Let's talk: editor@tmv.in
ఏపీలో 28 జిల్లాల మ్యాప్ ఫేక్: విపత్తు నిర్వహణ సంస్థ

ఏపీలో 28 జిల్లాల మ్యాప్ ఫేక్: విపత్తు నిర్వహణ సంస్థ

Panthagani Anusha
7 ఏప్రిల్, 2026

ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల సంఖ్య 28కి పెరిగిందంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తలపై రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) తీవ్రంగా స్పందించింది. తమ సంస్థ పేరుతో, లోగోతో విడుదలైన ఆ మ్యాప్ పూర్తిగా నకిలీదని, దానికి ఎలాంటి అధికారిక గుర్తింపు లేదని స్పష్టం చేసింది. ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఎవరో కావాలనే ఈ తప్పుడు ప్రచారానికి తెరలేపారని అధికారులు వెల్లడించారు.

మార్కాపురం, పోలవరం పేర్లతో గందరగోళం

గత కొద్దిరోజులుగా వాట్సాప్, ఫేస్‌బుక్ తదితర సామాజిక మాధ్యమాల్లో ఏపీ కొత్త మ్యాప్ అంటూ ఒక చిత్రం వైరల్ అవుతోంది. అందులో మార్కాపురం, పోలవరం వంటి ప్రాంతాలను కొత్త జిల్లాలుగా చూపుతూ మొత్తం జిల్లాల సంఖ్య 28కి చేరినట్లు పేర్కొన్నారు. పైగా ఈ మ్యాప్‌పై ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ లోగో ఉండటంతో ఇది నిజమేనని చాలామంది నమ్మారు. దీనిపై విచారించిన అధికారులు, అసలు తమ సంస్థ జిల్లాల పునర్విభజన మ్యాప్‌లను రూపొందించదని అదంతా కొందరి పనిగట్టుకున్న కుట్ర అని స్పష్టం చేశారు.

ప్రభుత్వ నిర్ణయమే ఫైనల్

జిల్లాల పెంపు లేదా భౌగోళిక మార్పుల వంటి కీలక అంశాలు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని వ్యవహారాలని ఏపీఎస్డీఎంఏ పేర్కొంది. జిల్లాల పునర్విభజనపై ప్రభుత్వం అధికారిక గెజిట్ విడుదల చేస్తుంది. అంతేకానీ మా సంస్థకు అటువంటి అధికారం గానీ పాత్ర గానీ ఉండదు. మా లోగోను అక్రమంగా ఉపయోగించి తప్పుడు మ్యాప్‌ను సృష్టించారు అని సంస్థ స్పష్టం చేసింది. ఇటువంటి తప్పుడు సమాచారాన్ని ప్రజలు నమ్మవద్దని ఇతరులకు షేర్ చేయవద్దని విజ్ఞప్తి చేసింది.

నిజనిర్ధారణ ముఖ్యం

ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు కొన్ని అసాంఘిక శక్తులు ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నాయని మీడియా సంస్థలు కూడా ధృవీకరించని సమాచారాన్ని ప్రసారం చేయకూడదని సూచించింది. ఏదైనా ముఖ్యమైన సమాచారం కోసం ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్లు లేదా గెజిట్ నోటిఫికేషన్లను మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలని అధికారులు కోరారు. తప్పుడు వార్తలు వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని హెచ్చరించారు.