
ఏపీలో భారీ ఉగ్ర కుట్ర భగ్నం.. ఐసిస్ నెట్‌వర్క్ గుట్టురట్టు
దేశంలో మత విద్వేషాలను రెచ్చగొట్టి, జిహాదీ భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్న ఉగ్రవాద ముఠాను ఆంధ్రప్రదేశ్ పోలీసులు గుర్తించారు. ఈ ముఠాకు విదేశీ హ్యాండ్లర్లతో సంబంధాలు ఉన్నాయని, యువతను తీవ్రవాదులుగా మార్చేందుకు వారు సోషల్ మీడియాను వేదికగా చేసుకున్నారని ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. ఈ నెట్‌వర్క్‌కు ఐసిస్ వంటి అంతర్జాతీయ తీవ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నట్లు అనుమానం వ్యక్తమవుతోంది.
ఈ నెట్‌వర్క్‌తో సంబంధం ఉన్న 12 మంది అనుమానితులను అరెస్ట్ చేసేందుకు ఏపీ పోలీసులు బీహార్, ఢిల్లీ, కర్ణాటక, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, తెలంగాణ, రాజస్థాన్ వంటి ఏడు రాష్ట్రాల్లో ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. వీరిలో ముగ్గురు నిందితులు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు కావడం గమనార్హం.
ఈ కేసులో ప్రధాన నిందితుడు రహమతుల్లా షరీఫ్ అతని అనుచరులు ఆన్‌లైన్ వీడియోల ద్వారా జిహాదీ ప్రచారాన్ని సాగిస్తున్నారు. వీరు కేవలం పురుషులకే కాకుండా, మహిళల కోసం ప్రత్యేకంగా ఖవాతీన్ అనే విభాగాన్ని ఏర్పాటు చేసి నెట్‌వర్క్‌ను విస్తరించాలని ప్లాన్ చేశారు. ఒసామా బిన్ లాడెన్, జాకీర్ నాయక్ వంటి వారి ప్రసంగాల వీడియోలను ప్రచారం చేస్తూ ముస్లిం యువతను తీవ్రవాదం వైపు ప్రేరేపిస్తున్నారు. ఈ మాడ్యూల్ సభ్యులు పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, సిరియా, బంగ్లాదేశ్ వంటి దేశాల్లో ఉన్న హ్యాండ్లర్లతో 40కు పైగా సోషల్ మీడియా ఖాతాల ద్వారా సంబంధాలు కొనసాగించారని అధికారులు తెలిపారు.
ఈ హ్యాండ్లర్లు అల్-హకీమ్ షుకూర్, మహమ్మద్ హుజైఫా, నింజా వంటి పేర్లతో పిలువబడే హ్యాండ్లర్లు వీరికి గైడెన్స్ ఇస్తున్నారు. స్నిపర్ రైఫిళ్లు, ఇతర మారణాయుధాల వాడకంపై వీరికి శిక్షణ ఇస్తామని, ఆయుధాలు సరఫరా చేస్తామని హ్యాండ్లర్లు హామీ ఇచ్చినట్లు అనుమానం ఉంది.. భారతదేశంలో 'ఖిలాఫత్' (ఇస్లామిక్ స్టేట్) స్థాపన లక్ష్యాలపై దారితీసే విధంగా మార్గనిర్దేశం చేసినట్లు సమాచారం.
కొంతమంది ఇప్పటికే విదేశాల్లోని మదర్సాల పేరుతో తీవ్రవాద శిక్షణ పొందుతున్నారని, మరికొంత మందిని ఈ నెట్‌వర్క్‌లో చేర్చే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు. ఈ కేసులో నిందితుల్లో ఒకరైన సయ్యదా బేగం అనే మహిళ పాకిస్తాన్, జమ్మూ కాశ్మీర్ ప్రాంతాల ఉగ్రవాద వ్యక్తులతో సంబంధాలు కొనసాగిస్తూ కార్యకలాపాలను సమన్వయం చేయాలని యత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇక సైబర్ ఉగ్రవాదంపై కూడా ఈ గ్రూప్ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ వెబ్‌సైట్లను హ్యాక్ చేయడం వంటి కార్యకలాపాలపై చర్చలు జరిపినట్లు పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం నిందితుల విదేశీ నిధుల మూలాలపై దర్యాప్తు సంస్థలు ఆరా తీస్తున్నాయి.
ఈ ముఠా సభ్యులు ముఖాలకు మాస్కులు ధరించి, ఐసిస్ జెండాలతో ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ లతో ప్రచారం చేసినట్లు గుర్తించారు. అంతేకాకుండా, భారత జాతీయ గీతాన్ని అసభ్య పదజాలంతో అపహాస్యం చేయడం, జాతీయ జెండాను తగులబెట్టే వీడియోలను పంచుకోవడం వంటి చర్యలకు పాల్పడ్డారు. దేశ వ్యతిరేక భావజాలాన్ని ప్రోత్సహించినట్లు ఆరోపిస్తున్నారు. అదేవిధంగా, పేలుడు పదార్థాల తయారీ, ఐఈడీలు తయారీకి సంబంధించిన సమాచారం పంచుకోవడం, ఆయుధాలను విదేశాల నుంచి సమకూర్చుకుంటామని చెప్పడం వంటి విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఈ మొత్తం వ్యవహారంపై పోలీసులు, కేంద్ర దర్యాప్తు సంస్థలు లోతైన విచారణ కొనసాగిస్తున్నాయి.
