
ఏపీ గవర్నర్‌తో టాసా జీఓసీ మేజర్ జనరల్ అజయ్ మిశ్రా కీలక భేటీ
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సబ్ ఏరియా(టాసా) జనరల్ ఆఫీసర్ కమాండింగ్ మేజర్ జనరల్ అజయ్ మిశ్రా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశం ద్వారా సైన్యం, పౌర పరిపాలన మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేయాలన్న లక్ష్యంతో పలు కీలక అంశాలపై చర్చలు జరిగాయి.
ఈ భేటీ ప్రధానంగా “మిలిటరీ-సివిల్ ఫ్యూజన్”ను ప్రోత్సహించడంపై కేంద్రీకృతమైందని ఈస్ట్రన్ నేవల్ కమాండ్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాల్లో భారత సైన్యం పాత్రను విస్తరించడం, ప్రభుత్వ యంత్రాంగంతో సమన్వయం పెంచడం ద్వారా సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని అధికారులు భావిస్తున్నారు.
గవర్నర్‌తో జరిగిన చర్చల్లో దేశ నిర్మాణానికి సంబంధించిన కార్యక్రమాలు, గ్రామీణ, పట్టణ స్థాయిలో సమాజ అభివృద్ధి, విపత్తుల సమయంలో సైన్యం పాత్ర, భద్రతా వ్యవస్థల బలోపేతం వంటి అంశాలు ప్రధానంగా ప్రస్తావించబడ్డాయి. ముఖ్యంగా ప్రకృతి విపత్తుల సమయంలో సైన్యం అందించే సహాయంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు సమాచారం.
తదుపరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును మేజర్ జనరల్ మిశ్రా సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పలు అంశాలపై చర్చించారు
ఈ బేటీ అనంతరం , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్‌ను సచివాలయంలో కలిసిన మిశ్రా, సైన్యానికి సంబంధించిన యూనిట్ల స్థాపనకు భూమి కేటాయింపు, మౌలిక వసతుల అభివృద్ధి వంటి అంశాలను ప్రస్తావించారు. రాష్ట్ర ప్రభుత్వం, సైన్యం మధ్య సమన్వయం ద్వారా ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని అభిప్రాయపడ్డారు.
మేజర్ జనరల్ మిశ్రా అనంతరం ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల మంత్రి టీజీ భరత్‌ను కూడా కలిశారు. రాష్ట్రంలో రక్షణ పరిశ్రమల అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, పరిశ్రమలతో భాగస్వామ్యం వంటి అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా డిఫెన్స్ ఇండస్ట్రియల్ ఎకోసిస్టమ్‌ను బలోపేతం చేయడానికి సైన్యం మార్గదర్శకత అందించడానికి సిద్ధంగా ఉందని తెలిపారు.
ఈ పర్యటనలో భాగంగా మిశ్రా, రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హరీష్ కుమార్ గుప్తాతో భద్రతా అంశాలపై సమగ్ర చర్చలు జరిపారు. రాష్ట్ర భద్రతా పరిస్థితులు, అంతర్గత భద్రతా సవాళ్లు, ఇంటెలిజెన్స్ పంచుకోలు వంటి అంశాలతో పాటు మాజీ సైనికుల సంక్షేమానికి సంబంధించిన అంశాలను సమీక్షించారు. మాజీ సైనికుల పునరావాసం, ఉపాధి అవకాశాల కల్పనపై కూడా చర్చ జరిగింది.
మొత్తం మీద ఈ పరంపరలో జరిగిన సమావేశాలు సైన్యం పౌర పరిపాలన మధ్య పరస్పర అవగాహనను పెంపొందించడమే కాకుండా, భద్రత, అభివృద్ధి, విపత్తు నిర్వహణ వంటి కీలక రంగాల్లో సమిష్టి కృషికి దారితీయనున్నాయని అధికారులు వెల్లడించారు.
