Let's talk: editor@tmv.in
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు: ఐదో రోజు కీలక పరిణామాలు

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు: ఐదో రోజు కీలక పరిణామాలు

Dantu Vijaya Lakshmi Prasanna
19 ఫిబ్రవరి, 2026

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఐదో రోజు బుధవారం స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభంలో స్పీకర్ మాట్లాడుతూ, అసెంబ్లీలో ఆడియో వ్యవస్థలో తలెత్తిన సాంకేతిక లోపాన్ని ప్రస్తావించారు. దీనిని సరిచేసేందుకు ముంబై నుంచి నిపుణులు వస్తున్నారని, అప్పటివరకు ప్రత్యామ్నాయ ఆడియో వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అనంతరం ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభమైంది.

ప్రశ్నోత్తరాల సమయంలో ప్రభుత్వాసుపత్రుల సామర్థ్యం పెంపుపై ప్రధానంగా చర్చ జరిగింది. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మాట్లాడుతూ, తన తల్లిదండ్రులు శోభానాగిరెడ్డి, భూమా నాగిరెడ్డి ప్రమాదానికి గురైనప్పుడు సరైన వైద్యం అందక, 'గోల్డెన్ అవర్' కోల్పోవడం వల్లే ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆళ్లగడ్డలో 50 పడకల ఆసుపత్రిని 100 పడకలకు పెంచాలని, అక్కడ నిపుణులైన వైద్యులు లేక వేలాది కేసులు కర్నూలుకు రిఫర్ అవుతున్నాయని ఆమె సభ దృష్టికి తెచ్చారు.

అఖిలప్రియ విజ్ఞప్తిపై స్పందించిన వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, ఆసుపత్రుల అప్‌గ్రేడేషన్ కోసం ప్రతిపాదనలు వచ్చాయని తెలిపారు. జాతీయ రహదారులపై ప్రతి 100 కిలోమీటర్లకు ఒక ట్రామా సెంటర్ ఏర్పాటు చేయాలన్న కేంద్ర నిబంధనను ఈ సందర్భంగా మంత్రి ప్రస్తావించారు. దీనిపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు స్పందిస్తూ, హైవేలపై తక్షణ వైద్యం కోసం క్రిటికల్ కేర్ బ్లాక్‌లను ఏర్పాటు చేయాలని సూచించగా, ఆ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని మంత్రి వివరించారు.

మరోవైపు గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తన నియోజకవర్గంలోని ఆరోగ్య సమస్యలను సభలో లేవనెత్తారు. గత ప్రభుత్వ హయాంలో రుద్రపాక ఆరోగ్య కేంద్రం పనులు సగంలోనే నిలిచిపోయాయని, రామాపురం ఆసుపత్రి భవనం శిథిలావస్థకు చేరిందని ఆందోళన వ్యక్తం చేశారు. కవుతవరంలో పీహెచ్‌సీ ఏర్పాటుతో పాటు, గుడివాడలోని 100 పడకల ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

అభివృద్ధి లక్ష్యంగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రసంగం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో ఐదో రోజు బుధవారం తన ప్రసంగంలో ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతి రాష్ట్రంలోని అట్టడుగు వర్గాల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు. ఎస్సీల అభ్యున్నతి కోసం ఫీజు రీయింబర్స్‌మెంట్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్స్‌తో పాటు ఇళ్ల నిర్మాణానికి అదనంగా రూ. 50,000 ఆర్థిక సాయాన్ని ప్రకటించారు.

తాజా బడ్జెట్‌లో సాంఘిక సంక్షేమానికి రూ. 20,644 కోట్లు కేటాయించగా, వసతి గృహాల పునరుద్ధరణకు ప్రత్యేకంగా రూ. 300 కోట్లు కేటాయించారు. అలాగే, ఎస్టీ సంక్షేమానికి రూ. 9,190 కోట్లు కేటాయిస్తూ, గిరిజనుల ఇళ్ల నిర్మాణానికి వారు రూపాయి కూడా అదనంగా ఖర్చు చేయకుండా రూ. 75,000 వరకు అదనపు రాయితీని ఇస్తున్నట్లు పేర్కొన్నారు.

