Let's talk: editor@tmv.in
ఏపీలో పెట్టుబడుల ప్రచారంపై వైఎస్సార్సీపీ ఫైర్

ఏపీలో పెట్టుబడుల ప్రచారంపై వైఎస్సార్సీపీ ఫైర్

Gaddamidi Naveen
22 జులై, 2026

ఆంధ్రప్రదేశ్‌లో భారీగా పెట్టుబడులు ఆకర్షించడంతో పాటు పెద్ద ఎత్తున ఉద్యోగాలు సృష్టించామని టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం చేస్తున్న వాదనలను వైఎస్సార్సీపీ తీవ్రంగా ప్రశ్నించింది. లోక్‌సభలో వైఎస్సార్సీపీ ఎంపీ పి.వి. మిథున్ రెడ్డి అడిగిన ఒక ప్రశ్నకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద ఇచ్చిన లిఖితపూర్వక సమాధానాన్ని ఆధారంగా చేసుకుని రాష్ట్ర ప్రభుత్వ తీరును ఎండగట్టింది.

డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ), ఇన్వెస్ట్ ఇండియా పర్యవేక్షణలో గత రెండేళ్ల వ్యవధిలో ఏపీలో కేవలం 10 పెట్టుబడి ప్రాజెక్టులు మాత్రమే గ్రౌండ్ అయ్యాయని కేంద్ర మంత్రి తన సమాధానంలో వెల్లడించారు. ఈ గణాంకాలను ఉటంకిస్తూ.. వీటిలో కేవలం రెండు ప్రాజెక్టుల నిర్మాణం మాత్రమే పూర్తయిందని, మిగిలిన ఎనిమిది ప్రాజెక్టులు ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నాయని వైఎస్సార్సీపీ పేర్కొంది. కేంద్రం ఇచ్చిన సమాధానం ప్రకారం, ఈ ప్రాజెక్టులకు సంబంధించిన అంచనా పెట్టుబడి రూ. 6,962 కోట్లు కాగా, ఇవి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చిన తర్వాత 22,167 ఉద్యోగాలు రాగలవని అంచనా మాత్రమే వేశారు. ఇవి వాస్తవంగా కల్పించిన ఉద్యోగాలు కావని పార్టీ నేతలు విమర్శించారు.

రాష్ట్రంలో ఇప్పటి వరకు వాస్తవంగా వచ్చిన పెట్టుబడులు ఎన్ని? వాణిజ్యపరంగా ఉత్పత్తి ప్రారంభించిన పరిశ్రమలు ఎన్ని? ప్రస్తుతం ఎంతమందికి వాస్తవంగా ఉపాధి లభించింది? అని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది.

శిక్షణ ఉందే తప్ప.. పరిశ్రమలు ఏవి?

కేంద్రం ఇచ్చిన మరో సమాధానాన్ని సైతం వైఎస్సార్సీపీ ప్రస్తావించింది. 2024-25లో 201 ఔత్సాహిక పారిశ్రామికవేత్తల అభివృద్ధి కార్యక్రమాల్లో 10,093 మంది పాల్గొనగా, 2025-26లో 625 కార్యక్రమాల్లో 32,428 మంది పాల్గొన్నారని కేంద్రం తెలిపింది. అయితే, శిక్షణ పొందిన ఈ వ్యక్తులలో వాస్తవంగా ఎంతమంది సొంతంగా పరిశ్రమలు స్థాపించారు? ఎంతమందికి ఆర్థిక సహాయం అందింది? ఎంతమంది ఎంఎస్‌ఎంఈలు ప్రారంభించి ఉపాధి కల్పించారనే దానికి సంబంధించిన స్పష్టమైన డేటా ఇందులో లేదని వైఎస్సార్సీపీ ఎత్తిచూపింది.

పారిశ్రామిక వృద్ధి, ఉద్యోగ కల్పనపై టీడీపీ కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రచారానికి, క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితులకు మధ్య భారీ వ్యత్యాసం ఉందన్న విషయం కేంద్రం ఇచ్చిన సమాధానాలతో స్పష్టమైందని వైఎస్సార్సీపీ ఆరోపించింది. కేవలం పెట్టుబడి ప్రతిపాదనలను, భవిష్యత్తులో వచ్చే ఉద్యోగాల అంచనాలను మాత్రమే చూపిస్తూ.. వాటిని సాధించిన ఘన విజయాలుగా ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని దుయ్యబట్టింది.