Let's talk: editor@tmv.in
ఏపీలో 227 మంది వైద్యుల నియామకం

ఏపీలో 227 మంది వైద్యుల నియామకం

Panthagani Anusha
11 నవంబర్, 2025

రాష్ట్రంలో ప్రభుత్వ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను బలోపేతం చేసే ప్రయత్నంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ద్వితీయ స్థాయి ఆసుపత్రులలో స్పెషలిస్ట్ డాక్టర్ల కొరతను తగ్గించడానికి ఇటీవల పీజీ పూర్తి చేసిన 227 మంది నిపుణులైన వైద్యులను 142 ఆసుపత్రులలో నియమించింది.

ఇన్-సర్వీస్ కోటా కింద నియామకాలు

ప్రభుత్వ ఆసుపత్రుల్లోని స్పెషలిస్ట్‌ల కొరతను ఈ నియామకాలు గణనీయంగా తగ్గిస్తాయని ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ తెలిపారు. ఇన్-సర్వీస్ కోటా కింద పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు పూర్తి చేసిన డాక్టర్లను ఇందులో నియమించడం జరుగుతుందని, సెకండరీ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ కె.వి.ఎన్. చక్రధర్ బాబు, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ పద్మావతి ఈ నియామకాల పంపిణీ వివరాలను మంత్రికి వివరించారు.

కండరీ హెల్త్ డైరెక్టర్ కె.వి.ఎన్. చక్రధర్ బాబు విజయవాడలో ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ కలిసి పోస్టింగ్‌లను ఖరారు చేశారు. ఈ 227 మంది డాక్టర్లను ఒక క్రమబద్ధమైన కౌన్సిలింగ్ ప్రక్రియ ద్వారా వివిధ ఆరోగ్య కేంద్రాలలో వ్యూహాత్మకంగా పంపిణీ చేశారు. ప్రధానంగా 155 మంది స్పెషలిస్ట్ డాక్టర్లు 100 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో (పి హెచసిలు) చేరనున్నారు. ఇది క్షేత్ర స్థాయిలో సేవలను మెరుగుపరచడానికి ఉద్దేశించిన చర్య. అదనంగా, 60 మంది స్పెషలిస్ట్‌లను 33 ఏరియా ఆసుపత్రులకు, 10 మంది డాక్టర్లను 7 జిల్లా ఆసుపత్రులకు, మరియు ఇద్దరు డాక్టర్లను ఎంసీహెచ్ (తల్లి మరియు శిశు సంరక్షణ) కేంద్రాలకు కేటాయించారు.

ఈ 227 మంది పీజీ అర్హత కలిగిన డాక్టర్లు 12 వేర్వేరు సబ్జెక్టులలో ప్రత్యేకత కలిగి ఉన్నారని, వీరిని రాష్ట్రంలోని 142 ద్వితీయ స్థాయి ఆసుపత్రులలో విజయవంతంగా పోస్ట్ చేసినట్లు డైరెక్టర్ చక్రధర్ బాబు ధృవీకరించారు. ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ సంతృప్తి వ్యక్తం చేస్తూ రాష్ట్రంలో మొత్తం 243 ద్వితీయ స్థాయి ఆసుపత్రులలో 142 ఆసుపత్రులకు స్పెషలిస్ట్‌లు నియమించబడ్డారని పేర్కొన్నారు. నియామకాలు అత్యధిక డిమాండ్ ఉన్న వైద్య రంగాలపై దృష్టి సారించాయి. గైనకాలజిస్ట్‌లు (35) జనరల్ మెడిసిన్ స్పెషలిస్ట్‌లు (35) అత్యధిక సంఖ్యలో ఉన్నారు. ఇతర ముఖ్యమైన కేటాయింపులలో జనరల్ సర్జన్లు (30), అనస్థీషియాలజిస్ట్‌లు (26), పిల్లల వైద్యులు (25), ఆర్థోపెడిస్టులు (18), రేడియాలజిస్ట్‌లు (17), కంటి వైద్య నిపుణులు (15) ఈయాన్ టి నిపుణులు (9) ఉన్నారు.

ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 243 ద్వితీయ స్థాయి ఆసుపత్రుల్లో 142 ఆసుపత్రుల్లో ఖాళీలను భర్తీ చేయడం చాలా సంతోషంగా ఉందిఅంటూ ఆరోగ్య శాఖ మంత్రి యాదవ్ తెలిపారు. గూడూరు ఏరియా ఆసుపత్రిలో పిల్లల వైద్యుడు, రేడియాలజిస్టు, చర్మ వ్యాధి నిపుణుడు, పాథాలజిస్టు సహా నలుగురు నిపుణులను నియమించినట్లు సమాచారం. అదేవిధంగా, ఏడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లకు, ఆరు ఏరియా ఆసుపత్రులకు తలా ముగ్గురు నిపుణుల చొప్పున పోస్టులు మంజూరు చేశారు.