బీసీ, మైనార్టీల సంక్షేమానికి భారీ నిధులు వెనుకబడిన తరగతులే రాష్ట్రానికి వెన్నెముక అని పేర్కొంటూ బీసీ సంక్షేమానికి ఏకంగా రూ. 51,021 కోట్లు భారీ స్థాయిలో కేటాయించారు. మత్స్యకార భరోసా, ఆటో డ్రైవర్ల కోసం 'ఆటో డ్రైవర్ల సేవలో' వంటి పథకాలను కొనసాగిస్తూనే.. చేనేతలకు, సెలూన్లకు ఉచిత విద్యుత్తును అందిస్తున్నట్లు వెల్లడించారు. మైనార్టీల అభివృద్ధి కోసం గత బడ్జెట్ కంటే నిధులను భారీగా పెంచి రూ. 6,090 కోట్లు కేటాయించారు. వక్ఫ్ బోర్డు పునరుద్ధరణతో పాటు ఇమామ్, మౌజంలకు వరుసగా రూ. 10,000, రూ. 5,000 గౌరవ వేతనాలను అందిస్తూ వారి ఆర్థిక భరోసాకు హామీ ఇచ్చారు.

రాయలసీమ గ్లోబల్ హర్టీకల్చర్ హబ్

రాయలసీమ ముఖచిత్రాన్ని మార్చే విధంగా ఈ బడ్జెట్‌లో కీలక ప్రకటన చేశారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాతో సహా రాయలసీమ ప్రాంతాన్ని గ్లోబల్ హర్టీకల్చర్ హబ్ గా మార్చేందుకు రూ. 30,000 కోట్ల భారీ ప్రాజెక్టును ప్రభుత్వం చేపట్టింది. 2030 నాటికి 10 జిల్లాల్లో ఉద్యానవన పంటల విస్తీర్ణాన్ని 14.41 లక్షల హెక్టార్లకు పెంచడం దీని ప్రధాన లక్ష్యం. దీని ద్వారా సీమ ప్రాంత రైతులకు అంతర్జాతీయ మార్కెట్లతో అనుసంధానం ఏర్పడుతుందని, స్థానికంగా సుమారు 9 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

అమరావతికి చట్టబద్ధత

క్వాంటం వ్యాలీ నిర్మాణం ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధ హోదా కల్పించే ప్రక్రియను కూటమి ప్రభుత్వం వేగవంతం చేసిందని పయ్యావుల తెలిపారు. రాజధానిలో రూ.57,868 కోట్ల విలువైన 97 అభివృద్ధి పనులకు పరిపాలనా ఆమోదం మంజూరు చేయబడింది. మరీ ముఖ్యంగా అమరావతిని గ్లోబల్ టెక్నాలజీ హబ్‌గా మార్చే క్రమంలో “అమరావతి క్వాంటమ్ వ్యాలీ” పేరుతో అత్యాధునిక క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. దీనికోసం ఈ బడ్జెట్‌లో అమరావతికి రూ. 6,000 కోట్లు ప్రాథమికంగా కేటాయించారు.

విశాఖ ఎకనమిక్ రీజియన్

గ్రోత్ ఇంజన్ల అభివృద్ధి రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రాంతీయ వ్యూహాన్ని అనుసరిస్తోంది. విశాఖపట్నం, అమరావతి, తిరుపతి ప్రాంతాలను ప్రధాన గ్రోత్ ఇంజన్లుగా గుర్తించింది. ఇందులో భాగంగా విశాఖ ఎకనామిక్ రీజియన్ అభివృద్ధికి రూ. 28,000 కోట్ల భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. ఇందులో విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్ట్, గూగుల్ AI డేటా సెంటర్ వంటి కీలక ప్రాజెక్టులు ఉన్నాయని మంత్రి వివరించారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యంలో భాగంగా రాష్ట్రంలోని ప్రతి ప్రాంతానికి సమాన ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధిని వికేంద్రీకరిస్తున్నట్లు తన ప్రసంగంలో స్పష్టం చేశారు.