
ఏపీ ‘ఏఐ’ ఆధారిత పన్నుల పరిపాలన దేశానికే ఆదర్శం
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత పన్నుల పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ అనుసరిస్తున్న విధానం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని జీఎస్టీ కౌన్సిల్ సెక్రటేరియట్ అధికారులు ప్రశంసించారు. రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ (ఏపీసీటీడీ) చేపడుతున్న వినూత్న సంస్కరణలు దేశంలోని ఇతర రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం అనుసరించదగిన విలువైన నమూనాగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఢిల్లీలోని జీఎస్టీ కౌన్సిల్ సెక్రటేరియట్‌కు చెందిన అదనపు కార్యదర్శి పంకజ్ కుమార్ సింగ్ (ఐడీఏఎస్), సంయుక్త కార్యదర్శి డి.పీ. మిశ్రా (ఐఆర్ఎస్) ఈ నెల 10న ఏపీ వాణిజ్య పన్నుల శాఖను సందర్శించారు. రాష్ట్రంలో రెండు రోజుల పర్యటనలో భాగంగా 11న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర పన్నుల ప్రధాన కమిషనర్ బాబు ఏ. ఐఏఎస్‌తో పాటు శాఖకు చెందిన ఉన్నతాధికారులు జీఎస్టీ కౌన్సిల్ సెక్రటేరియట్ ప్రతినిధి బృందానికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శాఖ అమలు చేస్తున్న ఏఐ ఆధారిత రిటర్నుల పరిశీలన, ఆడిట్, తనిఖీలు, న్యాయ కేసుల నిర్వహణ వంటి కార్యక్రమాలను అధికారులు ప్రత్యక్షంగా పరిశీలించారు.
క్షేత్రస్థాయిలో పరిశీలన
జీఎస్టీ కౌన్సిల్ సెక్రటేరియట్ ప్రతినిధి బృందం విజయవాడ-1 డివిజన్‌ను కూడా సందర్శించింది. అక్కడ ఏఐ ఆధారిత దర్యాప్తు, న్యాయ కేసుల నిర్వహణ ప్రక్రియలను క్షేత్రస్థాయిలో పరిశీలించింది. అనంతరం జీఎస్టీ సువిధ కేంద్రాన్ని సందర్శించి పన్ను చెల్లింపుదారులకు అందుతున్న సేవలను పరిశీలించింది. ఈ సందర్భంగా విజయవాడ డివిజన్లకు చెందిన జాయింట్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, పలువురు పన్ను చెల్లింపుదారులతో ప్రతినిధి బృందం మాట్లాడింది.
దేశవ్యాప్తంగా అనుసరించదగిన నమూనా
పర్యటన ముగింపులో బుధవారం ముఖ్యమంత్రితో సమావేశమైన జీఎస్టీ కౌన్సిల్ సెక్రటేరియట్ అధికారులు ఏఐ ఆధారిత వినూత్న కార్యక్రమాలతో పన్నుల పరిపాలనను బలోపేతం చేయడంతో పాటు రాష్ట్ర ఆదాయాన్ని పెంచేందుకు ఏపీసీటీడీ చేస్తున్న ప్రయత్నాలను అభినందించారు. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ వాణిజ్య పన్నుల శాఖలో కనిపిస్తున్న స్థాయిలో ఏఐ ఆధారిత సాంకేతిక ఆవిష్కరణలు మరెక్కడా కనిపించడం లేదని ప్రశంసించారు. ఏపీ అనుసరిస్తున్న ఏఐ ఆధారిత పన్నుల పరిపాలన విధానం కేంద్ర ప్రభుత్వం, ఇతర రాష్ట్రాలు అనుసరించదగిన విలువైన నమూనాగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఏఐ ఆధారిత పన్నుల పరిపాలనతో వ్యాపార నిర్వహణ మరింత సులభతరం కావడంతో పాటు ప్రక్రియలు వేగవంతమవుతాయని, తద్వారా రాష్ట్రంతో పాటు దేశ ఆదాయాలు కూడా పెరిగేందుకు దోహదపడుతుందని అధికారులు అభిప్రాయపడ్డారు.
జీఎస్టీఎన్ డేటా అనుసంధానంపై సీఎం దృష్టి
రాష్ట్రంలో ఏఐ ఆధారిత పన్నుల పరిపాలనను మరింత విస్తృత స్థాయికి తీసుకెళ్లేందుకు జీఎస్టీఎన్ నుంచి అవసరమైన డేటా, వ్యవస్థల అనుసంధానం (సిస్టమ్ ఇంటిగ్రేషన్)పై ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర అవసరాలను వివరించారు. రాష్ట్రంతో డేటా పంచుకునే విధానంలో కేంద్ర ప్రభుత్వం సహకరించాలని కోరారు. రాష్ట్రాన్ని సందర్శించి విలువైన సూచనలు, అభిప్రాయాలు పంచుకున్నందుకు జీఎస్టీ కౌన్సిల్ సెక్రటేరియట్ అధికారులకు ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. టెలికాం, ఐటీ విప్లవాలతో పాటు రహదారుల అభివృద్ధి నుంచి ప్రస్తుతం ఏఐ ఆధారిత పాలన వరకు సాంకేతికత ఆధారిత పరివర్తనలో ఆంధ్రప్రదేశ్ ఎప్పటికప్పుడు ముందంజలో ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లక్ష్యాలకు అనుగుణంగా ఏఐ ఆధారిత పన్నుల పరిపాలన వ్యవస్థలు పూర్తి సామర్థ్యంతో పనిచేసేలా కేంద్ర ప్రభుత్వం, జీఎస్టీఎన్ నుంచి సహకారం కొనసాగాలని ఆయన కోరారు. అనంతరం రాష్ట్ర ఏఐ ఆధారిత పన్నుల పరిపాలన కార్యక్రమాలపై అధికారుల ఆసక్తికి, వారు అందించిన సూచనలకు గుర్తింపుగా ముఖ్యమంత్రి జీఎస్టీ కౌన్సిల్ సెక్రటేరియట్ అధికారులను సత్కరించి, రాష్ట్ర సంప్రదాయానికి ప్రతీకగా జ్ఞాపికలను అందజేశారు.
