
ఏపీలో మూడు కొత్త జిల్లాలకు సీఎం చంద్రబాబుకు ఆమోదం
ఆంధ్రప్రదేశ్ పరిపాలనా పునర్‌వ్యవస్థీకరణలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో మరో మూడు కొత్త జిల్లాల ఏర్పాటు కు మంగళవారం ఆమోదం తెలిపారు. దీంతో రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 26 నుంచి 29కు పెరిగింది. సచివాలయంలో మంత్రివర్గ ఉప సమితి నివేదికపై సమీక్ష నిర్వహించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. కొత్త జిల్లాలుగా మార్కాపురం, మదనపల్లె, పోలవరం జిల్లాలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ప్రత్యేకంగా పోలవరం జిల్లాకు రంపచోడవరం కొత్త ప్రధాన కార్యాలయంగా ఉండనుంది.
అదే విధంగా పరిపాలనా సౌలభ్యం కోసం ప్రభుత్వం ఐదు కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు కూడా ఆమోదం తెలిపింది. అనకాపల్లి జిల్లాలో నక్కపల్లి, ప్రకాశం జిల్లాలో అద్దంకి, కొత్త జిల్లా మదనపల్లె లో పీలేరు, నంద్యాల జిల్లాలో బనగానపల్లె, శ్రీ సత్యసాయి జిల్లాలో మడకశిర రెవెన్యూ డివిజన్లుగా ఆమోదం పొందాయి. అలాగే కర్నూలు జిల్లాలోని ఆదోని మండలాన్ని విభజించి కొత్తగా పెద్దహరివనం మండలాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ జిల్లాల పునర్‌వ్యవస్థీకరణతో ప్రాంతీయ అభివృద్ధి, ప్రజా సేవల అందుబాటు మరింత మెరుగుపడే అవకాశం ఉందని ప్రభుత్వం తెలిపింది.
