
ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్‌గా ఎమ్మెల్సీ నాగబాబు
ఆంధ్రప్రదేశ్‌లో పచ్చదనం పెంపు, అటవీ విస్తీర్ణం, పర్యావరణ పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం మరింత ప్రాధాన్యం ఇస్తోంది. ఇందులో భాగంగా ‘ఆంధ్రప్రదేశ్ సొసైటీ ఫర్ గ్రీనింగ్ అండ్ రీఫారెస్టేషన్ ఫర్ ఎకలాజికల్ ఎన్‌రిచ్‌మెంట్ (ఏపీ గ్రీన్)’ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్‌పర్సన్‌గా ఎమ్మెల్సీ కొణిదెల నాగేంద్రరావు (నాగబాబు)ను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు పర్యావరణ, అటవీ శాఖ సోమవారం జీవో నంబర్.93 జారీ చేసింది. ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్‌పర్సన్‌గా నాగబాబుకు క్యాబినెట్ హోదా కల్పిస్తున్నట్లు ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. త్వరలో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు.
2047 నాటికి 50 శాతం గ్రీన్ కవర్ లక్ష్యం
రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో అటవీ, పచ్చదనం కవరేజీని 2047 నాటికి 50 శాతానికి పెంచడం ఏపీ గ్రీన్ ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం నిర్దేశించింది. రాష్ట్రవ్యాప్తంగా పచ్చదనం పెంపు, అడవులను పునరుద్ధరించడం(పునర్వనీకరణ) , అటవీ పరిరక్షణ, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలను సమన్వయంతో అమలు చేయనుంది. ఏపీ గ్రీన్ కార్యక్రమాల అమలుకు గవర్నింగ్ బోర్డు, ఎగ్జిక్యూటివ్ కమిటీతో పాటు జిల్లాస్థాయిలో పాలక మండళ్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. వివిధ శాఖలు, జిల్లాస్థాయి సంస్థల మధ్య సమన్వయం సాధించడం, కార్యక్రమాల అమలును వేగవంతం చేయడం, పురోగతిని పర్యవేక్షించడం వంటి కీలక బాధ్యతలను ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్‌పర్సన్ నిర్వహించనున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా చేపట్టే పచ్చదనం పెంపు, అడవులను పునరుద్ధరించడం కార్యక్రమాలకు జిల్లాస్థాయి వ్యవస్థలను అనుసంధానిస్తూ సమర్థవంతమైన అమలు వ్యవస్థను బలోపేతం చేయడంలో నాగబాబు నియామకం కీలకంగా ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని పర్యావరణ సమతుల్యతను కాపాడటం, అడవులు, చెట్ల విస్తీర్ణాన్ని పెంచడం, పునర్వనీకరణ కార్యక్రమాలను విస్తృత స్థాయిలో చేపట్టడం లక్ష్యంగా ఏపీ గ్రీన్ పనిచేయనుంది. నాగబాబు నాయకత్వంలో ఈ కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా మరింత సమర్థవంతంగా ముందుకు సాగుతాయని కూటమి భాగస్వామ్య పార్టీల నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు.
