Let's talk: editor@tmv.in
ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై సమగ్ర దర్యాప్తు జరపాలి: వైకాపా నేత శైలజానాథ్ డిమాండ్

ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై సమగ్ర దర్యాప్తు జరపాలి: వైకాపా నేత శైలజానాథ్ డిమాండ్

Panthagani Anusha
23 ఫిబ్రవరి, 2026

గత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ శాతం పెరుగుదలపై మరోసారి రాజకీయ దుమారం రేగుతోంది. పోలింగ్ చివరి గంటల్లో ఓట్ల శాతం అనూహ్యంగా పెరగడం వెనుక ఉన్న కారణాలపై సమగ్ర దర్యాప్తు జరపాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఎస్. శైలజానాథ్ డిమాండ్ చేశారు. శనివారం ఆయన పార్టీ తరపున ఒక ప్రకటన విడుదల చేస్తూ.. ఎన్నికల సంఘం (ఈసీ) ఈ అంశంపై స్పష్టమైన వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ఉందని పేర్కొన్నారు.

అర్థరాత్రి అదనపు ఓట్లు ఎలా?

మే 13న జరిగిన పోలింగ్ ప్రక్రియలో చోటుచేసుకున్న పరిణామాలను శైలజానాథ్ ఈ సందర్భంగా ప్రశ్నించారు. తొలుత పోలింగ్ శాతం సుమారు 68 శాతంగా ఉంటుందని అంచనా వేయగా అర్థరాత్రి 11:45 గంటల నుండి తెల్లవారుజామున 2 గంటల మధ్య కాలంలో దాదాపు 50 లక్షల అదనపు ఓట్లు ఎలా నమోదయ్యాయని ఆయన విస్మయం వ్యక్తం చేశారు. దీనివల్లే తుది పోలింగ్ శాతం 81.85కు చేరుకుందని ఈ భారీ వ్యత్యాసం అనేక అనుమానాలకు తావిస్తోందని విమర్శించారు. సాయంత్రం 5 గంటల సమయానికి క్యూలైన్లలో ఉన్న వారికే ఓటు వేసే అవకాశం ఉన్నప్పటికీ పరిమితికి మించి ఓట్లు పోల్ అవ్వడంపై విచారణ జరిపించాలని కోరారు.

ఇదిలా ఉండగా వైకాపా ఆరోపణలను తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండించింది. టీడీపీ నేత ఎన్. విజయ్ ఈ విమర్శలపై స్పందిస్తూ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత వైకాపా నేతలు అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. 2019 ఎన్నికల సమయంలోనూ ఇలాగే పోలింగ్ శాతం క్రమంగా పెరిగిందని చివరి గంటల్లో రద్దీ వల్ల శాతం పెరగడం సహజమేనని ఆయన స్పష్టం చేశారు. మేము అధికారంలో లేని సమయంలో అక్రమాలు జరిగాయని చెప్పడం హాస్యాస్పదం. మీకు ఏవైనా సందేహాలు ఉంటే నేరుగా ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించాలి కానీ ఇలా బురద చల్లడం సరికాదు అని హితవు పలికారు.

కొనసాగుతున్న రాజకీయ పోరు

గతంలో 2024 జూలైలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సైతం పోలింగ్ ప్రక్రియపై అనుమానాలు వ్యక్తం చేసిన విషయాన్ని విజయ్ గుర్తుచేశారు. అటు అధికార కూటమి ఇటు ప్రతిపక్ష వైకాపా మధ్య పోలింగ్ శాతంపై సాగుతున్న ఈ మాటల యుద్ధం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.