
ఏపీలో 54 లక్షల చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు
రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమాన్ని అత్యంత విజయవంతంగా ప్రభుత్వం నిర్వహించింది. ఐదేళ్లలోపు వయస్సు గల దాదాపు 54 లక్షల మందికి పైగా చిన్నారులకు ఆరోగ్య శాఖ సిబ్బంది పోలియో చుక్కలు వేశారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన సుమారు 39 వేల పోలియో బూత్‌ల ద్వారా చిన్నారులకు ఈ ప్రాణ రక్షణ చుక్కలను అందజేశారు.
రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జి.వీరపాండియన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నుంచి సుమారు 99 లక్షల పోలియో వ్యాక్సిన్ డోసులు అందాయని వాటిని అన్ని జిల్లాలకు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. అదేవిధంగా ఈ టీకా కార్యక్రమం సజావుగా అమలయ్యేలా ప్రతి జిల్లాలో నోడల్ అధికారులను నియమించినట్లు తెలిపారు.
పోలియో నేపథ్యం
2014 మార్చినాటికి భారత్ పోలియో రహిత దేశంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైనేషన్( డబ్ల్యూహెచ్ఓ) ఇప్పటికే ప్రకటించింది. అయితే పాకిస్తాన్, ఆఫ్గనిస్తాన్ దేశాల్లో ఇంకా పిల్లలపై వైల్డ్ పోలియో వైరస్ వ్యాప్తి ప్రభావం ఉండొచ్చన్న ఉద్దేశంతో ప్రపంచ వ్యాప్తంగా దీని నిర్మూలనకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఆఫ్గనిస్తాన్ నుంచి ఈ వైరస్ అక్టోబర్,2025లో జర్మనీకి వ్యాప్తి చెందింది. ఇక మన రాష్ట్రం విషయానికొస్తే 2008, జులైలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో చివరి పోలియో కేసు నమోదైంది. భారత్ ను పోలియో రహిత దేశంగా తీర్చిదిద్దేందుకు గాను ఇండియా ఎక్స్‌పెర్ట్ అడ్వయిజరీ గ్రూప్(IEAG) చేసిన సిఫారసుల మేరకు 1995 నుంచి నేషనల్ ఇమ్యునైజేషన్ డే((పల్స్ పోలియో దినం) కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తూ వస్తున్నారు.
సాధారణ టీకా షెడ్యూల్ ప్రకారం చిన్నారులకు ఒరల్ పోలియో వ్యాక్సిన్ ఐదు సార్లు ఇస్తుండగా పల్స్ పోలియో రోజున అదనంగా మరోసారి అందజేస్తారు. ఈ టీకా కార్యక్రమంలో బూత్ స్థాయిలో ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ వర్కర్లు, స్టాఫ్ నర్సులతో కూడిన బృందాలు పాల్గొని పోలియో చుక్కలు వేశారు.
ఆదివారం పోలియో చుక్కలు వేయించుకోని పిల్లల కోసం డిసెంబర్ 22, 23 తేదీల్లో 76 వేలకుపైగా బృందాలు ఇంటింటికి వెళ్లి టీకా కార్యక్రమాన్ని కొనసాగించనున్నారు. అదేవిదంగా పూర్తి కవరేజ్ కోసం బస్‌స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, ఆసుపత్రులు, జాతరలు తదితర ప్రజా ప్రదేశాల్లో మొబైల్, ట్రాన్సిట్ బృందాలను ఏర్పాటు చేశారు.
