Let's talk: editor@tmv.in
ఏపీలో రూ.2.08 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎస్‌ఐపీబీ ఆమోదం

ఏపీలో రూ.2.08 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎస్‌ఐపీబీ ఆమోదం

Pinjari Chand
13 ఆగస్టు, 2026

ఆంధ్రప్రదేశ్‌లో భారీ పెట్టుబడులకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్‌ఐపీబీ) ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన బుధవారం జరిగిన ఎస్‌ఐపీబీ 20వ సమావేశంలో మొత్తం 25 ప్రాజెక్టులకు రూ.2.08 లక్షల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలో 21,627 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఆమోదం పొందిన పెట్టుబడుల్లో కర్నూలులో అగస్త్య గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్‌ రూ.7,800 కోట్లు, విశాఖపట్నంలో అక్షత్ గ్రీన్‌టెక్ లిమిటెడ్‌ రూ.1,600 కోట్లు, అనకాపల్లి జిల్లాలో రెన్యూ ఏపీ గ్రీన్ డేటా సెంటర్‌ రూ.85,200 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి.

గ్రీన్‌ ఎనర్జీ, రోబోటిక్స్‌పై దృష్టి

గ్రీన్‌ అమ్మోనియా, లిథియం బ్యాటరీలు, రోబోటిక్స్‌ వంటి అభివృద్ధి చెందుతున్న రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఈ రంగాల్లో పరిశ్రమలను ప్రోత్సహించేందుకు అవసరమైన చర్యలను అధ్యయనం చేయాలని సూచించారు. రాష్ట్రంలో ఏర్పాటు కానున్న పారిశ్రామిక ప్రాజెక్టులపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలన్నారు. కొన్ని వర్గాలు పరిశ్రమలను కాలుష్యకారక యూనిట్లుగా చిత్రీకరిస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, దీనివల్ల అభివృద్ధిపై అపోహలు ఏర్పడుతున్నాయని చంద్రబాబు పేర్కొన్నారు.

డేటా సెంటర్లకు 3.5 టీఎంసీల నీరు

ఉత్తరాంధ్రలో ఏర్పాటు కానున్న డేటా సెంటర్లకు కేవలం 3.5 టీఎంసీల నీరు మాత్రమే అవసరమవుతుందని సీఎం తెలిపారు. ఈ ప్రాజెక్టులపై నెలకొన్న అపోహలను అధికారులు తొలగించాలని ఆదేశించారు. పరిశ్రమల అభివృద్ధిని నిరంతరం పర్యవేక్షించాలని, సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న తప్పుడు ప్రచారాలను ఎదుర్కోవాలని సూచించారు. విశాఖపట్నంలోని పరిశ్రమలకు పోలవరం ఎడమ కాలువ నుంచి గ్రావిటీ ద్వారా సమృద్ధిగా నీటిని అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

డిసెంబరులో మూలపేట పోర్టు ప్రారంభం

మూలపేట పోర్టు నిర్మాణాన్ని డిసెంబరు నాటికి పూర్తి చేసి అదే నెలలో ప్రారంభించేలా చర్యలు వేగవంతం చేయాలని చంద్రబాబు ఆదేశించారు. లాజిస్టిక్స్‌, ఆధునిక గిడ్డంగులు, కోల్డ్‌ చైన్‌ ప్రాజెక్టులను అనుసంధానించాలని సూచించారు. రాయలసీమలో పండే ఉద్యాన పంటలను అంతర్జాతీయ మార్కెట్లకు తరలించేందుకు రహదారి, రైల్వే, పోర్టు కనెక్టివిటీని బలోపేతం చేయాలని అన్నారు.

సెప్టెంబరులోగా 37 ఎంఎస్‌ఎంఈ పార్కులు

గత ఏడాది కుదుర్చుకున్న పెట్టుబడి ఒప్పందాలు, ఎస్‌ఐపీబీ ఆమోదించిన ప్రాజెక్టులను వేగంగా అమలు చేయాలని సీఎం ఆదేశించారు. మిగిలిన 37 ఎంఎస్‌ఎంఈ పార్కుల నిర్మాణాన్ని సెప్టెంబరులోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోవాలని సూచించారు. రాష్ట్రంలోని మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పారిశ్రామిక పార్కులు అందుబాటులోకి రావాలన్నారు. ‘వన్‌ ఫ్యామిలీ–వన్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌’ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున అమలు చేయాలని, డిసెంబరు నుంచి పారిశ్రామిక ప్రోత్సాహకాలను ఎస్క్రో ఖాతాల్లో జమ చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పరిశ్రమల ప్రోత్సాహానికి ప్రోత్సాహకాలు అవసరమే అయినప్పటికీ, ప్రభుత్వం వాస్తవంగా ఎంత మేరకు ప్రోత్సాహకాలు ఇవ్వగలదో కూడా అంచనా వేయాలని సీఎం సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ పారిశ్రామిక ప్రాజెక్టులను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందించి, పారిశ్రామికీకరణ ద్వారా ఆయా ప్రాంతాల అభివృద్ధికి దోహదపడేలా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు.

ఏపీలో రూ.2.08 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎస్‌ఐపీబీ ఆమోదం - Tholi Paluku