
ఏపీలో బిట్స్ పిలానీ భారీ పెట్టుబడి…రూ.1,000 కోట్లతో అమరావతిలో ఏఐ ప్లస్ క్యాంపస్
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మరో అంతర్జాతీయ స్థాయి విద్యా సంస్థకు వేదిక కానుంది. దేశంలోనే అత్యున్నత విద్యా ప్రమాణాలకు మారుపేరుగా నిలిచిన బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్) పిలానీ అమరావతిలో తన నూతన 'ఏఐ ప్లస్' క్యాంపస్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. రాబోయే ఐదేళ్ల కాలంలో సుమారు రూ.1,000 కోట్ల భారీ పెట్టుబడితో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌తో బిట్స్ ప్రతినిధులు భేటీ అయ్యారు. ప్రతిపాదిత క్యాంపస్ నిర్మాణ ప్రణాళికలు, మౌలిక సదుపాయాల కల్పనపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు.
అమరావతిలో నిర్మించనున్న ఈ ప్రతిష్టాత్మక క్యాంపస్‌ను రెండు దశల్లో పూర్తి చేయాలని బిట్స్ యాజమాన్యం నిర్ణయించింది. సుమారు 7,000 మంది విద్యార్థులకు అత్యాధునిక సాంకేతిక విద్యను అందించే సామర్థ్యంతో ఈ కేంద్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. ఐదేళ్లలో పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్న ఈ క్యాంపస్ కోసం ఇప్పటికే నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని ప్రతినిధులు వెల్లడించారు. నవ్యాంధ్రలో విద్యా రంగానికి ఈ ప్రాజెక్టు ఒక మైలురాయిగా నిలుస్తుందని స్థానిక యువతకు అంతర్జాతీయ స్థాయి అవకాశాలు లభిస్తాయని మంత్రి లోకేష్ ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు.
కాగా ఈ క్యాంపస్ ప్రత్యేకత ఏమిటంటే ఇది దేశంలోనే మొట్టమొదటి ప్రత్యేక 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్' (ఏఐ) క్యాంపస్‌గా అవతరించనుంది. కేవలం సంప్రదాయ కోర్సులకే పరిమితం కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, రోబోటిక్స్, కంప్యూటేషనల్ లింగ్విస్టిక్స్, సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ వంటి భవిష్యత్తు తరానికి అవసరమైన విభాగాల్లో ఇక్కడ శిక్షణ ఇవ్వనున్నారు. కేవలం ఐటీ రంగమే కాకుండా వ్యవసాయం, వాతావరణ మార్పులు, ఆరోగ్య సంరక్షణ వంటి కీలక రంగాల్లో సాంకేతికతను ఏ విధంగా అన్వయించాలో నేర్పేలా ప్రత్యేక పాఠ్యప్రణాళికను రూపొందిస్తున్నట్లు బిట్స్ బృందం వివరించింది.
పర్యావరణ హితానికి పెద్దపీట వేస్తూ 'నెక్స్ట్ జనరేషన్' టెక్నాలజీతో ఈ క్యాంపస్‌ను నిర్మిస్తున్నారు. గ్రీన్ బిల్డింగ్స్, పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగం వంటి అత్యాధునిక విధానాలను ఇక్కడ అమలు చేయనున్నారు. భవిష్యత్తు అంతా కృత్రిమ మేధస్సుదే కావడంతో అమరావతి వేదికగా బిట్స్ పిలానీ చేపడుతున్న ఈ ప్రయత్నం రాష్ట్ర పారిశ్రామిక, విద్యా ముఖచిత్రాన్ని మార్చేస్తుందని నిపుణులు భావిస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్టు సకాలంలో పూర్తయ్యేలా ప్రభుత్వం తరఫున అన్ని రకాల అనుమతులు సహకారాన్ని త్వరితగతిన అందించాలని మంత్రి లోకేష్ అధికారులను ఆదేశించారు.
