Let's talk: editor@tmv.in
ఏపీలో మావోయిస్టుల శకం ముగిసింది: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా

ఏపీలో మావోయిస్టుల శకం ముగిసింది: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా

Panthagani Anusha
31 మార్చి, 2026

ఆంధ్రప్రదేశ్‌లో దశాబ్దాల పాటు సాగిన మావోయిస్టుల సాయుధ పోరాటం ముగింపు దశకు చేరుకుంది. రాష్ట్రంలో వామపక్ష తీవ్రవాదం (ఎల్‌డబ్ల్యూఈ) పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందని ప్రస్తుతం రాష్ట్రంలో మావోయిస్టుల ఉనికి ‘శూన్యం’ అని ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ప్రకటించారు. సోమవారం మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. మావోయిస్టు పార్టీలో అత్యంత కీలక నేత, సెంట్రల్ కమిటీ సభ్యుడు చెల్లూరి నారాయణరావు సహా మొత్తం తొమ్మిది మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు ఆయన ధృవీకరించారు.

2026 మార్చి 31 నాటికి దేశవ్యాప్తంగా మావోయిస్టు ప్రభావాన్ని పూర్తిగా నిర్మూలించాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా రాష్ట్ర పోలీసులు గడిచిన రెండేళ్లుగా నిరంతరాయంగా కృషి చేశారని డీజీపీ తెలిపారు. "గ్రేహౌండ్స్, ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్‌ఐబి), జిల్లా పోలీసు యంత్రాంగం సమన్వయంతో సాగించిన వ్యూహాత్మక ఆపరేషన్ల ఫలితంగా ఈ విజయం సాధ్యమైంది. గత రెండేళ్లలో 18 ఎన్‌కౌంటర్లు, 81 అరెస్టులు, 106 లొంగుబాట్లు నమోదయ్యాయి. మొత్తం 205 ఆపరేషన్లు నిర్వహించి మావోయిస్టు నెట్‌వర్క్‌ను నిర్వీర్యం చేశాం" అని ఆయన పేర్కొన్నారు.

నారాయణరావు లొంగుబాటుతో కోలుకోలేని దెబ్బ

లొంగిపోయిన వారిలో సి. నారాయణరావు అత్యంత కీలకమైన వ్యక్తి. 1990లో మావోయిస్టు ఉద్యమంలో చేరిన ఆయన 36 ఏళ్ల పాటు అజ్ఞాతంలో గడిపారు. ఏరియా కమిటీ సభ్యుడిగా ప్రస్థానం మొదలుపెట్టి, ఏఓబీ (ఆంధ్రా-ఒడిశా బోర్డర్) ప్రత్యేక జోన్ కమిటీ కార్యదర్శిగా అనంతరం సెంట్రల్ కమిటీ సభ్యుడిగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. 2018లో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు హత్య, 2001లో సీఐ గాంధీ హత్య వంటి పలు సంచలనాత్మక కేసుల్లో ఆయన ప్రధాన నిందితుడు. సిద్ధాంతంపై విరక్తి, అనారోగ్య సమస్యలు, పోలీసుల నుంచి ఎదురవుతున్న తీవ్ర ఒత్తిడి కారణంగానే ఆయన ఆయుధాన్ని వీడి సమాజంలో కలవాలని నిర్ణయించుకున్నట్లు పోలీసులు తెలిపారు.

స్వాధీనం చేసుకున్న ఆయుధ సంపత్తి

లొంగిపోయిన వారి నుంచి పోలీసులు భారీగా పేలుడు పదార్థాలు, సమాచార సాధనాలను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో బీజీఎల్ షెల్స్, డెటోనేటర్లు, జెలటిన్ స్టిక్స్, కార్డెక్స్ వైర్లు కమ్యూనికేషన్ కోసం ఉపయోగించే మాన్‌ప్యాక్ సెట్లు ఉన్నాయి. ఈ ఆయుధాల తీవ్రతను బట్టి మావోయిస్టులు ఎంతటి హింసాత్మక చర్యలకు ప్రణాళికలు రచించారో అర్థం చేసుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు.

పునరావాసానికి ప్రాధాన్యత

హింసను వీడి జనజీవన స్రవంతిలోకి వచ్చే మావోయిస్టులకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని డీజీపీ భరోసా ఇచ్చారు. "ప్రజల మద్దతు కోల్పోవడం, ప్రభుత్వ అభివృద్ధి పథకాలు మారుమూల గ్రామాలకు చేరువ కావడంతో మావోయిజం పట్ల యువతకు ఆసక్తి తగ్గింది. లొంగిపోయిన వారికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందించడంతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించి వారు గౌరవప్రదంగా జీవించేలా చర్యలు తీసుకుంటుంది అని ఆయన స్పష్టం చేశారు. కాగా ఛత్తీస్‌గఢ్, ఒడిశా వంటి సరిహద్దు రాష్ట్రాల పోలీసులతో కలిసి సంయుక్త ఆపరేషన్లు నిర్వహిస్తూ మిగిలిన కొద్దిపాటి ప్రభావాన్ని కూడా త్వరలోనే రూపుమాపుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.