
ఏపీలో 26 పరిశ్రమలకు ఎస్ఐపీబీ ఆమోదం
రాష్ట్రంలో పరిశ్రమల పెట్టుబడులను మరింత వేగవంతం చేస్తూ క్లస్టర్ వారీగా పారిశ్రామికాభివృద్ధికి మరింత ఊతం ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. శుక్రవారం అమరావతి సచివాలయంలో ఆయన అధ్యక్షతన జరిగిన 12వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎస్ఐపీబీ ) సమావేశంలో 26 పరిశ్రమల పెట్టుబడులకు ఆమోదం లభించింది. ఈ పెట్టుబడుల మొత్తం విలువ రూ. 1,01,899 కోట్లు కాగా వీటి ద్వారా 85,870 ఉద్యోగాలు సృష్టించనున్నట్టు వెల్లడించారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గత 16 నెలల వ్యవధిలో జరిగిన 12 ఎస్ఐపీబీ సమావేశాల ద్వారా మొత్తం రూ. 8,08,899 కోట్ల పెట్టుబడులు, 7,05,870 ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్ లభించినట్లు అధికారులు వివరించారు. సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పెట్టుబడులు పెట్టడానికి వచ్చే సంస్థల ప్రతిపాదనలను త్వరితగతిన పరిశీలించి, కార్యరూపం దాల్చేలా అధికార ప్రతినిధులు చర్యలు తీసుకోవాలన్నారు. పరిశ్రమల స్థాపనకు అవసరమైన భూసౌకర్యం, విద్యుత్ లభ్యత వంటి అంశాల్లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని సూచించారు.
గత ప్రభుత్వ కాలంలో భూములు కేటాయించినా, పనులు ప్రారంభం కాని ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించాలని, పురోగతి లేని ప్రాజెక్టుల అనుమతులను రద్దు చేయడానికి వెనుకాడకూడదన్నారు. రాష్ట్రంలో 15 ఇండస్ట్రియల్ జోన్లను ఏర్పాటు చేసి, క్లస్టర్ ఆధారిత అభివృద్ధిని చేపట్టాలని సూచించారు.
ఎలక్ట్రానిక్స్ రంగం భవిష్యత్తు చాలా బలంగా ఉన్నందున చిప్, సెమీ కండక్టర్, డ్రోన్ తయారీ వంటి పరిశ్రమలను ప్రోత్సహించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలను సమర్థంగా వినియోగించి, రాష్ట్రం అందించే ప్రోత్సాహకాలు పెట్టుబడులు ఆగిపోకుండా ముందుగానే ఇవ్వాలని తెలిపారు.
మూడు మెగా నగరాలు — మాస్టర్ ప్లాన్ సిద్ధం
రాష్ట్రంలో విశాఖపట్నం, తిరుపతి, అమరావతిని మెగా సిటీలుగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. అనకాపల్లి నుంచి విజయనగరం వరకు విస్తరించిన విశాఖను మెగా సిటీగా తీర్చిదిద్దేందుకు మాస్టర్ ప్లాన్ రూపొందించాలని ఆదేశించారు.
ఈ నగరాలను పర్యాటకం, ఐటీ రంగాలకు అనుకూలంగా తీర్చిదిద్దడంలో సంబంధిత శాఖలు సమన్వయం సాధించాలని సూచించారు. ప్రముఖ బ్రాండ్‌లకు చెందిన హోటళ్ల నిర్మాణం, బీచ్ టూరిజం అభివృద్ధికి చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని మూడు ఆర్థిక కారిడార్లకు ముగ్గురు సీనియర్ ఐ ఏఎస్ అధికారులను నియమించనున్నట్లు ప్రకటించారు.
పెట్టుబడుల సదస్సును ఘనంగా నిర్వహించాలి
ఈ నెల 14, 15 తేదీల్లో విశాఖలో జరగనున్న పెట్టుబడుల సదస్సును ఘనంగా నిర్వహించేందుకు అధికారులు సిద్ధం కావాలన్నారు. ఎస్ఐపీబీ ఆమోదించిన పరిశ్రమల శంకుస్థాపనలను వేగంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. విదేశీ పర్యటనల్లో పలువురు ప్రముఖ కంపెనీల ప్రతినిధులను పెట్టుబడుల సదస్సుకు ఆహ్వానించామని, వారు ఏపీలో పెట్టుబడులపై ఆసక్తి వ్యక్తం చేశారని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ సదస్సు ద్వారా రాష్ట్రానికి భారీ పెట్టుబడులు రానున్నాయని అధికారులు పేర్కొన్నారు.
సమావేశంలో మంత్రులు నారా లోకేశ్, అచ్చెన్నాయుడు, టీ.జీ. భారత్, నారాయణ, గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్, బిసి జనార్ధన రెడ్డి, వాసం శెట్టి సుభాష్, సీఎస్ విజయానంద్ తదితరులు పాల్గొన్నారు.
