
ఏపీలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం.. హాజరైన వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి ప్రస్థానంలో నేడు ఒక కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. 2026-27 బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ చేసిన ప్రసంగం రాష్ట్ర భవిష్యత్తుకు ఒక రోడ్ మ్యాప్‌ను గీసింది. అంతకుముందు బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసన సభకు వచ్చిన గవర్నర్ అబ్దుల్ నజీర్‌కి స్పీకర్ అయ్యన్నపాత్రుడు, మండలి ఛైర్మన్ మోషేన్ రాజు, సీఎం చంద్రబాబు నాయుడు, ఆర్థిక శాఖా మంత్రి పయ్యావుల కేశవ్ స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తూ, భారతదేశం వందవ స్వాతంత్ర దినోత్సవం జరుపుకునే నాటికి (2047), ఆంధ్రప్రదేశ్‌ను రూ. 308 లక్షల కోట్ల (3.4 ట్రిలియన్ డాలర్లు ) ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యమని గవర్నర్ ప్రకటించారు. అప్పటికి రాష్ట్ర తలసరి ఆదాయాన్ని రూ. 55 లక్షలకు చేర్చాలని ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉందని తెలిపారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్రమంగా గాడిలో పడుతోందని, 2025-26 అంచనాల ప్రకారం రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి 10.7% వృద్ధి నమోదు చేసి రూ. 17.6 లక్షల కోట్లకు చేరిందని ఆయన పేర్కొన్నారు. తలసరి ఆదాయం రూ. 2.66 లక్షల నుండి రూ. 2.95 లక్షలకు పెరగడం శుభపరిణామమని వివరించారు.
ఈ సందర్భంగా గవర్నర్, రాష్ట్రం అన్ని రంగాల్లోనూ దూసుకుపోతోందని పేర్కొన్నారు. ముఖ్యంగా సేవా రంగం 12.94%, పరిశ్రమలు 9.53%, వ్యవసాయ అనుబంధ రంగాలు 7.83% వృద్ధి సాధించినట్లు వెల్లడించారు. ఐటీ, క్వాంటం కంప్యూటింగ్ వంటి అత్యాధునిక రంగాల్లో రాష్ట్రాన్ని గమ్యస్థానంగా మార్చడమే తమ లక్ష్యమని చెప్పారు.
గత పాలకుల విధ్వంసకర నిర్ణయాల వల్ల కుంటుపడిన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని తిరిగి పట్టాలెక్కించి, రాష్ట్రాన్ని 'స్వర్ణాంధ్ర 2047' దిశగా నడిపించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. గవర్నర్ తన ప్రసంగం ద్వారా ప్రభుత్వ భవిష్యత్ కార్యాచరణను, గత 19 నెలల పాలనా విజయాలను సభ ముందు ఉంచారు.
రాష్ట్ర విభజన సమస్యలు, వారసత్వంగా వచ్చిన ఆర్థిక కష్టాలతో కూటమి పాలన ప్రారంభమైంది. గత ప్రభుత్వం వ్యవస్థలను నిర్వీర్యం చేయడం, 22ఏ దుర్వినియోగం, శాంతిభద్రతల విఘాతం వంటి చర్యలతో అభివృద్ధి ఆగిపోయింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ప్రధాని మోదీ సహకారంతో కూటమి ప్రభుత్వం వ్యవస్థల పునరుద్ధరణకు శ్రీకారం చుట్టిందన్నారు.
గత పాలనలోని లోపాలను ప్రజల ముందు ఉంచేందుకు ప్రభుత్వం 7 శ్వేత పత్రాలను విడుదల చేసింది. 'పది సూత్రాల' ద్వారా సుపరిపాలన అందిస్తూ, అభివృద్ధిని, సంక్షేమాన్ని సమతూకంగా నడిపిస్తోంది. ప్రజలే కేంద్రబిందువుగా ప్రతి నిర్ణయం తీసుకుంటూ పారదర్శకమైన పాలనను అందిస్తోందని గవర్నర్ స్పష్టం చేశారు.
