
ఏపీ ఐఏఎస్ అధికారి భార్య అనుమానాస్పద మృతి
రాష్ట్రంలో కీలక బాధ్యతల్లో ఉన్న సీనియర్ 2014 బ్యాచ్ ఆంధ్రప్రదేశ్ కేడర్ ఐఏఎస్ అధికారి డా . జి.కె. క్రిస్ట్ కిషోర్ కుమార్ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. ఆయన భార్య సత్య దీపిక (42) విజయవాడలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయారు. గొంతు ఇన్‌ఫెక్షన్, కిడ్నీ సమస్యలతో ఆసుపత్రిలో చేరిన ఆమె కోలుకుంటున్న క్రమంలోనే అకస్మాత్తుగా మృతి చెందడం పలు అనుమానాలకు తావిస్తోంది. మృతురాలి సోదరి ఫిర్యాదు మేరకు పటమట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఘటన నేపథ్యం
ఏపీ మిషన్ ఫర్ క్లీన్ కృష్ణ–గోదావరి కెనాల్ మిషన్ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న జి.కె. క్రిస్ట్ కిషోర్ కుమార్ కుటుంబంతో కలిసి మొగల్రాజపురంలో నివసిస్తున్నారు. సత్య దీపిక గత నెల 24 నుంచి 27 వరకు కిడ్నీ సంబంధిత సమస్యతో సదరు ఆసుపత్రిలోనే చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యారు. అయితే గొంతు ఇన్‌ఫెక్షన్ కావడంతో డిసెంబర్ 31న ఆమె మళ్లీ ఆసుపత్రిలో చేరారు. ఆమె ఆరోగ్యం మెరుగుపడుతోందని వైద్యులు చెబుతున్న క్రమంలోనే శనివారం అర్ధరాత్రి 1.20 గంటల సమయంలో పరిస్థితి విషమించి మృతి చెందినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
మరోవైపు మృతి చెందడానికి కొన్ని గంటల ముందే సత్య దీపిక తన సోదరి పి. సరితతో ఫోన్‌లో మాట్లాడారు. గొంతు నొప్పి వల్ల మాట్లాడటం ఇబ్బందిగా ఉందని, డిశ్చార్జ్ అయ్యాక ఇంటికి వచ్చి మాట్లాడతానని ఆమెకు ధైర్యం చెప్పారు. ఆరోజు రాత్రి హఠాత్తుగా గుండెపోటు రావడం సీపీఆర్ చేసినా ఫలితం లేకపోయిందని వైద్యులు ప్రకటించడం పట్ల కుటుంబ సభ్యులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఆసుపత్రి యాజమాన్యం దీనిని మెడికో-లీగల్ కేసుగా పరిగణించి పోలీసులకు సమాచారం అందించింది. తొలుత అంతా సద్దుమణిగినట్లు కనిపించినా మృతురాలి సోదరి సరిత పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కథ మలుపు తిరిగింది. చికిత్సలో లోపాలు ఉన్నాయా? లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో విచారణ జరపాలని ఆమె కోరారు.
పటమట సీఐ పవన్ కిశోర్ కథనం ప్రకారం.. భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్‌ఎస్) సెక్షన్ 194 కింద కేసు నమోదైంది. మేము ఆసుపత్రి రికార్డులను స్వాధీనం చేసుకున్నాం. మందుల ప్రిస్క్రిప్షన్లు, వైద్యులు అనుసరించిన ప్రోటోకాల్‌ను పూర్తి స్థాయిలో పరిశీలిస్తున్నాం. పోస్టుమార్టం నివేదిక వచ్చాక మృతికి గల స్పష్టమైన కారణాలు తెలుస్తాయి" అని ఆయన పేర్కొన్నారు. మృతురాలికి ఇద్దరు సంతానం.
