర్లు, కార్మికులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా అభినందించారు.

రాష్ట్రంలోని ఏపీ జెన్కో ఆధ్వర్యంలో ఉన్న థర్మల్ విద్యుత్ కేంద్రాల మొత్తం స్థాపిత సామర్థ్యం 6,610 మెగావాట్లు. కాగా తాజా గణాంకాల ప్రకారం 6,160 మెగావాట్ల ఉత్పత్తిని నమోదు చేయడం ద్వారా సంస్థ 93.19 శాతం ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్‌ను సాధించినట్లయింది. గరిష్ట సామర్థ్యానికి అత్యంత సమీపంలో విద్యుత్ ఉత్పత్తిని కొనసాగించడం ద్వారా రాష్ట్ర విద్యుత్ అవసరాలను తీర్చడంలో జెన్కో తన శక్తిసామర్థ్యాలను మరోసారి చాటుకుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్లాంట్ల పనితీరు మెరుగుపడటం బొగ్గు సరఫరాలో సమన్వయం ఉండటం వల్లే ఈ ఘనత సాధ్యమైందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ఈ రికార్డు స్థాయి ఘనతపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 'ఎక్స్' వేదికగా స్పందిస్తూ గత 20 నెలలుగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విద్యుత్ రంగ పునరుద్ధరణ కోసం తీసుకున్న వ్యూహాత్మక చర్యలు, సంస్కరణల ఫలితమే ఈ అద్భుత ప్రగతి అని ఆయన కొనియాడారు. రాష్ట్రంలో పారిశ్రామిక అవసరాలకు, సామాన్య ప్రజలకు నాణ్యమైన విద్యుత్తును అంతరాయం లేకుండా అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆ దిశగా విద్యుత్ రంగం పటిష్టంగా ముందుకు సాగుతోందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ విజయం సాధించడంలో పగలు రాత్రి కష్టపడిన జెన్కో కార్మికులు, క్షేత్రస్థాయి ఇంజనీర్లు, ఉన్నతాధికారులు విద్యుత్ శాఖ మంత్రి కృషిని ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇక రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా విద్యుత్ ఉత్పత్తిని మరింత పెంచేందుకు ప్రభుత్వం తన మద్దతును కొనసాగిస్తుందని భవిష్యత్తులో మరిన్ని మెరుగైన ఫలితాలను సాధించాల్సి ఉందని ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ఏపీ జెన్కో రికార్డు: ఒకే రోజు 6,160 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తి - Tholi Paluku