
ఏపీలో పారిశ్రామిక వృద్ధికి ఇంధన పొదుపే కీలకం: ఏపీఎస్‌ఈసీఎం సీఈఓ
రాష్ట్రంలో స్థిరమైన పారిశ్రామిక వృద్ధిని సాధించాలంటే గుర్తించిన శక్తి సామర్థ్య (ఎనర్జీ ఎఫిషియెన్సీ) ప్రాజెక్టులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయడం అత్యవసరమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్ ప్రధాన కార్యనిర్వాహక అధికారి పి.పుల్లారెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం జరిగిన ఆరో ‘ఇన్వెస్ట్‌మెంట్ బజార్’ వర్క్‌షాప్‌లో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. ఈ సందర్భంగా పరిశ్రమలు, ఎంఎస్ఎంఈలు, బ్యాంకర్లు, సాంకేతిక నిపుణులను ఉద్దేశించి ఆయన కీలక సూచనలు చేశారు.
రూ. 400 కోట్ల ప్రాజెక్టుల గుర్తింపు
రాష్ట్రంలో సాంకేతిక సామర్థ్యాన్ని ఆర్థికంగా లాభదాయకమైన పెట్టుబడులుగా మార్చుకోవాల్సిన అవసరం ఉందని పుల్లా రెడ్డి పేర్కొన్నారు. ఇప్పటివరకు నిర్వహించిన ఐదు ఇన్వెస్ట్‌మెంట్ బజార్ల ద్వారా సుమారు రూ. 400 కోట్లకు పైగా విలువైన శక్తి సామర్థ్య ప్రాజెక్టులను గుర్తించినట్లు వెల్లడించారు. ఈ ప్రాజెక్టులకు త్వరితగతిన ప్రాజెక్టుకు అవసరమైన పెట్టుబడులను సమకూర్చుకొని క్షేత్రస్థాయిలో అమలు చేస్తేనే అంతర్జాతీయ స్థాయిలో మన పరిశ్రమల పోటీతత్వం పెరుగుతుందని తద్వారా వాతావరణ మార్పుల నియంత్రణలో ఏపీ ముందంజలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు.
అదేవిధంగా పరిశ్రమలు, సంస్థల్లో శక్తి సామర్థ్య సాంకేతికతను ప్రోత్సహించేందుకు ప్రవేశపెట్టిన ‘అదితీ’ పథకాన్ని పారిశ్రామికవేత్తలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ పథకం కింద సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు 5 శాతం, మధ్య తరహా పరిశ్రమలకు 3 శాతం వడ్డీ సబ్సిడీ లభిస్తుందని వివరించారు. మొత్తం 14 ప్రధాన రంగాలకు ఈ పథకం వర్తిస్తుందని ఇందులో ముఖ్యంగా గోదావరి జిల్లాల్లోని మత్స్య, గ్లాస్, రిఫ్రాక్టరీ క్లస్టర్లకు కూడా చోటు కల్పించినట్లు తెలిపారు.
మరోవైపు రాష్ట్ర ఇంధన సామర్థ్య విధానం 2024-2028లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 123 పట్టణ స్థానిక సంస్థల్లో ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్ -2017 అమలును ప్రభుత్వం తప్పనిసరి చేసిందని పుల్లా రెడ్డి గుర్తుచేశారు. ఇప్పటికే 1,800కు పైగా భవనాలకు ఈ నిబంధనల ప్రకారం అనుమతులు జారీ చేసినట్లు చెప్పారు. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ మార్గదర్శకాల్లో భాగంగా అమలు చేస్తున్న ‘ప్యాట్’ విధానం ద్వారా రాష్ట్రంలోని 59 పరిశ్రమలు 1.3 మిలియన్ టన్నుల ఆయిల్ సమాన శక్తిని ఆదా చేయడం విశేషమన్నారు. ఇక రుణ సౌలభ్యం కోసం 11 బ్యాంకులు, రెండు ఎన్‌బీఎఫ్‌సీలతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశామని ఇంధన పొదుపులో ఆంధ్రప్రదేశ్ వరుసగా నాలుగోసారి ‘జాతీయ శక్తి సంరక్షణ అవార్డు-2025’లో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకోవడం గర్వకారణమని ఆయన కొనియాడారు.
