Let's talk: editor@tmv.in
ఏపీలో రోడ్లపై గుంతలు లేకుండా చేస్తాం: మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి

ఏపీలో రోడ్లపై గుంతలు లేకుండా చేస్తాం: మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి

Panthagani Anusha
10 నవంబర్, 2025

ఆంధ్రప్రదేశ్‌లో రోడ్లపై గుంతలు లేకుండా చేస్తామని, తద్వారా గుంతల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు. కేవలం ఐదు నెలల స్వల్ప కాలంలోనే రూ. 1,081 కోట్ల నిధులతో దెబ్బతిన్న రహదారులకు మరమ్మతులు పూర్తి చేసి, రాష్ట్రాన్ని గుంతల రహితంగా మార్చామని ఆయన ప్రకటించారు.

నగరంలోని ఆర్,బీ ఇ.ఎన్.సి కార్యాలయంలో ఆదివారం జరిగిన రాష్ట్ర రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అయన కార్యక్రమంలో మాట్లాడుతూ రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు కార్పొరేషన్ సభ్యులు పూర్తి సహకారం అందించాలని కోరారు.

గత ప్రభుత్వం రోడ్లను పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వల్ల రాష్ట్రంలో వేల కిలోమీటర్ల రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయని మంత్రి విమర్శించారు. అయితే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రహదారుల అభివృద్ధికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. "ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, గతంలో అధ్వానంగా ఉన్న రాష్ట్ర రహదారులకు నేడు మహర్దశ వచ్చింది," అని ఆయన వ్యాఖ్యానించారు. కాగా ఇప్పటికే రాష్ట్రంలో దాదాపు రూ. 2,500 కోట్ల మేర రహదారుల అభివృద్ధి పనులు చేపట్టామని మంత్రి వివరించారు. అదనంగా మరో రూ. 1,000 కోట్ల నిధులతో చేపట్టనున్న పనులకు టెండర్లు పిలిచామని, అతి త్వరలోనే వాటిని ప్రారంభించనున్నామని తెలిపారు.

పీపీపీ మోడల్‌తో రహదారుల నిర్మాణం

ప్రజలపై ఆర్థిక భారం పడకుండా రహదారులను అభివృద్ధి చేసే అంశాన్ని ప్రభుత్వం చురుకుగా పరిశీలిస్తున్నట్లు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వెల్లడించారు. ఇందుకోసం ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) మోడల్‌ను అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోందన్నారు. రహదారులకు సంబంధించిన అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిత్యం సమీక్షలు నిర్వహిస్తూ, ఎన్.డి.బి, నాబార్డ్ వంటి బ్యాంకుల ద్వారా నిధులను సమీకరించి అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు.

ఏపీఆర్డీసీ చైర్మన్ ప్రగడ నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మొత్తం 16 మంది కార్పొరేషన్ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. నూతనంగా ఎన్నికైన సభ్యులకు మంత్రి అభినందనలు తెలిపి శాలువాతో సన్మానించారు. ఆర్టీసీ సభ్యులపై రోడ్ల బాధ్యత ఉందని, స్థానికంగా వారి పరిధిలో ఉన్న రహదారుల సమస్యలను తన దృష్టికి తీసుకొస్తే పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యులై ప్రభుత్వానికి మంచిపేరు తీసుకురావాలని చైర్మన్ నాగేశ్వరరావు సభ్యులను కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఆర్టీసీ ఎండి ఎల్. శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఏపీలో రోడ్లపై గుంతలు లేకుండా చేస్తాం: మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి - Tholi Paluku