సంక్షేమ పథకాలు - 'సూపర్ సిక్స్' విప్లవం
ప్రభుత్వం ఎన్నికల హామీలైన 'సూపర్ సిక్స్' పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తోందని, దీనికోసం ఏటా రూ. 33,000 కోట్లను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి వేస్తున్నట్లు తెలిపారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద నగదు బదిలీ కార్యక్రమాల్లో ఒకటిగా నిలిచిందని ప్రశంసించారు. 63.12 లక్షల మందికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, 66 లక్షల మందికి 'తల్లికి వందనం' ద్వారా ఆర్థిక సాయం అందుతోంది.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు 'అన్నదాత సుఖీభవ' కింద రూ. 20,000 సాయం, 'దీపం 2.0' ద్వారా మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ విజయవంతంగా సాగుతోందని గవర్నర్ తెలిపారు. 'స్వయం' బ్రాండింగ్ ద్వారా డ్వాక్రా మహిళల ఉత్పత్తులకు గుర్తింపు తెస్తోంది. ఉపాధి హామీ పథకం కింద పనిదినాలను 100 నుండి 125 రోజులకు పెంచడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తోంది.
యువత భవిష్యత్తు కోసం ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. మెగా డీఎస్సీ ద్వారా 15,941 ఉపాధ్యాయ పోస్టుల భర్తీతో పాటు, 5,757 పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల రిక్రూట్‌మెంట్‌ను పూర్తి చేసింది. స్కిల్ డెవలప్‌మెంట్ ద్వారా యువతకు అంతర్జాతీయ స్థాయి ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేసిందని తెలిపారు.
ప్రజల ఆరోగ్య భద్రత కోసం 'సంజీవని' కార్యక్రమాన్ని బలోపేతం చేస్తోంది. యూనివర్సల్ హెల్త్ పాలసీ ద్వారా రాష్ట్రంలోని ప్రతి వ్యక్తికి రూ. 2.5 లక్షల ఆరోగ్య బీమా, పేద కుటుంబాలకు రూ. 25 లక్షల వరకు నగదు రహిత వైద్యం అందిస్తోంది. ముఖ్యంగా క్యాన్సర్ వంటి ఖరీదైన చికిత్సలకు ఎటువంటి పరిమితి లేకుండా ఉచిత వైద్యం అందించడం ఒక చారిత్రాత్మక నిర్ణయమన్నారు.
రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టును 2027 జూన్ నాటికి పూర్తి చేసేందుకు ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉంది. హంద్రీనీవా ద్వారా రాయలసీమకు నీరు, వంశధార - నదుల అనుసంధానం వంటి ప్రాజెక్టుల ద్వారా సాగునీటి రంగాన్ని బలోపేతం చేస్తోంది. విద్యుత్ రంగంలో తప్పుడు నిర్ణయాలను సవరించి, దేశానికే మోడల్‌గా నిలిచింది.
పారిశ్రామిక ప్రగతి - నాలెడ్జ్ ఎకానమీ
ఐటీ, క్వాంటం కంప్యూటింగ్ రంగాల్లో ఏపీని గమ్యస్థానంగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. సీఐఐ సదస్సు ద్వారా రూ. 13.25 లక్షల కోట్ల పెట్టుబడులకు 610 ఒప్పందాలు కుదిరాయి, తద్వారా 16.13 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. స్పేస్ సిటీ, డ్రోన్ సిటీ, సెమీ కండక్టర్ ఎకో సిస్టమ్ వంటివి రాష్ట్ర రూపురేఖలను మార్చనున్నాయని గవర్నర్ అన్నారు. .
అమరావతి, రీజినల్ డెవలప్‌మెంట్
రాష్ట్ర రాజధాని అమరావతిని గ్రీన్ ఫీల్డ్ రాజధానిగా తిరిగి నిర్మిస్తున్నామని, కేంద్ర ప్రభుత్వం దీనికి చట్టబద్ధమైన శాశ్వత రాజధాని హోదా కల్పించే ప్రక్రియను ప్రారంభించిందని తెలిపారు. సింగపూర్ ప్రభుత్వ సహకారంతో డిజిటల్ గవర్నెన్స్, పట్టణ అభివృద్ధిలో ఒప్పందాలు చేసుకున్నట్లు వివరించారు.అమరావతిలో 'క్వాంటం వ్యాలీ' స్థాపనతో కొత్త అధ్యాయం మొదలైంది. విశాఖ, తిరుపతి, అమరావతి కేంద్రాలుగా మూడు రీజియన్లుగా విభజించి రాష్ట్రవ్యాప్తంగా సమాన అభివృద్ధిని సాధించేలా కార్యాచరణ రూపొందించారన్నారు.
