Let's talk: editor@tmv.in
ఏపీ అభివృద్ధికి చేయూతనివ్వండి: మంత్రి పయ్యావుల కేశవ్

ఏపీ అభివృద్ధికి చేయూతనివ్వండి: మంత్రి పయ్యావుల కేశవ్

Panthagani Anusha
13 జనవరి, 2026

రానున్న 2026-27 కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పెద్దపీట వేయాలని విభజన అనంతర సవాళ్లను అధిగమించేందుకు రాష్ట్రాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన రాష్ట్రాల ఆర్థిక మంత్రుల ముందస్తు బడ్జెట్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీ ఆర్థిక పరిస్థితిని వివరిస్తూ, రాష్ట్ర పునర్నిర్మాణానికి అవసరమైన కీలక ప్రాజెక్టులపై కేంద్రానికి సమగ్ర వినతిపత్రం సమర్పించారు.

రాష్ట్రానికి శాశ్వత రాజధానిగా అమరావతి నిర్మాణం అత్యంత కీలకమని స్పష్టం చేసిన పయ్యావుల గతంలో కేంద్రం మంజూరు చేసిన రూ. 15,000 కోట్లకు అదనంగా రెండో విడత గ్రాంట్లు కేటాయించాలని కోరారు. రాజధాని నగరంలో మౌలిక వసతుల నిర్మాణం వేగంగా పూర్తి కావాలంటే కేంద్రం నుంచి భారీగా నిధులు అందాల్సిన అవసరం ఉందన్నారు. అదేవిధంగా ఉత్తరాది రాష్ట్రాల్లో నదుల అనుసంధానానికి కేంద్రం కేటాయించిన భారీ నిధుల తరహాలోనే రాష్ట్రంలోని పోలవరం,నల్లమలసాగర్ ప్రాజెక్టుకు కూడా ప్రత్యేక ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. దీనివల్ల రాష్ట్రంలో సాగు, తాగునీటి కష్టాలు తీరడమే కాకుండా వ్యవసాయ రంగం గణనీయంగా వృద్ధి చెందుతుందని వివరించారు.

రాయలసీమ ప్రాంత అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరుతూ విభజన చట్టం ప్రకారం మూడు సంవత్సరాల కాలానికి రూ. 41,000 కోట్లతో ప్రత్యేక ప్యాకేజీ మంజూరు చేయాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ఈ నిధులతో రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్ది, రైతుల ఆదాయాన్ని పెంచేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. మరోవైపు విశాఖ ఆర్థిక ప్రాంత అభివృద్ధికి రూ. 5,000 కోట్లు కేటాయించాలని కోరుతూ 2032 నాటికి విశాఖ జీడీపీని ప్రస్తుతం ఉన్న 52 బిలియన్ల నుంచి 125 బిలియన్లకు పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు.

16వ ఆర్థిక సంఘం సిఫార్సులు అమలులోకి రానున్న తరుణంలో, కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటాను పెంచాలని, అదేవిదంగా మూలధన పెట్టుబడుల కోసం రాష్ట్రాలకు ఇచ్చే ప్రత్యేక సహాయ పథకం నిధులను పెంచాలని పయ్యావుల కేశవ్ విజ్ఞప్తి చేశారు. కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'పూర్వోదయ' పథకంలో రాష్ట్రాల అవసరాలకు అనుగుణంగా మార్పులు చేసుకునే వెసులుబాటు కల్పించాలని సూచించారు. ఏపీ ప్రయోజనాల పట్ల కేంద్రం సానుకూల నిర్ణయాలు తీసుకుంటుందనే ఆశాభావంతో ఉన్నట్లు మంత్రి ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు.