Let's talk: editor@tmv.in
ఏపీలో మరో రెండు రోజులు దిత్వా తుపాను:వాతావరణ శాఖ హెచ్చరిక

ఏపీలో మరో రెండు రోజులు దిత్వా తుపాను:వాతావరణ శాఖ హెచ్చరిక

Pinjari Chand
1 డిసెంబర్, 2025

బంగాళాఖాతంలో ఆగ్నేయ దిశగా ఉన్న దిత్వా తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు తీవ్రమయ్యే అవకాశమున్నట్టు భారత వాతావరణశాఖ (ఐఎండీ) ఆదివారం తెలిపింది. గత ఆరు గంటల్లో తుపాను దాదాపు ఉత్తర దిశగా కదలి, 11.4 డిగ్రీలు ఉత్తర అక్షాంశం, 80.6 డిగ్రీలు తూర్పు రేఖాంశం వద్ద, ఉత్తర తమిళనాడు–పుదుచ్చేరి తీరానికి సమీపంలో కేంద్రీకృతమై ఉంది. తుపాను తమిళనాడు–పుదుచ్చేరి తీరానికి ఆనుకొని 30 నుండి 70 కిలోమీటర్ల దూరంలో కదులుతూ, ఆంధ్రప్రదేశ్‌లో వర్ష ప్రభావాన్ని మరింత పెంచనుంది.

రాబోయే రెండు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. పిడుగులు పడే అవకాశం ఉందని అవసరముంటేనే బయటకు రావాలని సూచించారు.

హోంమంత్రి అనిత సమీక్ష

దిత్వా తుపాను ప్రభావం నేపథ్యంలో రాష్ట్ర హోంమంత్రి అనిత సచివాలయంలోని ఆర్టీజీఎస్ స్టేట్ సెంటర్ నుండి పరిస్థితులను సమీక్షించారు. నెల్లూరు, తిరుపతి, కడప, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల కలెక్టర్లతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమీక్షలో ఆర్టీజీఎస్ సెక్రటరీ కాటమనేని భాస్కర్, సీఈఓ ప్రఖర్ జైన్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ ఈరోజు, రేపు అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. క్షేత్రస్థాయి అధికారులతో సమన్వయం చేసి ప్రజలకు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేసి అప్రమత్తం చేయాలని సూచించారు.

ప్రాణనష్టం జరగకుండా చూడటం అందరి బాధ్యత అని అనిత స్పష్టం చేశారు. సహాయం కోసం కంట్రోల్‌రూమ్‌కు వచ్చే ప్రతి కాల్‌కు వెంటనే స్పందించాలన్నారు. ప్రమాద ప్రాంతాల్లో అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులను తరలించి పర్యవేక్షణ బలోపేతం చేయాలని ఆదేశించారు. తుపాను కారణంగా రోడ్లపై పడిన చెట్టు కొమ్మలు, హోర్డింగ్స్ వంటి అడ్డంకులను వెంటనే తొలగించే చర్యలు చేపట్టాలని తెలిపారు. విద్యుత్ అంతరాయం చోటుచేసుకుంటే అత్యవసరంగా పునరుద్ధరణ పనులు ప్రారంభించాల్సిందిగా సూచించారు. జిల్లా కలెక్టర్లు ఇప్పటికే అవసరమైన ముందస్తు చర్యలు పూర్తి చేసినట్లు హోంమంత్రికి నివేదించారు. అవసరం వస్తే ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయని వివరించారు.

విద్యుత్ శాఖ సమన్వయం

విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫీల్డ్ సిబ్బంది 24 గంటలు సిద్ధంగా ఉండాలని, అత్యవసర విద్యుత్ పునరుద్ధరణ టీమ్‌లు అప్రమత్తమై, గత తుపాన్ల అనుభవంతో ముందస్తు ప్రణాళికలు అమలు చేయాలని సూచించారు.