Let's talk: editor@tmv.in
ఏపీ కలెక్టర్ల సదస్సులో వినూత్నప్రాజెక్టుల వెల్లడి

ఏపీ కలెక్టర్ల సదస్సులో వినూత్నప్రాజెక్టుల వెల్లడి

Dantu Vijaya Lakshmi Prasanna
12 మార్చి, 2026

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆరో కలెక్టర్ల సదస్సులో భాగంగా మొదటి రోజున రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అమలవుతున్న వినూత్న కార్యక్రమాలను కలెక్టర్లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ల రూపంలో వివరించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం, సుస్థిర అభివృద్ధి లక్ష్యంగా తీసుకున్న చర్యలు, జిల్లాల్లో అమలు చేస్తున్న విజయవంతమైన ప్రాజెక్టులను (సక్సెస్ స్టోరీస్) వారు సమగ్రంగా వివరించారు. ఈ ప్రజెంటేషన్లు అధికారులు, ప్రభుత్వానికి మార్గదర్శకంగా నిలుస్తాయని సీఎం నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా చిత్తూరు, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ, ఎస్‌పీఎస్‌ఆర్ నెల్లూరు, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల కలెక్టర్లు తమ జిల్లాల్లో అమలు చేస్తున్న వినూత్న కార్యక్రమాల గురించి వివరించారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడం, సేవలను సులభతరం చేయడం, రైతుల ఆదాయం పెంచడం వంటి అంశాలపై తీసుకున్న చర్యలను వివరించారు.

చిత్తూరు జిల్లా - ‘సంజీవని’ ప్రాజెక్ట్

గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలను మెరుగుపరచేందుకు చిత్తూరు జిల్లాలో అమలు చేస్తున్న “సంజీవని” ప్రాజెక్ట్ గురించి కలెక్టర్ సుమిత్ కుమార్ వివరించారు. టాటా సంస్థ సహకారంతో ఏర్పాటు చేసిన డిజిటల్ నెర్వ్ సెంటర్ ద్వారా జిల్లాలోని 119 ఆరోగ్య కేంద్రాలను అనుసంధానం చేసినట్లు తెలిపారు. ఇప్పటికే 3.10 లక్షల మందికి పైగా పౌరులకు డిజిటల్ హెల్త్ రికార్డులు రూపొందించామని చెప్పారు. డాక్టర్లు అందుబాటులో లేని మారుమూల గ్రామాల్లో టెలీ కన్సల్టేషన్ ద్వారా వైద్య సేవలు అందిస్తున్నామని, వైద్యులకు సహాయపడేందుకు ఏఐ ఆధారిత అంబియంట్ లిసనింగ్ టెక్నాలజీని వినియోగిస్తున్నామని వివరించారు. ‘ట్రూ వెల్నెస్ మీటర్’, ‘కేర్ ప్లానోగ్రామ్’ వంటి వ్యవస్థల ద్వారా 12 రకాల ప్రాథమిక ఆరోగ్య సేవలు అందిస్తూ ఇప్పటివరకు 63 వేల మందికి పైగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించామని తెలిపారు.

కోనసీమ జిల్లా - సెంటర్ ఫర్ మైగ్రేషన్

విదేశాలకు ఉపాధి కోసం వెళ్లే కార్మికులను మోసాల నుంచి రక్షించేందుకు ఏర్పాటు చేసిన “కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్” గురించి కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ వివరించారు. జిల్లాలో సుమారు 15 వేల మంది గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్నారని, వారిలో చాలా మంది నకిలీ ఏజెంట్ల చేతిలో మోసపోతున్నారని గుర్తించి ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. జిల్లా రెవెన్యూ అధికారిని నోడల్ అధికారిగా నియమించి ఐదుగురు సిబ్బందితో 24 గంటల హెల్ప్‌లైన్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు 199 ఫిర్యాదులను పరిష్కరించడంతో పాటు ఇబ్బందుల్లో ఉన్న 40 మంది వలస కార్మికులను సురక్షితంగా స్వదేశానికి రప్పించామని చెప్పారు. విదేశాలకు వెళ్లే యువతకు ముందస్తుగా కౌన్సెలింగ్ ఇచ్చి వారి పాస్‌పోర్ట్, వీసా, కంపెనీ వివరాలను పోలీసుల సమన్వయంతో పరిశీలించిన తర్వాతే పంపుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంపై సీఎం చంద్రబాబు స్పందించి కలెక్టర్‌ను అభినందిస్తూ, ఈ విధానాన్ని అన్ని జిల్లాల్లో అమలు చేయాలని సూచించారు. రాష్ట్రస్థాయిలో ప్రత్యేక మైగ్రేషన్ పోర్టల్ ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు.

