Let's talk: editor@tmv.in
ఏపీలో భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష

ఏపీలో భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష

Shaik Mohammad Shaffee
24 అక్టోబర్, 2025

బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. రాష్ట్రంలో ఎటు వంటి ప్రాణ, ఆస్తి నష్టం జరుగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు పలువురు మంత్రులు వర్ష ప్రభావిత నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కడప, తిరుపతి జిల్లాల పరిస్థితిపై సంబంధిత జిల్లా కలెక్టర్లు, అధికారులతో సమీక్షలు నిర్వహించి అప్రమత్తం చేశారు.

దుబాయ్ నుంచి సీఎం చంద్రబాబు సమీక్ష

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దుబాయ్ నుంచి అధికారులతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. వర్ష ప్రభావిత నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కడప, తిరుపతి జిల్లాల పరిస్థితిపై సీఎస్, ఆర్టీజీ అధికారుల నుంచి సమాచారం సేకరించి, యంత్రాంగం అప్రమత్తంగా ఉండి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభావిత ప్రాంతాలకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్ బృందాలను పంపించాలని సూచిస్తూ, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా రెవెన్యూ, డిజాస్టర్, పోలీస్, ఇరిగేషన్, మున్సిపల్, ఆర్ అండ్ బి, విద్యుత్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సీఎం సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, కాలువలు, చెరువుల గట్లు బలహీనంగా ఉన్న చోట్ల పటిష్ట పరచాలని ఆదేశించారు. అంతేకాక అంటువ్యాధులు వ్యాపించకుండా వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని కూడా ముఖ్యమంత్రి సూచించారు. నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాలకు రూ.2 కోట్ల చొప్పున, మిగతా వర్ష ప్రబావిత జిల్లాలకు రూ.1 కోటి చొప్పున అత్యవసర నిధులు మంజూరు చేశారు.

హోంమంత్రి వంగలపూడి అనిత సమీక్ష

రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత విజయవాడలో మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైందని తెలిపారు. లోతట్టు ప్రాంతాలు మునిగే అవకాశం ఉండటంతో అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. పట్టణాల్లో డ్రైనేజీలను క్లియర్ చేసి వర్షపు నీరు సకాలంలో వెళ్లేలా చూడాలని, ఇరిగేషన్ అధికారులు కట్టల వెంబడి ఇసుక బస్తాలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. వచ్చే వారం మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నందున మొత్తం యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలన్నారు. పిడుగులతో కూడిన వర్షాలు పడేటప్పుడు రైతులు పంట పొలాల్లో ఉండరాదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు.

మరోవైపు ప్రకాశం జిల్లాలో భారీ వర్షాల పరిస్థితిపై రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా బాల వీరాంజనేయ స్వామి కలెక్టరేట్ నుండి మండల స్థాయి స్పెషల్ ఆఫీసర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్థానిక పరిస్థితులు, సన్నద్ధతపై వివరాలు పరిశీలించి, మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టమైన సూచనలు ఇచ్చారు. జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు వర్ష ప్రభావిత మండలాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించామని, వాగులు పొంగుతున్న ప్రాంతాల్లో పోలీసు, రెవెన్యూ అధికారులతో గస్తీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

నెల్లూరు, బాపట్ల, కర్నూలు, చిత్తూరు, కాకినాడ, వైఎస్ఆర్ కడప, తిరుపతి జిల్లాల కలెక్టర్లు కూడా భారీ వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి, ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వర్షాలు, గాలులు, ఉరుములు, విద్యుత్ ప్రమాదాలు, చెరువులు, కాలువల గండ్ల విషయంలో ప్రజలు ఎంతో అప్రమత్తంగా ఉండాలని తక్షణ సహాయం కోసం వెంటనే సంబంధిత అధికారులను సంప్రదించాలని ప్రజలను కోరారు. భారీ వర్షాల నేపథ్యంలో నెల్లూరు, బాపట్ల, ప్రకాశం, వైఎస్ఆర్ కడప, తిరుపతి జిల్లాల్లో పాఠశాలలు, అంగన్‌వాడీలకు సెలవులు ప్రకటించారు.

ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ విడుదల చేసిన సమాచారం ప్రకారం, బలహీనపడిన తీవ్ర అల్పపీడనం ప్రస్తుతం ఉత్తర తమిళనాడు మరియు దక్షిణ అంతర్గత కర్ణాటక ప్రాంతాల్లో కొనసాగుతోంది. ఇది రాబోయే 24 గంటల్లో దక్షిణ అంతర్గత కర్ణాటక దిశగా కదులుతూ మరింత బలహీనపడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు వర్షాలు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడవచ్చు. తీరం వెంబడి గంటకు 30-50 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, శిథిలావస్థలో ఉన్న భవనాల్లో ఉండకూడదని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు.

ఏపీలో భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష - Tholi Paluku