పర్యావరణ పరిరక్షణలో భాగంగా 'స్వచ్ఛాంధ్ర' కార్యక్రమాన్ని చేపట్టింది. ఏపీని క్లీన్ ఎనర్జీ ఎకనామిక్ హబ్‌గా మార్చేందుకు గ్రీన్ హైడ్రోజన్, పునరుత్పాదక ఇంధన రంగాలపై దృష్టి పెట్టింది. 18 ఏళ్ల లోపు వారికి సోషల్ మీడియా వినియోగంపై నియంత్రణ వంటి సామాజిక సంస్కరణల దిశగా కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తోంది.
నూతన జనాభా విధానం:
రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు (1.5) తగ్గడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ, జనాభా నిర్వహణ ముసాయిదాను ప్రవేశపెట్టినట్లు గవర్నర్ వెల్లడించారు. వృద్ధుల సంఖ్య పెరగడం, యువశక్తి తగ్గడం వంటి సవాళ్లను ఎదుర్కోవడానికి ఇది దోహదపడుతుందన్నారు.
రాజకీయ ఉత్కంఠ - వైకాపా వాకౌట్
వైయస్‌ఆర్‌సీపీ అధినేత వైయస్ జగన్, శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా తిరుమల లడ్డూపై తప్పుడు ప్రచారం, సభ్యుల హక్కులను కాపాడాలని, ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని, ఏపీలో శాంతిభద్రతలు కాపాడాలని, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై అసెంబ్లీలో వైయస్‌ఆర్‌సీపీ సభ్యులు నిరసనచేశారు.
గవర్నర్ ప్రసంగం ప్రారంభం కాగానే వైకాపా సభ్యులు ప్రతిపక్ష హోదా కోసం నినాదాలు చేస్తూ నిరసన తెలుపుతూ, సభ ప్రారంభమైన 11 నిమిషాలకే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో సభ్యులు వాకౌట్ చేశారు.
ఏపీ బడ్జెట్ సమావేశాల షెడ్యూలు - 2026
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 2026 ఫిబ్రవరి 11న అధికారికంగా ప్రారంభం కాగా, మొత్తం 17 రోజుల పాటు నిర్వహించ తలపెట్టిన ఈ సమావేశాలు మార్చి 7వ తేదీ వరకు కొనసాగుతాయి. అయితే సభలో జరిగే చర్చలు, అవసరాలను బట్టి ఈ గడువును మరింత పొడిగించే అవకాశం కూడా ఉంది. సభ ప్రతిరోజూ ఉదయం 9 గంటలకు ప్రారంభమై, మధ్యాహ్నం 2:00 గంటల వరకు కొనసాగుతుంది. ప్రజా సమస్యలను తక్షణమే ప్రస్తావించడానికి వీలుగా ప్రతిరోజూ సభలో 'జీరో అవర్' ను కూడా కేటాయించారు. ఉదయం 10 గంటలకు ప్రశ్నోత్తరాల సమయం ఉంటుంది.
ఈ సమావేశాల్లో అత్యంత కీలకమైన ఘట్టం ఫిబ్రవరి 14న జరగనుంది. ఆ రోజున రాష్ట్ర ఆర్థిక మంత్రి శాసనసభలో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. అనంతరం ఫిబ్రవరి 17, 18 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ జరుగుతుంది. చర్చ ముగిసిన తర్వాత 18వ తేదీ సాయంత్రం ఆర్థిక మంత్రి సభలో సమాధానం ఇస్తారు. ఫిబ్రవరి 15, 16 తేదీల్లో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా, అలాగే మార్చి 1, 2, 3 తేదీల్లో సభకు సెలవులు ప్రకటించారు. ఫిబ్రవరి 24,25, 26 తేదీలలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం క్రీడాపోటీలు నిర్వహిస్తారు.
బడ్జెట్ ఆమోదం పొందే క్రమంలో భాగంగా ఫిబ్రవరి 19 నుండి సుమారు ఎనిమిది రోజుల పాటు వివిధ ప్రభుత్వ శాఖల పద్దులపై లోతైన చర్చలు జరుగుతాయి. ఈ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రభుత్వం గతంలో తీసుకొచ్చిన 6 కీలక ఆర్డినెన్స్‌లకు కూడా సభ ఆమోదం తెలపనుంది. అంతేకాకుండా, పారదర్శకత కోసం ఈసారి ఎమ్మెల్యేలకు డిజిటల్ హాజరు విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు.
