
ఏపీలో రూ.177 కోట్ల భారీ జీఎస్టీ మోసం.. ఇద్దరి అరెస్ట్
కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ ఎగవేతదారులపై ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ ఇంటెలిజెన్స్ (డీజీజీఐ) అధికారులు అంతర్రాష్ట్ర స్థాయిలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఒక భారీ నకిలీ ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) రాకెట్‌ను ఛేదించారు. అదేవిధంగా ఈ వ్యవహారంలో ప్రధాన సూత్రధారులుగా భావిస్తున్న ఇద్దరిని అరెస్టు చేశారు.
షెల్ కంపెనీలే అడ్డాగా
డీజీజీఐ విశాఖపట్నం జోనల్ యూనిట్ ఆధ్వర్యంలో హైదరాబాద్ కేంద్రంగా ఈ మెరుపు దాడులు జరిగాయి. అయితే ఆధునిక డేటా అనలిటిక్స్ సాఫ్ట్‌వేర్ సహాయంతో ఇతర దర్యాప్తు సంస్థల నుంచి అందిన పక్కా సమాచారంతో అధికారులు రంగంలోకి దిగారు. ఎటువంటి వాస్తవ వస్తువుల సరఫరా లేదా సేవలు లేకుండానే కేవలం నకిలీ ఇన్వాయిసుల ద్వారా భారీగా పన్ను ఎగవేత జరుగుతున్నట్లు దర్యాప్తులో గుర్తించారు. ముఖ్యంగా వివిధ రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న షెల్ కంపెనీల ద్వారా ఈ కార్యకలాపాలు సాగుతున్నట్టు సమాచారం.
కాగా ఈ కేసులో సిద్ధగోనే ప్రభాకర్, రామవత్ నాగరాజు నాయక్‌లను అధికారులు అరెస్ట్ చేశారు. వీరిద్దరూ కలిసి ఏకంగా 66 షెల్ ప్రోప్రైటర్‌షిప్ సంస్థలను సృష్టించారు. కేవలం కాగితాలకే పరిమితమైన ఈ సంస్థల ద్వారా పరస్పరం నకిలీ ఇన్వాయిసులు జారీ చేసుకుంటూ ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన సుమారు రూ. 177 కోట్ల మేర ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను అక్రమంగా కాజేసినట్లు అధికారులు నిర్ధారించారు. వాస్తవ వ్యాపార లావాదేవీలు లేకుండానే నకిలీ ఐటీసీని సృష్టించి ప్రభుత్వానికి భారీ నష్టం కలిగించినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
పరారీలో మరో నిందితుడు
ఈ కేసు సంబంధించి మరో కీలక వ్యక్తి ఆది రెడ్డి అలియాస్ అంజి రెడ్డి ప్రస్తుతం పరారీలో ఉన్నాడని అతడి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. ఈ భారీ స్కామ్ వెనుక ఇంకా ఎవరెవరి హస్తం ఉందనే కోణంలో నిందితుల బ్యాంకు లావాదేవీలను అనుబంధ సంస్థల వివరాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అరెస్టయిన నిందితులను సీజీఎస్‌టీ చట్టం 2017 కింద కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.
