
ఏపీ ఏఐ ఆధారిత జీఎస్టీ పాలనకు జాతీయ స్థాయిలో ప్రశంసలు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్) ఆధారంగా ఆంధ్రప్రదేశ్ వాణిజ్య పన్నుల శాఖ అమలు చేస్తున్న జీఎస్టీ పరిపాలనా విధానానికి జాతీయ స్థాయిలో ప్రశంసలు లభించాయి. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో రెవెన్యూ కార్యదర్శి అధ్యక్షతన జరిగిన 6వ నేషనల్ కో-ఆర్డినేషన్ మీటింగ్ (ఎన్‌సీఎం)లో ఏపీ తన ఏఐ ఆధారిత జీఎస్టీ పరిపాలనా నమూనాను సమగ్రంగా వివరించింది. ‘జీఎస్టీ పన్ను పరిపాలనలో ఏఐ/ఎంఎల్, ఆటోమేషన్ – కేసు ఎంపిక నుంచి న్యాయపరమైన ప్రక్రియ వరకు’ అనే అంశంపై ఏపీ రాష్ట్ర పన్నుల ప్రధాన కమిషనర్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సమావేశానికి జీఎస్టీ కౌన్సిల్ సెక్రటేరియట్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ (సీబీఐసీ), వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వాణిజ్య పన్నుల కమిషనర్లు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.
కేసుల ఎంపికలో ఏఐ ఆధారిత వ్యవస్థ
జీఎస్టీ పరిపాలనలో కేసుల ఎంపిక, కేటాయింపు నుంచి రిటర్నుల పరిశీలన, ఆడిట్, తనిఖీలు, అప్పీళ్లు, హైకోర్టు వరకు వివిధ దశల్లో ఏఐ ఆధారిత వ్యవస్థలను ఏపీ వాణిజ్య పన్నుల శాఖ అమలు చేస్తోంది. నాలుగు రకాల డేటాను అనుసంధానం చేసే వ్యవస్థతో పాటు 19 ఆటోమేటెడ్ అనలిటికల్ రిపోర్టులు, 35 అంశాలతో కూడిన రిస్క్ మ్యాట్రిక్స్ ద్వారా కేసులను ముందుగానే విశ్లేషించి వర్గీకరిస్తున్నట్లు అధికారులు వివరించారు. అధిక విలువ కలిగిన కేసులకు అదనపు పరిశీలన ఉండేలా జాయింట్ కమిషనర్లు, ఆర్‌ఐఎంసీ, సిమ్‌సీ స్థాయిలకు కేసులను కేటాయిస్తున్నట్లు తెలిపారు.
22 వేలకుపైగా తీర్పులతో లీగల్ ఏఐ
జీఎస్టీ చట్టాలు, నిబంధనలతో పాటు సుప్రీంకోర్టు, హైకోర్టులు, ట్రైబ్యునళ్లు, ఫస్ట్ అప్పిలేట్ అథారిటీ ఇచ్చిన సుమారు 22 వేల తీర్పులతో శిక్షణ పొందిన ‘లీగల్ ఏఐ ఆఫీసర్ అసిస్టెంట్’ను కూడా శాఖ అభివృద్ధి చేసింది. ఫస్ట్ అప్పిలేట్ అథారిటీ, జీఎస్టీ అప్పిలేట్ ట్రైబ్యునల్ , హైకోర్టు కేసుల నిర్వహణలో ఈ వ్యవస్థను వినియోగిస్తున్నారు. ఇప్పటివరకు 13,700కు పైగా కేసులను ఏఐ ఆధారిత డ్రాఫ్టింగ్ ప్రక్రియలోకి తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు. అయితే ఏఐ రూపొందించిన ప్రతి ముసాయిదాను సంబంధిత అధికారి పరిశీలించి, ఆమోదించిన తర్వాతే జారీ చేస్తున్నట్లు స్పష్టం చేశారు.
ఆరు నెలల్లో రూ.743.43 కోట్ల పన్ను ఎగవేత గుర్తింపు
రిటర్నుల పరిశీలనలో ఏఐ ఆధారిత వ్యవస్థ ద్వారా సాధించిన ఫలితాలను కూడా సమావేశంలో ఏపీ వివరించింది. ఆరు నెలల ఏఐ ఆధారిత కార్యకలాపాల్లో రూ.743.43 కోట్ల మేర ఆదాయ గుర్తింపు జరిగినట్లు తెలిపింది. ఇదే కాలానికి సరిపోలే పాత మాన్యువల్ విధానంలో రూ.365.75 కోట్ల మేర గుర్తింపు నమోదైనట్లు పేర్కొంది. ఒక్కో కేసుకు సగటున ఏఐ ఆధారిత విధానంలో రూ.27.63 లక్షలు, పాత విధానంలో రూ.3.08 లక్షలు మాత్రమే గుర్తించినట్లు అధికారులు వివరించారు.