నెల్లూరు జిల్లా - భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం

ఎస్‌పీఎస్‌ఆర్ నెల్లూరు జిల్లాలో దశాబ్దాలుగా కొనసాగుతున్న భూ వివాదాలను పరిష్కరించేందుకు తీసుకున్న చర్యలను కలెక్టర్ హిమాన్షు శుక్లా వివరించారు. భూ సమస్యల పరిష్కారం కోసం అధికారులే నేరుగా గ్రామాలకు వెళ్లి నాలుగు దఫాలుగా సమస్యలను పరిష్కరించే విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. మొదటి దఫాలో ప్రజల సమస్యలు వినడం, రెండో దఫాలో పాత రికార్డుల పరిశీలన, మూడో దఫాలో డిజిటల్ సర్వే నిర్వహించడం, నాలుగో దఫాలో పారదర్శకంగా నిర్ణయం తీసుకుని పట్టాలు అందజేయడం జరుగుతుందని చెప్పారు. ఈ విధానం ద్వారా కేవలం మూడు నెలల్లో 110 గ్రామాల్లో కార్యక్రమం నిర్వహించగా, అందులో 26 గ్రామాలు పూర్తిగా భూ వివాద రహిత గ్రామాలుగా మారినట్లు గణాంకాలతో వివరించారు.

విశాఖపట్నం జిల్లా -‘ వైజాగ్ వన్’ యాప్

నగర ప్రజలకు ప్రభుత్వ సేవలను ఒకే వేదికపై అందించేందుకు రూపొందించిన “వైజాగ్ వన్” మొబైల్ యాప్ గురించి విశాఖపట్నం కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ వివరించారు. ఆస్తి పన్ను, నీటి బిల్లులు చెల్లించడంతో పాటు పౌరులు తమ ఫిర్యాదులను మొబైల్ ద్వారానే నమోదు చేసి పరిష్కార స్థితిని తెలుసుకునేలా యాప్ రూపొందించినట్లు తెలిపారు. పీజీఆర్‌ఎస్ వ్యవస్థతో అనుసంధానం చేసి ఫిర్యాదుల పరిష్కారాన్ని ట్రాక్ చేయవచ్చని చెప్పారు. అలాగే ఏఐ చాట్‌బాట్ ద్వారా ప్రజల సందేహాలకు 24 గంటలూ సమాధానాలు అందిస్తున్నామని, నగరంలోని గాలి నాణ్యత వివరాలు, ఆసుపత్రులు, అత్యవసర సేవల వివరాలు కూడా యాప్‌లో అందుబాటులో ఉంటాయని తెలిపారు. పౌరులకు సౌలభ్యం, పారదర్శకత, సమర్థత అనే మూడు మూల సూత్రాల ఆధారంగా ఈ డిజిటల్ వ్యవస్థను రూపొందించామని వివరించారు.

విజయనగరం జిల్లా - మిషన్ హోప్

వ్యవసాయ రంగంలో రైతుల ఆదాయం పెంచేందుకు విజయనగరం జిల్లాలో చేపట్టిన “మిషన్ హోప్” గురించి కలెక్టర్ రామ సుందర్ రెడ్డి వివరించారు. వరి, మొక్కజొన్న పంటలపై ఆధారపడుతున్న చిన్న రైతులను ఉద్యాన పంటల వైపు మళ్లించేందుకు 10 వేల ఎకరాల లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్ ప్రారంభించినట్లు చెప్పారు. విద్యుత్ లైన్లకు సమీపంలో ఉన్న పొలాలను మ్యాపింగ్ చేసి ఉచిత విద్యుత్ కనెక్షన్లు అందిస్తున్నామని, బోరు బావులకు రుణాలు మంజూరు చేస్తున్నామని తెలిపారు. ఆయిల్ పామ్ వంటి దీర్ఘకాలిక పంటలతో పాటు అరటి, పత్తి వంటి అంతర పంటలు వేసేలా ప్రోత్సహించి రైతులకు నిరంతర ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. రిలయన్స్ ఫ్రెష్, బిగ్‌బాస్కెట్ వంటి సంస్థలతో మార్కెటింగ్ ఒప్పందాలు కుదుర్చుకోవడం ద్వారా రైతులకు మార్కెట్ సమస్యలు లేకుండా చేశామని వివరించారు. మొదటి దశలోనే 4,822 ఎకరాల్లో ఈ కార్యక్రమం విజయవంతమైందని తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లాల కలెక్టర్లు ప్రదర్శించిన వినూత్న కార్యక్రమాలు ప్రజల జీవితాల్లో మార్పు తీసుకువచ్చేలా ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులు ప్రశంసించారు. ఈ కార్యక్రమాలను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.