
ఏపీలో సాంస్కృతిక పునరుజ్జీవనం: "ఆరెంజ్ ఎకానమీ"తో కళాకారులకు మహర్దశ!
రాష్ట్ర సాంస్కృతిక రంగానికి పునర్వైభవం తీసుకురావడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు మంగళవారం విజయవాడలోని ఘంటసాల ప్రభుత్వ సంగీత కళాశాలలో జరిగిన సమీక్షా సమావేశంలో రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పాల్గొని అధికారులకు కీలక దిశానిర్దేశం చేశారు.
ఆరెంజ్ ఎకానమీతో బ్రాండ్ ఆంధ్రప్రదేశ్
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సాంస్కృతిక, పర్యాటక, ఫిల్మ్ టూరిజం విభాగాలను అనుసంధానిస్తూ రాష్ట్రంలో "ఆరెంజ్ ఎకానమీ"ని అభివృద్ధి చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. "ఆరెంజ్ రెవల్యూషన్" ద్వారా ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్‌ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో జూన్ లేదా జూలై మాసాల్లో ప్రత్యేక వర్క్‌షాప్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. కళలను కేవలం ప్రదర్శనలుగానే కాకుండా, కళాకారులకు ఒక సుస్థిర ఆర్థిక వనరుగా మార్చేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.
కూచిపూడి వైభవానికి పునర్జీవం
రాష్ట్ర వారసత్వ సంపద అయిన కూచిపూడి నృత్యాన్ని అట్టడుగు వర్గాలకు చేరవేసేందుకు గతంలో అమలులో ఉండి, 2019లో నిలిపివేసిన 190 మంది కూచిపూడి నృత్య ఉపాధ్యాయుల పథకాన్ని పునరుద్ధరించే అంశాన్ని పరిశీలిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ పథకం రద్దు వల్ల వేలాది మంది విద్యార్థులు నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేస్తూ, దీని పునరుద్ధరణ ద్వారా కళాకారులకు ఉపాధి కల్పించడంతో పాటు శాస్త్రీయ నృత్య వైభవాన్ని ప్రపంచవ్యాప్తం చేస్తామని భరోసా ఇచ్చారు.
పద్యనాటకానికి ప్రాచుర్యం - శిక్షణ కోర్సులు
తెలుగు వారి విశిష్ట కళ అయిన పద్యనాటకాన్ని కాపాడుకోవడానికి ప్రత్యేక శిక్షణ ఇచ్చేలా ఒక కోర్సును రూపొందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. రాబోయే ఉగాది నుండి వారంలో మూడు రోజుల పాటు అతిథి ఉపాధ్యాయులతో తరగతులు నిర్వహించాలని సూచించారు. అలాగే, రాజమండ్రిలో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా(ఎన్ఎస్డీ) బ్రాంచి ఏర్పాటుకు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ శెఖావత్ సానుకూలత వ్యక్తం చేసినట్లు వెల్లడించారు. అదే విధంగా సౌత్ కల్చర్ జోన్ కి పెండింగ్ ఉన్న రూ. 3 కోట్ల 64 లక్షల ప్రత్యేక గ్రాంట్లు కేటాయించే విషయంపై కూడా ఈ సమావేశంలో చర్చించారు.
పారదర్శక ఉగాది పురస్కారాలు & ఐడి కార్డులు
వచ్చే ఉగాది పురస్కారాల ఎంపికలో ఎటువంటి రాజకీయ సిఫార్సులకు తావులేకుండా, క్షేత్రస్థాయిలో నిజమైన ప్రతిభ ఉన్న కళాకారులను గుర్తించి సత్కరించాలని మంత్రి కరాఖండిగా చెప్పారు. త్వరలోనే నామినేషన్ల పరిశీలన పూర్తి చేసి తుది జాబితా ప్రకటించాలన్నారు. అలాగే, రాష్ట్రంలోని కళాకారులందరికీ అధికారిక ఐడి కార్డ్స్ జారీ చేయాలన్న ప్రతిపాదనకు ఆయన సానుకూలంగా స్పందించారు. కళాకారుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు.
ప్రస్తుతం కర్నూలు, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో ప్రైవేట్ భవనాల్లో కొనసాగుతున్న సంగీత కళాశాలలకు ప్రభుత్వ భవనాలు కేటాయించాలని, ప్రతి జిల్లాకు ఒక మ్యూజిక్ కాలేజీ ఉండాలని మంత్రి చర్చించారు. గిరిజన సంస్కృతిని ప్రతిబింబించేలా ప్రత్యేకంగా 'గిరిజన ఉత్సవ్' నిర్వహించాలని ఆదేశించారు. కోనసీమ ప్రభల తీర్థానికి అధికారిక గుర్తింపు దక్కడంపై హర్షం వ్యక్తం చేస్తూ, వచ్చే ఏడాది మరింత వైభవంగా నిర్వహించాలని నిర్ణయించారు.
భవిష్యత్ ప్రణాళికలు - పుష్కరాల సన్నాహాలు
రాబోయే గోదావరి, కృష్ణా పుష్కరాల్లో సాంస్కృతిక శాఖ కీలక పాత్ర పోషిస్తుందని, దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లతో చర్చించనున్నట్లు మంత్రి తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన సాంస్కృతిక రంగానికి పునర్జీవం పోస్తామని పేర్కొన్నారు. సమావేశం అనంతరం ఆయన ఘంటసాల కళాశాల తరగతి గదులను సందర్శించి విద్యార్థులతో ముచ్చటించి, బోధనా తీరును అడిగి తెలుసుకున్నారు.
ఈ సమావేశంలో సాంస్కృతిక శాఖ డైరెక్టర్, నాటక అకాడమీ చైర్మన్, సృజనాత్మక, సాంస్కృతిక సమితి చైర్ పర్సన్, జానపద కళల అకాడమీ చైర్మన్, తో పాటు ఇతర శాఖాపరమైన సిబ్బంది పాల్గొన్నారు.
