
ఏపీలో మరో 158 గ్రామాలకు తొలిసారి రహదారి సౌకర్యం..రూ. 422.10 కోట్లు మంజూరు
రాష్ట్రంలోని మారుమూల గ్రామాలు, ఆవాసాలకు రహదారి సౌకర్యం కల్పించే దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. మరో 158 ఆవాసాలకు తొలిసారిగా రోడ్డు సౌకర్యం కల్పించేందుకు పరిపాలనా అనుమతుల ప్రక్రియ పూర్తయింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రూపొందించిన ప్రణాళికల్లో భాగంగా ఈ పనులు చేపట్టనున్నారు.
ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన (పీఎంజీఎస్ వై) కింద ఈ రహదారి పనులకు రూ.422.10 కోట్ల నిధులు మంజూరయ్యాయని డిప్యూటీ సీఎం కార్యాలయం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. మొత్తం 347 కిలోమీటర్ల మేర 146 రహదారులు, 19 వంతెనలను నిర్మించనున్నారు. నిర్మించిన రహదారుల నిర్వహణ కోసం ఐదేళ్ల కాలానికి అదనంగా రూ.24.47 కోట్ల నిధులు విడుదలయ్యాయి. పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో పనులు చేపట్టనుంది.
అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని గిరిశిఖర గ్రామాలకు ఇప్పటికే ‘అడవితల్లి బాట’ పేరుతో రహదారి సౌకర్యం కల్పించిన ప్రభుత్వం, ఇప్పుడు మైదాన ప్రాంతాల్లో రహదారులు లేని మారుమూల పల్లెలపై దృష్టి సారించింది. ఏఎస్ఆర్, పార్వతీపురం మన్యం, అనంతపురం, శ్రీ సత్యసాయి, కర్నూలు, కడప, తిరుపతి, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం, పల్నాడు, ఎన్టీఆర్, ఏలూరు, పోలవరం, విజయనగరం, శ్రీకాకుళం తదితర జిల్లాల్లో రహదారి సౌకర్యం లేని ఆవాసాలను గుర్తించి అంచనాలు రూపొందించారు.
నాణ్యతలో రాజీ పడొద్దు: పవన్ కళ్యాణ్ ఆదేశాలు
ఈ సందర్భంగా అధికారులకు దిశానిర్దేశం చేస్తూ.. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సహకారంతో 158 ఆవాసాలకు తొలిసారి రహదారి సౌకర్యం కల్పించడం సంతోషకరమన్నారు. రోడ్ల నిర్మాణంలో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, మనం వేసే రహదారులు పదికాలాల పాటు ప్రజలకు ఉపయోగపడాలని స్పష్టం చేశారు. రహదారి సౌకర్యంతో రవాణా సుగమమై, గ్రామీణ ప్రజలకు మెరుగైన విద్య, వైద్యం, మార్కెటింగ్ అవకాశాలు అందుబాటులోకి వస్తాయని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