‘ఏఐ నిర్ణయించదు.. అధికారులు నిర్ణయిస్తారు’
పన్ను పరిపాలనలో ఏఐని కేవలం సహాయక సాధనంగానే వినియోగిస్తున్నామని ఏపీ స్పష్టం చేసింది. ‘ఏఐ ముసాయిదాలు రూపొందిస్తుంది.. తుది నిర్ణయం అధికారులు తీసుకుంటారు’ అనే విధానంతో వ్యవస్థను రూపొందించినట్లు తెలిపింది. ప్రతి నోటీసు, ఉత్తర్వుపై అధికారి డిజిటల్ సంతకం ఉంటుందని, బీవో కేస్ ఐడీ, ఏఆర్‌ఎన్, డీఐఎన్ ద్వారా పూర్తి ట్రేసబిలిటీ ఉండేలా చర్యలు తీసుకున్నట్లు వివరించింది.
ఏపీ నమూనాపై ఇతర రాష్ట్రాల ఆసక్తి
ఏపీ ప్రజెంటేషన్‌కు సమావేశంలో పాల్గొన్న రాష్ట్రాల నుంచి విశేష స్పందన లభించింది. ఏఐ నిర్మాణం, వర్క్‌ఫ్లో విధానాలను తమ రాష్ట్రాల్లో అమలు చేసేందుకు పలువురు అధికారులు వివరాలు కోరారు. తమిళనాడు, బీహార్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, కేరళ, అసోం, మేఘాలయ రాష్ట్రాలు ఏపీ మోడల్‌ను అధ్యయనం చేసి అమలు చేసే దిశగా ఆసక్తి చూపినట్లు అధికారులు తెలిపారు. ఆయా రాష్ట్రాల బృందాలు ఆంధ్రప్రదేశ్‌కు వచ్చి ఈ విధానాన్ని అధ్యయనం చేయనున్నట్లు వెల్లడించారు. ఏపీ రూపొందించిన ఈ వ్యవస్థను ఇతర రాష్ట్రాలు కూడా ఆదర్శంగా తీసుకోవచ్చని కేంద్ర రెవెన్యూ కార్యదర్శి ప్రశంసించినట్లు అధికారులు తెలిపారు.
మరిన్ని సేవలకు ఏఐ విస్తరణ
భవిష్యత్‌లో తాత్కాలిక రిఫండ్లు, ఆర్‌ఎఫ్‌డీ-04, ఆర్‌ఎఫ్‌డీ-06 ప్రక్రియలు, జీఎస్టీ రిజిస్ట్రేషన్ పర్యవేక్షణ, రిజిస్ట్రేషన్ రద్దు వంటి అంశాలకు ఏఐ రిస్క్ స్కోరింగ్‌ను విస్తరించాలని ఏపీ నిర్ణయించింది. అదేవిధంగా రివిజన్, రివ్యూ పిటిషన్లు, బకాయిలు, రికవరీ చర్యలు, అడ్వాన్స్‌డ్ రూలింగ్స్ వంటి ప్రక్రియలకు కూడా లీగల్ ఏఐ ఆఫీసర్ అసిస్టెంట్‌ను విస్తరించనున్నారు. ఈ వ్యవస్థను మరింత విస్తరించేందుకు జీఎస్టీఎన్ ఏపీఐలతో ప్రత్యక్ష అనుసంధానం, ఇతర ప్రాంతాల్లోని పన్ను చెల్లింపుదారుల సమాచారంపై అవగాహన, పీక్ సమయాల్లో నిరంతర ఏపీఐ యాక్సెస్ వంటి సహకారాన్ని కేంద్ర ప్రభుత్వం, జీఎస్టీఎన్ నుంచి కోరినట్లు అధికారులు తెలిపారు. జాతీయ స్థాయిలో జీఎస్టీ పరిపాలనను మరింత సమర్థవంతంగా మార్చేందుకు తమ ఏఐ ఫ్రేమ్‌వర్క్‌ను ఇతర రాష్ట్రాలతో పంచుకునేందుకు ఏపీ వాణిజ్య పన్నుల శాఖ సిద్ధంగా ఉందని రాష్ట్ర పన్నుల ప్రధాన కమిషనర్ తెలిపారు.
