Let's talk: editor@tmv.in
ఏపీలో మాజీ ప్రియుడి భార్యకు హెచ్‌ఐవీ ఇంజెక్షన్ ఇచ్చిన మహిళ… నలుగురు అరెస్ట్

ఏపీలో మాజీ ప్రియుడి భార్యకు హెచ్‌ఐవీ ఇంజెక్షన్ ఇచ్చిన మహిళ… నలుగురు అరెస్ట్

Panthagani Anusha
26 జనవరి, 2026

ప్రేమ విఫలమైందన్న కక్ష..తన వాడు అనుకున్న వ్యక్తి మరో మహిళకు సొంతమయ్యాడన్న అసూయ.. ఆ మహిళను జీవితాంతం క్రుంగిపోయేలా చేయాలన్న కిరాతక ఆలోచన కర్నూల్ నగరంలో ఒక భయంకర నేరానికి దారితీసింది. వృత్తిరీత్యా వైద్యురాలైన ఒక మహిళకు పథకం ప్రకారం హెచ్‌ఐవీ వైరస్‌ను ఇంజెక్ట్ చేసిన షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితురాలు బి.బోయ వసుంధరతో పాటు ఆమెకు సహకరించిన నర్సు మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.

పోలీసుల కథనం ప్రకారం.. ఆదోనికి చెందిన వసుంధర (34) కర్నూలుకు చెందిన ఓ డాక్టర్ గతంలో ప్రేమించుకున్నారు. మనస్పర్థల వల్ల వీరిద్దరూ విడిపోగా సదరు డాక్టర్ ఇటీవల మరో మహిళా వైద్యురాలిని వివాహం చేసుకున్నారు. బాధితురాలు ప్రస్తుతం కర్నూలులోని ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. తన మాజీ ప్రియుడి వైవాహిక జీవితాన్ని చిన్నాభిన్నం చేయాలని నిర్ణయించుకున్న వసుంధర అత్యంత ప్రమాదకరమైన ‘వైరస్ దాడి’కి స్కెచ్ వేసింది.

యాక్సిడెంట్ డ్రామా.. ఆపై ఇంజెక్షన్!

ఈ నెల 9వ తేదీన విధి నిర్వహణ ముగించుకుని బాధితురాలు స్కూటర్ పై ఇంటికి వెళ్తుండగా, వినాయక్ ఘాట్ సమీపంలో నిందితులు తమ ద్విచక్ర వాహనంతో ఆమెను కావాలనే ఢీకొట్టారు. కిందపడిన ఆమెకు సాయం చేస్తున్నట్లు నటిస్తూ ఆటో ఎక్కించే క్రమంలో వసుంధర తన వద్ద సిద్ధంగా ఉన్న హెచ్‌ఐవీ రక్తం నింపిన ఇంజెక్షన్‌ను బాధితురాలికి గుచ్చింది. బాధితురాలు తేరుకుని కేకలు వేయడంతో నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు.అయితే ఘటన జరిగిన వెంటనే ఆమెకు మెరుగైన వైద్య చికిత్స అందించడం అందులోను బాధితురాలు వైద్యురాలు కావడం వల్ల ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని పోలీసులు స్పష్టం చేశారు. సాధారణంగా రిఫ్రిజిరేటర్‌లో భద్రపరిచిన రక్త నమూనాల్లో వైరస్ ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉందని వైద్యులు వెల్లడించారు. కాగా శరీరంలోకి ఏదైనా కొత్త వైరస్ ఏదైనా ప్రవేశించిందన్న ఆందోళన మినహా ప్రస్తుతం ఆమెకు ప్రాణాపాయం లేదని డీఎస్పీ స్పష్టం చేశారు.

వైరస్ ఎక్కడి నుంచి వచ్చింది?

కాగా ఈ కేసులో మరో విస్తుపోయే నిజం దర్యాప్తులో తేలింది. ఆదోనిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న కొంగే జ్యోతి (40) ఈ కుట్రలో కీలక పాత్ర పోషించింది. ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల నుంచి 'పరిశోధన' పేరుతో సేకరించిన హెచ్‌ఐవీ రక్తాన్ని జ్యోతి తన ఫ్రిజ్‌లో దాచి ఉంచింది. దాడి సమయంలో అదే రక్తాన్ని నిందితులు వాడారు. జ్యోతితో పాటు ఆమె ఇద్దరు కుమారులు కూడా ఈ నేరంలో భాగస్వాములైనట్లు డీఎస్పీ బాబు ప్రసాద్ వెల్లడించారు.

జనవరి 10న బాధితురాలి భర్త ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు, సీసీ కెమెరాల ఫుటేజీని జల్లెడ పట్టారు. నిందితుల కదలికలను ట్రేస్ చేసి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరిపై భారతీయ న్యాయ సంహిత (బిఎన్ఎస్) కింద వివిధ సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.