

ఏపీలో రూ.100 కోట్ల పెట్టుబడితో ఫ్లైట్ ట్రైనింగ్ సెంటర్‌కు నాట్స్ ఏరో స్పేస్ ఆసక్తి
ఆంధ్రప్రదేశ్‌లో ఏవియేషన్ రంగ అభివృద్ధికి మరో కీలక అడుగు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఢిల్లీకి చెందిన నాట్స్ ఏరో స్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ముందుకు వచ్చింది. ఈ మేరకు సంస్థ ప్రతినిధి అథిరాజ్ సింగ్ చావ్లా గురువారం సచివాలయంలో పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డిని కలిసి సంస్థ ప్రతిపాదనలను వివరించారు.
సచివాలయంలోని ఆర్&బీ, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ కార్యాలయంలో జరిగిన సమావేశంలో రాష్ట్రంలో ఏవియేషన్ శిక్షణ రంగానికి సంబంధించిన పెట్టుబడులపై విస్తృతంగా చర్చ జరిగింది. పైలట్ శిక్షణకు అవసరమైన అత్యాధునిక మౌలిక సదుపాయాలు, దేశీయ, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా శిక్షణ అందించే సామర్థ్యం తమ సంస్థకు ఉందని ప్రతినిధులు మంత్రికి వివరించారు.
నాట్స్ ఏరో స్పేస్ సంస్థ రాష్ట్రంలోని నాగార్జునసాగర్ విమానాశ్రయం లేదా కర్నూలు విమానాశ్రయం వద్ద ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయడానికి ఆసక్తి వ్యక్తం చేసింది. ఇందుకు సంబంధించి త్వరలో పూర్తి స్థాయి ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు తెలిపింది.
సంస్థ ప్రతినిధుల తెలిపిన వివరాల ప్రకారం, వచ్చే ఐదేళ్లలో సుమారు రూ.100 కోట్ల పెట్టుబడి పెట్టే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును అమలు చేయనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా కలిపి దాదాపు 100 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని వెల్లడించారు.
అలాగే, ప్రారంభ దశలో ఆరు శిక్షణ విమానాలతో కార్యకలాపాలు ప్రారంభించి, ఐదేళ్లలో వాటి సంఖ్యను 20 శిక్షణ విమానాలకు పెంచేలా ఫ్లైట్ ట్రైనింగ్ సెంటర్‌ను విస్తరించే ప్రణాళికను మంత్రికి వివరించారు. దీనివల్ల రాష్ట్రంలోని యువతకు నాణ్యమైన పైలట్ శిక్షణ అందుబాటులోకి రావడంతో పాటు దేశవ్యాప్తంగా ఏవియేషన్ రంగంలో ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో ఏవియేషన్ రంగంలో ఇలాంటి పెట్టుబడులు రావడం శుభపరిణామమని అన్నారు. ఫ్లైట్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటుతో యువతకు అత్యాధునిక నైపుణ్యాలు అందే అవకాశం ఉంటుందని, రాష్ట్రం ఏవియేషన్ శిక్షణ కేంద్రంగా ఎదగడానికి ఇది దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు.
యువతకు ఉపాధి కల్పించడంతో పాటు రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించే ప్రతి ప్రాజెక్టుకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి స్పష్టం చేశారు. సంస్థ పూర్తి స్థాయి ప్రతిపాదనలతో ముందుకు వస్తే అవసరమైన అనుమతులు, మౌలిక సదుపాయాల కల్పన, ప్రభుత్వ సహకారం వంటి అంశాల్లో అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
రాష్ట్రంలో విమానయాన రంగానికి సంబంధించిన మౌలిక సదుపాయాల అభివృద్ధి, నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ఏర్పాటు, పెట్టుబడుల ఆకర్షణ వంటి లక్ష్యాలతో ప్రభుత్వం ముందుకు సాగుతున్న నేపథ్యంలో నాట్స్ ఏరో స్పేస్ సంస్థ ప్రతిపాదనకు ప్రాధాన్యత ఏర్పడింది. ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చితే ఆంధ్రప్రదేశ్‌లో ఏవియేషన్ శిక్షణ రంగానికి కొత్త దిశ లభించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
